logo

Leap Year: లీపు సంవత్సరం వస్తే వారికి పండగే

సాధారణంగా చిన్నారులకు ఏటా పుట్టినరోజును తల్లిదండ్రులు వేడుకగా నిర్వహిస్తారు. వివాహ వార్షికోత్సవాలను పెద్దలు సైతం జరుపుకొంటారు. అయితే వారికి ఇలాంటి వేడుకలన్నీ నాలుగేళ్లకు ఓసారి మాత్రమే వస్తుంటాయి.

Updated : 29 Feb 2024 08:58 IST

పుంగనూరు, కల్లూరు, న్యూస్‌టుడే: సాధారణంగా చిన్నారులకు ఏటా పుట్టినరోజును తల్లిదండ్రులు వేడుకగా నిర్వహిస్తారు. వివాహ వార్షికోత్సవాలను పెద్దలు సైతం జరుపుకొంటారు. అయితే వారికి ఇలాంటి వేడుకలన్నీ నాలుగేళ్లకు ఓసారి మాత్రమే వస్తుంటాయి. పుట్టినరోజు, పెళ్లిరోజు తదితర వేడుకల కోసం అంతవరకు నిరీక్షించాల్సిందే. లీపు సంవత్సరంలో జన్మించిన, వివాహం చేసుకున్న వారికి ఫిబ్రవరి 29 చాలా ప్రత్యేకం. ఈ సంవత్సరం లీపు సంవత్సరం కావడంతో వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు జిల్లాలోని పలువురు.  

నాలుగేళ్లకు ఓసారే ఎందుకంటే

ఒక ఏడాదికి 365 రోజుల 6 గంటలు సమయం. 24 ఒక రోజు లెక్కిస్తాం కాబట్టి.. ఏటా అదనంగా వచ్చిన 6 గంటలను ప్రత్యేకంగా చూపలేం. దీని కోసం నాలుగేళ్లలోని సమయాన్ని 24 గంటలుగా లెక్కించి ఫిబ్రవరి 29 ప్రకటించారు. ఏటా ఫిబ్రవరిలో 28 రోజులుంటే లీపు సంవత్సరంలో అదనంగా మరో రోజు లెక్కించి చూపుతారు.


ఎంతో ఆనందం..

భర్త మనోహర్‌తో జ్ఞానప్రసూన

చౌడేపల్లె మండలం బోయకొండ ఆర్‌ఆర్‌ కాలనీకి చెందిన జ్ఞానప్రసూన 1996 ఫిబ్రవరి 29న జన్మించారు. తల్లిదండ్రులు ప్యారీ, కృష్ణమూర్తి ప్రతిసారి ఘనంగా చేసేవారు. 2016లో మనోహర్‌తో వివాహమైంది. అప్పటి నుంచి భర్త, తల్లిదండ్రుల సమక్షంలో వేడుకలు జరుపుకొంటున్నారు. నాలుగేళ్లకు ఒకసారి వస్తుండటంతో కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితుల మధ్య వేడుకలు ఘనంగా చేసుకుంటున్నారు.


పన్నెండేళ్లు.. నాలుగో జన్మదిన వేడుక

తల్లిదండ్రుల నడుమ జన్మదినం చేసుకుంటున్న మిస్బా

కల్లూరుకు చెందిన ఇంతియాజ్‌ కుమార్తె మిస్బా. ఆరో తరగతి చదువుతోంది. 2012 ఫిబ్రవరి 29న జన్మించింది. ఈ పన్నెండేళ్ల కాలంలో నాలుగో దఫా జన్మది వేడుకలకు సిద్ధమైంది. పాఠశాలలో తోటి విద్యార్థులు, స్నేహితులు ఏటా పుట్టినరోజు చేసుకుంటుంటే కొంతమేర చిన్నబుచ్చుకునేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. గత రెండు దఫాల్లో అలాంటి పరిస్థితి రాకుండా చాలా ఘనంగా వేడుకలు చేస్తున్నారు. ఫిబ్రవరి 29ని పండగగా చేస్తామని ఆ చిన్నారి తల్లిదండ్రులు చెబుతున్నారు.


కవలలు సైతం..

రాబియా సుల్తానా, రాజియా సుల్తానా

పులిచర్ల మండలం జ్యోతినగర్‌ జెండామాను గ్రామానికి చెందిన వాహిద్‌ కుమార్తెలు రాబియాసుల్తానా, రాజియాసుల్తానా కవలలు. ఫిబ్రవరి 29, 2008లో జన్మించారు. ఇద్దరూ కల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నారు. ఈ ఏడు కీలకం కావడంతో వారు పబ్లిక్‌ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఏటా ఫిబ్రవరి 28న పుట్టినరోజు చేస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని