logo

జగనన్న వినడం లేదు..!

పూతలపట్టు మండలం పి.కొత్తకోటకు చెందిన ఓ వ్యక్తి తన ఇంటి పక్కన ఉన్న విద్యుత్తు స్తంభం ప్రమాదకరంగా ఉందని.. దాన్ని మార్చాలని ‘జగనన్నకు చెబుదాం’ నంబరుకు ఫిర్యాదు చేశారు.

Updated : 01 Mar 2024 06:30 IST

1902కు ఫోన్‌ చేసినా ప్రజలకు లభించని సాంత్వన
అవే సమస్యలు మళ్లీమళ్లీ చెప్పాల్సి వస్తోందంటున్న ప్రజలు

  • పూతలపట్టు మండలం పి.కొత్తకోటకు చెందిన ఓ వ్యక్తి తన ఇంటి పక్కన ఉన్న విద్యుత్తు స్తంభం ప్రమాదకరంగా ఉందని.. దాన్ని మార్చాలని ‘జగనన్నకు చెబుదాం’ నంబరుకు ఫిర్యాదు చేశారు. రోజులు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు. పైగా ఆ సమస్య తీరినట్లు పేర్కొన్నారు. దీంతో  అర్జీదారుడు అభ్యంతరం తెలిపారు.  
  • నగరి మండలానికి చెందిన ఒక వ్యక్తి ఒకరు గ్రామంలో శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని 1902కు ఫోన్‌ చేసి కోరారు. నిర్ణీత సమయం దాటినా భూమి చూపకపోవడంతో మరోసారి ఆయన అదే సమస్యను విన్నవించగా సమస్య నమోదు చేసుకున్నారు.

ఈనాడు, చిత్తూరు: ముఖ్యమంత్రి జగన్‌ మాటలు ఘనం.. చేతలు శూన్యం అన్న రీతిలో పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నామని చెప్పడం మినహా ఆచరణలో కానరావడం లేదు. ఒక్క ఫోన్‌ కాల్‌తో ప్రజా సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చంటూ శ్రీకారం చుట్టిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. దీని అమలు ఎలా ఉందని ఇటీవల కాలంలో పెద్దగా సమీక్షించలేదు. పరిష్కారానికి అవసరమైన నిధులు ఇవ్వకుండా అధికారులపై పూర్తి భారాన్ని నెట్టేయడంతో వారు సతమతమవుతున్నారు. అర్జీదారులు పదేపదే ఫిర్యాదు చేస్తుండటంతో అనివార్యంగా మరోసారి సమస్య నమోదు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని గతేడాది మే 9న ప్రారంభించారు. సంక్షేమ పథకాలతోపాటు ప్రభుత్వ సేవల్లో ఎదురయ్యే ఇబ్బందులను ‘1902’ నంబరుకు ఫోన్‌ చేస్తే సీఎం కార్యాలయం, ఉన్నతాధికారులు ఫిర్యాదులు నమోదు చేసుకుంటారని పేర్కొన్నారు. సమస్య తీవ్రతను బట్టి 24 గంటల నుంచి గరిష్ఠంగా 90 రోజుల్లోగా పరిష్కరిస్తామన్నారు. సచివాలయ ఉద్యోగులు మొదలుకుని కలెక్టర్ల వరకూ ఇందులో భాగస్వాములను చేశామని వెల్లడించారు.
ఈకేవైసీ తీసుకుని పరిష్కరించామంటూ..  నిర్ణీత సమయంలో ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే ఉన్నతాధికారుల నుంచి తాఖీదులు వస్తాయనే భయం అధికారులు, ఉద్యోగుల్లో ఉంది. ఈ నేపథ్యంలో అవి కొలిక్కి రాకముందే ఫిర్యాదు చేసిన వ్యక్తులకు ఫోన్లు చేస్తున్నారు. ముందుగా ఈకేవైసీ వివరాలు ఇవ్వాలని, ఆ తర్వాత కొంత సమయం తీసుకుని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇస్తున్నారు. అధికారులతో సఖ్యతగా ఉంటేనే మంచిదని భావించి పలువురు అర్జీదారులు వారడిగిన వివరాలిస్తున్నారు. ఇలా 90 శాతం ఫిర్యాదులు పరిష్కరించామని నివేదిక ఇస్తున్నారు. కొందరు మాత్రం ససేమిరా అంటుండటంతో నిర్ణీత సమయం దాటినా అవి పరిష్కారానికి నోచుకోలేదని చూపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఫిబ్రవరి 29 నాటికి 39 ఫిర్యాదులుండగా 13 రెవెన్యూ శాఖవే.  

  • ఆరు నుంచి 10 రోజుల్లోగా పరిష్కరించాల్సిన అర్జీలు ఇంకా 624 ఉన్నాయి. ఇందులో 475 రెవెన్యూపరమైనవే. వీటిని ఆ కాలంలోగా తీర్చేయడం కష్టం. దీంతో రెవెన్యూ యంత్రాంగం అర్జీదారుల వెంట పడి ఫిర్యాదులను మూసేందుకు కసరత్తు చేయడం ఖాయం.

సింహభాగం రెవెన్యూవే

జిల్లావ్యాప్తంగా 32 శాఖలకు సంబంధించి ఇటీవల 688 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో సింహభాగం రెవెన్యూకు చెందినవే. ప్రధానంగా భూముల ఆక్రమణ, పొలాలకు దారి లేదని, తమ అనుభవంలో ఉన్న స్థలాలకు వేరే వ్యక్తులకు పట్టాలిచ్చారని ఏకంగా 492 మంది ఫిర్యాదు చేశారు. రెవెన్యూకు అనుబంధంగా ఉన్న సర్వే శాఖకు 40 మంది తమ సమస్యలు విన్నవించారు. పోలీసులు 22, పంచాయతీరాజ్‌ 21, ఏపీఎస్పీడీసీఎల్‌ 19, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ 16, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖపై 13 మంది ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని