logo

Chandrababu: కుప్పం నుంచి ఎనిమిదోసారి చంద్రబాబు

సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా తరఫున అసెంబ్లీకి పోటీ చేయబోయే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు శనివారం ప్రకటించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఏడు చోట్ల టికెట్లు ఖరారు చేశారు.

Updated : 25 Feb 2024 07:41 IST

పలమనేరు, నగరి, గూడూరు టికెట్లు అమరనాథరెడ్డి, భానుప్రకాష్‌, సునీల్‌కుమార్‌లకే
కొత్తగా చిత్తూరులో గురజాల.. జీడీనెల్లూరులో థామస్‌, సూళ్లూరుపేటలో విజయశ్రీ
అభ్యర్థులను ప్రకటించిన తెదేపా అధినేత

ఈనాడు, చిత్తూరు: సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా తరఫున అసెంబ్లీకి పోటీ చేయబోయే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు శనివారం ప్రకటించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఏడు చోట్ల టికెట్లు ఖరారు చేశారు. పుంగనూరు, పూతలపట్టు, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి శాసనసభ అభ్యర్థుల పేర్లను పెండింగ్‌లో ఉంచారు. పాత, కొత్తల మేలు కలయికగా జాబితా ఉంది. తొలి నుంచి భావించినట్లే కుప్పం నుంచి చంద్రబాబు, పలమనేరులో అమరనాథరెడ్డి, నగరిలో భానుప్రకాష్‌, గంగాధర నెల్లూరులో వీఎం థామస్‌, గూడూరులో మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌, సూళ్లూరుపేటలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీలను అభ్యర్థులుగా ప్రకటించారు. చిత్తూరులో ఐదుగురు పోటీ పడగా అన్నివిధాలా ధీటైన గురజాల జగన్మోహన్‌కు అవకాశం కల్పించారు. చంద్రబాబు పదోసారి, అమరనాథరెడ్డి ఏడోసారి, గాలి భానుప్రకాష్‌ రెండోసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. థామస్‌, గురజాల జగన్మోహన్‌, విజయశ్రీలు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో గురజాల, భానుప్రకాష్‌, విజయశ్రీలకు 50 ఏళ్లలోపే ఉండటం గమనార్హం. విజయశ్రీ ఎంబీబీఎస్‌, సునీల్‌కుమార్‌, థామస్‌లు పీహెచ్‌డీ, నగరి, కుప్పం అభ్యర్థులు పీజీ వరకు, పలమనేరు అభ్యర్థి డిగ్రీ చదివారు.

కంచుకోట నుంచి మరోసారి పసుపు దళపతి

తొలి జాబితాలో 94 మంది అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. చివర్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు బరిలోకి దిగుతారని నవ్వుతూ తెలిపారు. దీంతో ఎనిమిదోసారి ఈ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమైంది. 1989 నుంచి చంద్రబాబు వరుసగా కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థులు మారుతున్నారే తప్ప ఆయన విజయాన్ని మాత్రం ఆపలేకపోతున్నారు. రాష్ట్రంలో మారుమూల ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఉద్యానహబ్‌గా తీర్చిదిద్ది రైతుల స్థితిగతులు మార్చడంతో ప్రతిసారీ చంద్రబాబుకే ఓటర్లు పట్టం కడుతున్నారు. ఈ స్థానాన్ని ఆయన కంచుకోటగా మార్చుకున్నారు.  

చిత్తూరు తెదేపా శ్రేణుల ద్విచక్రవాహన ప్రదర్శన

సేవాసారథి జగన్మోహన్‌కే అవకాశం

చిత్తూరు నియోజకవర్గంలో ఈ దఫా తెదేపా తరఫున ఎక్కువ మంది ఆశావహులు కనిపించారు. అభ్యర్థిని ప్రకటించే వరకు గురజాల జగన్మోహన్‌, కఠారి హేమలత, చంద్రప్రకాష్‌, సీఆర్‌ రాజన్‌, కాజూరు బాలాజీ కలిసికట్టుగా ప్రచారం చేస్తారని మాజీ ఎమ్మెల్సీ దొరబాబు తెలిపారు. అధిష్ఠానం ఎవరికి సీటిచ్చినా అందరూ సహకరిస్తామని స్పష్టంగా చెప్పడంతోపాటు అందరూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. జనసేన నుంచి ఆదికేశవులు నాయుడి మనవరాలు చైతన్య లలితాంబిక తీవ్ర ప్రయత్నాలు చేశారు.  ఇప్పట్లో టికెట్‌ పంచాయితీ తెగదని భావించగా.. తొలి జాబితాలోనే స్పష్టత వచ్చింది. బెంగళూరు కేంద్రంగా వ్యాపారాలు చేస్తూ కొంతకాలంగా చిత్తూరులో సేవా కార్యక్రమాలు చేస్తున్న గురజాల జగన్మోహన్‌ పేరును అభ్యర్థిగా ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది. ప్రజలు, కార్యకర్తల నుంచి విస్తృత స్థాయిలో అభిప్రాయాలు సేకరించి, ఐవీఆర్‌ఎస్‌ ద్వారా పలుమార్లు మనోగతం తెలుసుకుని వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డికి సరితూగుతాడనే అంచనాకు వచ్చిన తర్వాతే గురజాల జగన్‌కు చిత్తూరు సీటు కట్టబెట్టారు.


పలమనేరులో నాలుగోసారి అమరనాథరెడ్డి

తెదేపా సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి అమరనాథరెడ్డి వరుసగా ఏడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. 1996 నుంచి 2019 వరకు జరిగిన ప్రతి అసెంబ్లీ ఎన్నికలోనూ ఆయన అభ్యర్థిగా ఉన్నారు. పుంగనూరు నుంచి మూడుసార్లు బరిలోకి దిగగా రెండుసార్లు, పలమనేరులో మూడుసార్లు పోటీ చేసి రెండు దఫాలు గెలుపొందారు. తాజాగా నాలుగోసారి పలమనేరు నుంచి తెదేపా అభ్యర్థిగా నిలిచారు. గత ఎన్నికల్లో ఎక్కడెక్కడ నష్టం జరిగిందో గుర్తించి ఇప్పటికే ఆయన నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. ఇక్కడ వైకాపా నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం ఆ పార్టీ అధిష్ఠానం ఇంకా ప్రకటించలేదు.

పూతలపట్టులో ప్రస్తుత నియోజకవర్గ ఇన్‌ఛార్జి మురళీ మోహన్‌కే ఎక్కువ అవకాశాలున్నాయి.  పుంగనూరు నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపికపై వారం పది రోజుల్లో స్పష్టత వస్తుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి.


భానుపై నమ్మకం ఉంచి..

నగరి తెదేపా అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో పోటీ చేసిన గాలి భానుప్రకాష్‌కే మరోసారి అవకాశం కల్పించారు. గత ఎన్నికల్లో ఫ్యాను గాలి బలంగా వీచినప్పటికీ మంత్రి రోజాపై కేవలం 2,708 ఓట్లతో ఓటమి చవిచూసిన భానుపై అధిష్ఠానం నమ్మకం  ఉంచింది.


ముందుగానే థామస్‌కు సంకేతాలు

తెదేపా ఆవిర్భావం తర్వాత గంగాధరనెల్లూరు (పాత వేపంజేరిలోనూ) నియోజకవర్గంలో రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది. దీంతో ఈ స్థానంలో విజయాన్ని పార్టీ అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని థామస్‌ను అభ్యర్థిగా ఖరారు చేశారు. గతేడాది జనవరిలో నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు ఇచ్చినప్పుడే పోటీకి సిద్ధంగా ఉండాలని చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. ఫిబ్రవరి 6న గంగాధరనెల్లూరులో జరిగిన ‘రా.. కదలిరా’ సభలో సైతం తెదేపా అధినేత ఈవిషయాన్ని పునరుద్ఘాటించారు. వైకాపా నుంచి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పేరును ప్రకటించిన నేపథ్యంలో సార్వత్రిక సమరంలో హోరాహోరీ పోరు తప్పదు.


తొలి ప్రాధాన్యం ఎస్సీలకే..!

ఈనాడు-తిరుపతి: తిరుపతి జిల్లా పరిధిలో ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలను అభ్యర్థులుగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. గూడూరు నుంచి మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌, సూళ్లూరుపేట నుంచి మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీలు ఇందులో స్థానం పొందారు. తెదేపా తొలి జాబితాలో ఎంపికైన ఇద్దరూ విద్యాధికులే. సునీల్‌కుమార్‌ పీహెచ్‌డీ పూర్తి చేశారు. విజయశ్రీ ఎంబీబీఎస్‌ చేసి ప్రస్తుతం వైద్యురాలిగా పనిచేస్తున్నారు. నేరచరితులకు చెక్‌పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు వీరిని ఎన్నికల బరిలో నిలబెట్టారని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

మరోవైపు మిగిలిన ఐదు నియోజకవర్గాలపైన అధినేత దృష్టిసారించారు. తెదేపా-జనసేన పొత్తులో భాగంగా కొన్ని సీట్లు పంచుకోవాల్సి ఉంది. ఇక్కడ జలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అధికంగా ఉండటంతో జిల్లాలో జనసేనకు సీటు కేటాయించే ఆస్కారం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు భాజపాతో పొత్తు ఖరారైతే జిల్లాలో ఆ పార్టీకి ఒక సీటు కేటాయించే ఆస్కారం ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని కొన్ని సీట్లను ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు.


సంబరాల్లో తెదేపా నేతలు

పుత్తూరు: భానుప్రకాష్‌ను అభ్యర్థిగా ఖరారు చేయడంతో మిఠాయిలు  తినిపించుకుంటున్న తెదేపా నాయకులు

అభ్యర్థుల తొలి జాబితాను అధిష్ఠానం ప్రకటించడంతో తెదేపా  శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.  చిత్తూరు తెదేపా- జనసేన ఉమ్మడి అభ్యర్థి గురజాల జగన్మోహన్‌ నగరంలోని మురకంబట్టులోని ఆదికేశవులు నాయుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీ కూడలి, దర్గా కూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహం వరకు ప్రదర్శనగా సాగి పూలమాలలు వేశారు. గాంధీ విగ్రహం వద్ద ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డగించడంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది.

  • గంగాధరనెల్లూరుకు థామస్‌ను ఎంపిక చేయడంతో వెదురుకుప్పం మండలం చవటగుంట కూడలి, పాలసముద్రంలో టపాసులు కాల్చారు. నగరి అసెంబ్లీ అభ్యర్థిగా భానుప్రకాష్‌ పేరును ప్రకటించడంతో పుత్తూరు, నగరి పట్టణాల్లో స్వీట్లు పంచుకున్నారు.

కుప్పం

అభ్యర్థి: నారా చంద్రబాబు నాయుడు
పుట్టిన తేదీ: 20.04.1950 (73 ఏళ్లు)
తల్లిదండ్రులు: అమ్మణ్ణమ్మ, ఖర్జూరనాయుడు
భార్య /భర్త: భువనేశ్వరి  
సంతానం: లోకేశ్‌
విద్యార్హత: ఎంఏ ఎకనామిక్స్‌

రాజకీయ నేపథ్యం: 1978లోచంద్రగిరి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఎన్నిక. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, 1983లో తెదేపాలో చేరిక. 1989లో కుప్పం ఎమ్మెల్యేగా విజయం. 1994లో ఆర్థిక, రెవెన్యూశాఖ మంత్రిగా, 1995- 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు, 2014-19: నవ్యాంధ్ర సీఎంగా బాధ్యతల స్వీకరణ.


గూడూరు

అభ్యర్థి: పాశిం సునీల్‌కుమార్‌
పుట్టిన తేదీ: 03.06.1969 (54 ఏళ్లు)
తల్లిదండ్రులు: సరోజనమ్మ, పెంచలయ్య
భార్య /భర్త: సంధ్యారాణి
సంతానం: జస్వంత్‌కుమార్‌
విద్యార్హత: ఎంఏ, పీహెడీ

రాజకీయ నేపథ్యం: ఏబీవీపీ నేతగా, గూడూరు నగర ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడిగా, ఎస్‌కేఆర్‌ ప్రభుత్వ కళాశాల విద్యార్థి సంఘ నేతగా, గూడూరు మున్సిపల్‌ ఛైర్మన్‌ (తెదేపా)గా, తెదేపా జిల్లా  అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 2014లో వైకాపా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆపై తెదేపాలో చేరారు.


సూళ్లూరుపేట

అభ్యర్థి: నెలవల విజయశ్రీ
​​​​​​​పుట్టిన తేదీ: 22.10.1986 (37 ఏళ్లు)
తల్లిదండ్రులు: అమృతసరళ, సుబ్రహ్మణ్యం
భార్య /భర్త: పార్థసారథి  
సంతానం: జాగృతి, అభినయ్‌
విద్యార్హత: ఎంబీబీఎస్‌

రాజకీయ నేపథ్యం: 2022 నుంచి సూళ్లూరుపేట నియోజకవర్గ మహిళ విభాగం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం: తిరుపతిలోని ఆస్టర్‌ నారాయణాద్రి ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు.


నగరి

అభ్యర్థి​​​​​​​: గాలి భానుప్రకాష్‌
​​​​​​​పుట్టిన తేదీ: 20.06.1976 (47 ఏళ్లు)
తల్లిదండ్రులు: సరస్వతమ్మ, ముద్దుకృష్ణమనాయుడు
భార్య /భర్త: శిరీష
సంతానం: కృష్ణ, రామ్‌నాయుడు
విద్యార్హత: ఎంఎస్‌

రాజకీయ నేపథ్యం: తండ్రి ముద్దుకృష్ణమ నాయుడితోపాటు 2009, 2014 ఎన్నికల్లో ప్రచారం, 2019 ఎన్నికల్లో నగరి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి 2,708 ఓట్ల తేడాతో ఓడిపోయారు.


జీడీ నెల్లూరు

అభ్యర్థి​​​​​​​: వీఎం థామస్‌
​​​​​​​పుట్టిన తేదీ: 28.06.1974 (50 ఏళ్లు)
తల్లిదండ్రులు: రాణి, ప్రకాశం
భార్య /భర్త: అనార్కళి రెడ్డి
సంతానం: ​​​​​రాహుల్‌, రోషన్‌
విద్యార్హత: ఎంఎస్సీ, పీహెచ్‌డీ

రాజకీయ నేపథ్యం: చెన్నైలో ఐవీఎఫ్‌ శాస్త్రవేత్త, ఫెర్టిలిటీ నిపుణుడిగా ఉంటూ తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు.


పలమనేరు

అభ్యర్థి​​​​​​​: అమరనాథ రెడ్డి
​​​​​​​పుట్టిన తేదీ: 02.07.1959 (64 ఏళ్లు)
తల్లిదండ్రులు: తాయారమ్మ, రామకృష్ణారెడ్డి
భార్య /భర్త: రేణుకారెడ్డి
సంతానం: ప్రసేన్‌రెడ్డి
విద్యార్హత: బీకాం

రాజకీయ నేపథ్యం: తండ్రి రామకృష్ణారెడ్డి మూడుసార్లు పుంగనూరు ఎమ్మెల్యేగా, మూడుసార్లు చిత్తూరు ఎంపీగా వ్యవహరించారు. అమరనాథరెడ్డి పెద్దపంజాణి మండలం వీరపల్లె సర్పంచి, రాష్ట్ర  తెలుగు యువత అధ్యక్షుడు, ఉమ్మడి చిత్తూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్‌, పుంగనూరు ఎమ్మెల్యే (1996-99, 2004-09), పలమనేరు ఎమ్మెల్యే (2009- 19), తెదేపా హయాంలో మంత్రిగా ఉన్నారు.


చిత్తూరు

అభ్యర్థి: గురజాల జగన్మోహన్‌
​​​​​​​పుట్టిన తేదీ: ​​​​​​​15.01.1983 (41 ఏళ్లు)
తల్లిదండ్రులు: రజని, చెన్నకేశవులు నాయుడు
భార్య /భర్త: ప్రతిమ
సంతానం: నితీష్‌
విద్యార్హత: పదో తరగతి

రాజకీయ నేపథ్యం: తండ్రి నుంచి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన జగన్మోహన్‌ 2014 సార్వత్రిక ఎన్నికల్లో తంబళ్లపల్లె తెదేపా అభ్యర్థి శంకర యాదవ్‌ విజయానికి సహకరించారు. చిత్తూరు నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని