logo

బాటసారే.. కపటదారి

ఐదేళ్ల క్రితం ఓ బాటసారి ఊరూరా తిరిగాడు. మీ సమస్యలు నాకు చెప్పండి.. పరిష్కరిస్తానన్నాడు. నేనున్నానని నమ్మించాడు. ఆబాలగోపాలాన్ని ఉద్ధరిస్తానన్నాడు. అమాయకంగా ముఖం పెట్టి.. తండ్రి లేని బిడ్డనని.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి చాలని వేడుకున్నాడు.

Published : 03 Apr 2024 02:37 IST

మాట తప్పి.. మడమ తిప్పిన జగన్‌
ఐదేళ్లుగా జిల్లాలో ఏ రంగం చూసినా వెనుకంజే
ఏం చేశారని బస్సు యాత్ర  చేపడుతున్నారని ప్రజల విమర్శలు

ఐదేళ్ల క్రితం ఓ బాటసారి ఊరూరా తిరిగాడు. మీ సమస్యలు నాకు చెప్పండి.. పరిష్కరిస్తానన్నాడు. నేనున్నానని నమ్మించాడు. ఆబాలగోపాలాన్ని ఉద్ధరిస్తానన్నాడు. అమాయకంగా ముఖం పెట్టి.. తండ్రి లేని బిడ్డనని.. ఒక్కసారి అవకాశం ఇవ్వండి చాలని వేడుకున్నాడు. అయ్యో పాపం అనుకుని ఒకసారి ఆదరిస్తే అధికారంలోకి వచ్చిన కొంతకాలానికే నరకం చూపించాడు. అప్పుడనకున్నారు ప్రజలంతా ఇతను బాటసారి కాదు  కపటధారి అని. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.. ఆ బాటసారి మరెవరో కాదు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. ఐదేళ్ల తరువాత మరోసారి ఆయన బస్సు యాత్ర పేరిట ఊరూవాడా తిరుగుతున్నారు. ఎక్కడికక్కడ ఆయన్ను అన్ని వర్గాల ప్రజలు నిలదీస్తున్నారు. జిల్లాకు ఏం చేశారని వస్తున్నారో సమాధానం చెప్పాలని గట్టిగా ప్రశ్నిస్తున్నారు.

బడిని దూరం చేసిన కంసమామ

వైకాపా హయాంలో విద్యా రంగం భ్రష్టు పట్టింది. తొలుత ఎయిడెడ్‌ పాఠశాలలు మూసేందుకు యత్నించారు.  398 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేసి చిన్నారులు రెండు- మూడు కిలోమీటర్లు నడిచే దుస్థితి తెచ్చారు. ఉపాధ్యాయ పోస్టులను హేతుబద్ధీకరించి ఉన్నవారినే సర్దుబాటు చేసి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు. డీఎస్సీలో భర్తీ చేసే పోస్టులను భారీగా తగ్గించారు.

వ్యవసాయం చేసింది లేదు

ఐదేళ్లలో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. బిందు, తుంపర సేద్యం పరికరాలు రాయితీపై ఇవ్వడం నిలిపేశారు. ఉద్యాన, పట్టు సాగు చేసే అన్నదాతలు కష్టాలను వినే నాథుడు లేడు. నివర్‌,  మిగ్‌జాం తుపాన్లతో పంటలకు నష్టం వాటిల్లినా కొందరికే పరిహారం ఇచ్చారు. దెబ్బతిన్న చెరువులకు మరమ్మతులు చేసేందుకు వైకాపా ప్రభుత్వానికి మనసు ఒప్పలేదు.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి

జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరగ్గా ఎక్కడా విపక్ష శ్రేణులు స్వేచ్ఛగా నామినేషన్లు వేయలేకపోయారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో వార్డు సభ్యుడి నుంచి సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు.. ఇలా ప్రతి పదవీ ఏకగ్రీవమైంది. జిల్లావ్యాప్తంగా ఇలా ప్రశ్నించిన ప్రతిపక్షాలపై దాడులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.

ఎదిరిస్తే కేసులు, కటకటాలపాలు అక్కాచెల్లెమ్మలంటూ మోసం

జగన్‌ అధికారంలోకి రాక ముందు పిల్లలను చదివించే తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తానని హామీ ఇచ్చారు. తీరా పగ్గాలు చేపట్టిన తర్వాత ఒక్కరికే ఆ సాయాన్ని వర్తింపజేశారు. అది కూడా రూ.13వేలు మాత్రమే ఇస్తున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఓట్లు దండుకుని ఆ హామీని గాలికి వదిలేశారు. మహిళా సాధికారతే తన ధ్యేయమని చెప్పిన జగన్‌.. వారు తీసుకున్న బ్యాంకు రుణాలకు సున్నా వడ్డీని కొందరికే ఇస్తూ మోసం చేస్తున్నారు. గతంలో రూ.5 లక్షల వరకు రాయితీ అందించగా దాన్ని రూ.3 లక్షలకే పరిమితం చేశారు.

యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా

వైకాపా పాలనలో ఉద్యోగాల విప్లవాన్ని తీసుకువస్తానని జగన్‌ చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాలో చెప్పుకొనేందుకు మెగా, భారీ పరిశ్రమలు రాలేదు. ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించలేదు. గ్రూప్‌- 1, గ్రూప్‌- 2 పరీక్షలకు నోటిఫికేషన్‌ ఇస్తామని పేర్కొని చివర్లో పరీక్షలు జరిపారు. స్వయం ఉపాధి కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో జిల్లాలోని యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. విజయపురం మండలంలోని కోశలనగరంలో పారిశ్రామికవాడ ఏర్పాటు చేస్తామన్నా ఇప్పటివరకూ అతీగతీ లేదు.

ప్రకృతి సంపద  నిలువునా దోచేసి

వైకాపా నేతలు కొండలు, గుట్టలనూ వదల్లేదు. ద్రవిడ విశ్వవిద్యాలయంలోనే ఏకంగా క్వారీలు నిర్వహించారు. అడ్డుపడిన అధికారులను ఇక్కడి నుంచి పంపించేశారు. శాంతిపురం మండలం ముద్దనపల్లెలో అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా గ్రానైట్‌ కొల్లగొట్టారు. ఇసుక రీచ్‌లకు అనుమతులు లేకున్నా ఇష్టారాజ్యంగా తరలించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌, సుప్రీంకోర్టునూ అక్రమార్కులు లెక్క చేయలేదు. ఎర్రచందనాన్నీ దర్జాగా  తరలించారు.

దౌర్జన్యాలకు పాల్పడినా నోరెత్తకూడదు

జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత వైకాపా నేతల దౌర్జన్యాలకు అడ్డే లేకుండా పోయింది. ఎవరూ నోరు మెదపలేని దుస్థితి ఎదురైంది. పుంగనూరు నియోజకవర్గంలో నేతిగుట్లపల్లి, ఆవులపల్లి బ్యాలెన్సింగ్‌ జలాశయాల్లో భూములు కోల్పోతున్న రైతులకు పైసా పరిహారం ఇవ్వలేదు. ఈ అక్రమాలపై పోరాడే వారిపై అక్రమంగా కేసులు నమోదు చేశారు.

నేతన్నలపై శీతకన్ను

నగరి నియోజకవర్గంతోపాటు నారాయణవనం మండలంలో దాదాపు 16 వేల కుటుంబాలు మరమగ్గాలపై ఆధారపడ్డాయి. పొరుగునే ఉన్న తమిళనాడులో 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు అందిస్తున్నారు. ఇక్కడ 300 యూనిట్లు దాటితే సంక్షేమ పథకాలు రద్దు చేస్తూ జగన్‌ ప్రభుత్వం నేతన్నల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. విద్యుత్తు సుంకాన్ని తగ్గించాలని పోరాడుతూనే ఉన్నా కనీస స్పందన కరవైంది. ఎన్నికలు సమీపించడంతో రాయితీ ఇస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారు. రంగునీటి శుద్ధి ప్లాంటు సామర్థ్యం తగ్గినా మరొకటి ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదు.

అధికార పార్టీ అరాచకాలను ఎదిరించిన వ్యక్తులపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. కుప్పం నియోజకవర్గంలో విపక్ష శ్రేణులపై వైకాపా కార్యకర్తలే రాళ్ల దాడి చేసి తిరిగి వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయించి జైళ్లలో మగ్గేలా చూశారు. వైకాపా మద్దతుదారులపై నామమాత్రంగా కేసులు పెట్టారు.  పుంగనూరు మండలం భీమగానిపల్లె కూడలి వద్ద పోలీసులు- తెలుగుదేశం శ్రేణుల మధ్య జరిగిన అల్లర్లను సాకుగా చూపి దాదాపు 300 మందిని జైలుకు పంపారు. వందలాది మంది ఇళ్లు విడిచి పారిపోయేలా వ్యవహరించారు.  

ఆక్రమణల్లో సిద్ధహస్తులు

ప్రభుత్వ, పశువుల మేత, దేవాదాయ భూములను ఆక్రమించడంలో వైకాపా నేతలు సిద్ధహస్తులు. అయిదేళ్లలో వందలాది ఎకరాల భూములను కొట్టేశారు. శాంతిపురం మండ లం మొరసనపల్లె పంచాయతీలో వైకాపా మండల కన్వీనర్‌ దండపాణి, మరికొందరు నాయకులు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు గతేడాది సెప్టెంబరులో ఏకంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. చిత్తూరు నగరం తేనెబండ రెవెన్యూలో జాతీయ రహదారి పక్కన కోట్లాది రూపాయల విలువైన భూమిని ఆక్రమించారు.

సాగుకు నీరివ్వక.. కన్నీరు మిగిల్చి

తన రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి జగన్‌ ఎన్ని మాయమాటలైనా చెబుతారు. కుప్పం బ్రాంచి కాలువ(కేబీసీ)నే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. తెదేపా హయాంలో 87 శాతం పనులు చేస్తే మిగిలిన 13 శాతం పూర్తి చేసేందుకు వైకాపా ప్రభుత్వానికి ఏకంగా 57 నెలలు పట్టింది. 110 చెరువులు నింపుతానని చెప్పి రెండు చెరువులకే నీరు ఇచ్చారు. ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేదంటే రైతాంగం, ప్రజలపై ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో ఇట్టే అర్థమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని