logo

కడుపుకోత మిగిల్చిన విహారయాత్ర.. విషాదంలో మూడు కుటుంబాలు

మహాబలిపురం ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది. మరణించిన విజయ్‌తో పాటు, గల్లంతైన మోనిష్‌, ప్రభు జిల్లాకు చెందిన వారే.

Updated : 03 Mar 2024 08:40 IST

పలమనేరు, సదుం,  బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: మహాబలిపురం ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది. మరణించిన విజయ్‌తో పాటు, గల్లంతైన మోనిష్‌, ప్రభు జిల్లాకు చెందిన వారే. వీరు పలమనేరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీ.ఒకేషనల్‌ కోర్సు ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. బంగారుపాళ్యం మండలం కేసీ కండ్రిగ పంచాయతీ నలగాంపల్లె గ్రామానికి విజయ్‌(24), మోనిష్‌(18), సదుం మండలం రెడ్డివారిపల్లె పంచాయతీ పెడగంటివారిపల్లెకు చెందిన ప్రభు(18), అక్కడే చదువుతున్న శ్రీవిద్య, దివ్య, ఇంద్రజ, శ్రావణి, సంతోష్‌, శ్రీను, ధనుంజయరాజు, యశ్వంత్‌, హేమంత్‌, స్వరూప, తేజ, నవీన్‌, వంశీ కళాశాలలో పొరుగు సేవల అధ్యాపకురాలు మౌనిక, వేరే కళాశాలకు చెందిన సుదీప్‌, సంఘవితో కలిసి మొత్తం 18 మంది సరదాగా గడిపేందుకు వెళ్లారు. కళాశాలలో ఉద్యోగ మేళా ఉన్నందున్న సెలవు ప్రకటించడం, వారాంతం కావడంతో వారంతా విహారయాత్రకు వెళ్లినట్లు కళాశాలకు చెందిన మరికొందరు విద్యార్థులు చెబుతున్నారు. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు తమిళనాడు పోలీసులు ఆధీనంలో ఉన్నారు.

కేసీకండ్రిగలో విలపిస్తున్న మోనిష్‌ అవ్వ

 ఒకే కళాశాలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకురాలు విహారయాత్రకు వెళ్తే ఈ విషయం కళాశాల యాజమాన్యంకు తెలియదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

- కూలి పనులు చేసి.. విజయ్‌ను చదివించి: విజయ్‌, మోనిష్‌, యశ్వంత్‌ బంగారుపాళ్యం మండలం కేసీకండ్రిగ గ్రామానికి చెందిన వారు. విజయ్‌ మృతదేహం లభ్యం కాగా.. మోనిష్‌ కోసం గాలిస్తున్నారు. యశ్వంత్‌ ఒడ్డుకు చేరుకొని మృత్యుజయుడయ్యాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విజయ్‌ తల్లిదండ్రులు లత, తులసీపతి నిరుపేదలు. కూలిపనులు చేసి కుమారులు విజయ్‌, దినేష్‌లను చదివిస్తున్నారు. చేతికి అందివచ్చిన కుమారుడు విజయ్‌ మృత్యువాత పడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహం కోసం బంధువులు ఎదురుచూస్తున్నారు.

ఘటనాస్థలి వద్ద పర్యాటకులు

తల్లి సంరక్షణలో పెరిగిన ప్రభు

సదుం మండలం పెడగంటివారిపల్లె గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శివరాణెమ్మకు పులిచెర్ల మండలానికి చెందిన శ్రీనివాసులుతో ఇరవై ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి అను, ప్రభు సంతానం. శ్రీనివాసులు పదేళ్ల క్రితం మృతి చెందటంతో పిల్లలతో కలిసి శివరాణెమ్మ పుట్టింటికి చేరింది. తన కష్టంతో వారిని పెంచింది. కుమార్తె అనుకు వివాహం చేయగా వారు తిరుపతిలో ఉంటున్నారు. ఘటన తెలిసిన సమయంలో శివరాణెమ్మ కుమార్తె వద్దకు వెళ్లింది. గల్లంతు విషయం తెలియడంతో ప్రభు అమ్మమ్మ సిద్ధమ్మ కుప్పకూలిపోయింది.


పరీక్షలు రాసి... సరదాగా వెళ్లి

నీట మునిగి గుంటూరు విద్యార్థి మృతి

సాత్విక్‌ (పాతచిత్రం)

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: ఉదయం పరీక్ష రాసి మధ్యాహ్నం స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందారు. ఈ ఘటన గుడుపల్లె మండలం కొత్తపల్లిలో శనివారం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామానికి చెందిన రాముడి కుమారుడు సాత్విక్‌ (23) కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయంలో ఎంసీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. శనివారం ఉదయం పరీక్షకు హాజరై సహచర విద్యార్థులతో కలిసి వర్సిటీ సమీపంలోని ఓ బావిలో ఈతకొట్టేందుకు వెళ్లారు. అందరితో కలిసి ఈతకొట్టేందుకు యత్నిస్తూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. గుర్తించిన సహచరులు అతన్ని బయటకు తీశారు. అప్పటి మృతి చెందినట్లు గుర్తించారు. గుడుపల్లె పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని