logo

‘పెట్రో’గిపోతున్న జగన్‌.. ఇంధన ధరలు పెంచి దోపిడీ

మధ్య, పేద వర్గాల లక్ష్యంగా జగన్‌ దోపిడీ చేస్తున్నారు. వారికి ఇచ్చినట్లే ఇచ్చి జలగలా వెనక్కి లాగేస్తున్నారు. పది రూపాయిలు ఇచ్చి రూ. 100 లాగేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.

Updated : 13 Apr 2024 07:05 IST

ఏటా రూ.2,009 కోట్ల మేర అదనపు బాదుడు
 రైతుల నడ్డి విరిచిన వైనం.. ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లపై భారం

 గూడూరు, న్యూస్‌టుడే: మధ్య, పేద వర్గాల లక్ష్యంగా జగన్‌ దోపిడీ చేస్తున్నారు. వారికి ఇచ్చినట్లే ఇచ్చి జలగలా వెనక్కి లాగేస్తున్నారు. పది రూపాయిలు ఇచ్చి రూ. 100 లాగేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఐదేళ్లలో 20 దఫాలుగా పెంచి దోచుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో తక్కువ ధరలకే ఇంధనం దొరుకుతుండగా మన రాష్ట్రంలో అదనపు ధరలు వసూలు చేస్తున్నారు.

  •  నాడు-నేడు ఎంతో వ్యత్యాసం: నాడు పెట్రోల్‌ రూ.79.11 నేడు రూ.109.93 కాగా.. డిజిల్‌ ధర నాడు రూ.70.77 కాగా ప్రస్తుతం రూ.97.40 వసూలు చేస్తున్నారు. తెదేపా ప్రభుత్వంతో పోలిస్తే పెట్రోల్‌ ధర లీటరుకు రూ.30.82 పెరిగింది. డిజిల్‌ ధర ఇదే తీరుగా రూ.26.63 పెంచి వసూలు చేస్తున్నారు.
  •  రవాణా రంగం కుదేలు.. సరకు రవాణాలో ప్రధానమైన ట్రక్కుల నిర్వహణ భారమైంది. లారీ యజమానులు వేల మంది దివాలా తీశారు. ఏళ్ల తరబడి వ్యాపారం చేస్తున్న యాజమానులు బికారీలుగా మారిపోయారు. ఏటికేడు పెరుగుతున్న ధరల భారంతోపాటు రోడ్ల నిర్వహణ గాలికి వదిలేశారు. దీంతో వాహనాల నిర్వహణ భారం కావడంతో లారీలు నడపలేక వదిలేశారు. వీటి కంతులు చెల్లించక వాటిని సంస్థలే స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది.

పెట్రోల్‌ వాత రూ.630.76 కోట్లు

ఏటా రెండు జిల్లాల్లో కలిపి 20.45 కోట్ల లీటర్లు వినియోగిస్తున్నారు. ఇలా పెరిగిన ధర రూ.30.82 కాగా ఏటా 630.76 కోట్లు అదనపు భారం వాహనదారులపై పడింది. అదే విధంగా డిజిల్‌ భారం 1378.29 కోట్లు.. ఏటా 51.75 కోట్ల లీటర్లు డిజిల్‌ వినియోగిస్తున్నారు. ఇలా పెరిగిన ధర రూ.26.63 మేరకు ఏటా రూ.1,378.29 కోట్లు దోచేస్తున్నారన్న మాట. డిజిల్‌ ఎక్కువగా రైతులు వాడుతున్నారు. ట్రాక్టర్లు, సాగులో ఇతర యంత్రాల కోసం వినియోగిస్తున్నారు.

నాడు ఐదు వేలు.. నేడు 1,800 లీటర్లేజగనన్న దెబ్బకు పెట్రోలు బంకులు డీలా.. 

శాంతిపురం: శాంతిపురం మండల కేంద్రంలోని ఓ పెట్రోలు బంకులో ఐదేళ్ల కిందట రోజుకు 5 వేల లీటర్ల పైబడి డీజిల్‌, పెట్రోల్‌ విక్రయాలు సాగేవి. జగనన్న బాదుడు దెబ్బ విక్రయాలు గణనీయంగా పడిపోయి ప్రస్తుతం 1,800 లీటర్లే అమ్ముబోతుంది. పొరుగు రాష్ట్రాల్లో డీజిల్‌, పెట్రోలు ధరలు తక్కువగా ఉన్నందున.. ఇక్కడ విక్రయాలు సగానికి పైబడి పడిపోయినట్లు పెట్రోలు బంకు యజమాని లెక్కల శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. జగనన్న పుణ్యమా.. అని పెట్రోలు బంకుల వ్యాపారులూ నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని సరిహద్దు ప్రాంత జనం డీజిల్‌, పెట్రోలుకు పొరుగు రాష్ట్రాలను ఆశ్రయిస్తుంటే.. ఇక్కడి బంకులు బోసిపోయి కనిపిస్తున్నాయి. మరోవైపు ఇంధన ధరల భారం అన్ని వర్గాల ప్రజలపై పడుతోంది.


కర్ణాటకకు వెళ్లి డీజిల్‌ తెచ్చుకుంటున్నా..:

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: జేసీబీ నడుపుకుని జీవనం సాగిస్తున్నా. పనుల కోసం రోజు 30 లీటర్ల డీజిల్‌ వినియోగిస్తుంటాం. ఆంధ్రలో 30 దాని కోసం రూ. 2,962 వెచ్చించాలి. కర్ణాటక సరిహద్దులో అయితే రూ. 2,583కే లభిస్తుంది. దాదాపు రూ. 379 ఆదా అవుతుంది. అవసరాన్ని బట్టి ఒక్కోసారి 100 లీటర్లు పైబడి కూడా డీజిల్‌ తెప్పించుకుంటాం. ఇక్కడ డీజిల్‌ ధరలు తగ్గిస్తే వాహన వినియోగదారులకు వ్యయప్రయాసలు తగ్గుతాయి. పొరుగు రాష్ట్రానికి వెళ్లి ఇంధనం తెచ్చుకోవడం కాస్త ఇబ్బందికరమైనా డబ్బు ఆదా అవుతుందని వెళ్తున్నా.

మంజునాథ్‌, లక్కనపల్లె

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని