logo

వసూల్‌రాజా ఎంతిచ్చినా తీసుకోండి: షర్మిల ఘాటు వ్యాఖ్యలు

సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కోసం భారీగా తాయిలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న వసూల్‌రాజా ఎంత ఇచ్చినా మొహమాటం లేకుండా తీసుకోండి అంటూ ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిలారెడ్డి..

Updated : 15 Apr 2024 07:37 IST

శ్రీకాళహస్తిలో ప్రజలకు కరచాలనం ఇస్తున్న షర్మిల

శ్రీకాళహస్తి, సత్యవేడు, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కోసం భారీగా తాయిలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న వసూల్‌రాజా ఎంత ఇచ్చినా మొహమాటం లేకుండా తీసుకోండి అంటూ ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిలారెడ్డి.. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ న్యాయయాత్రలో భాగంగా శ్రీకాళహస్తిలోని బేరివారి మండపం వద్ద ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని మట్టి మాఫియా, ఇసుక అక్రమాలకు పెట్టింది పేరుగా మార్చేశారని ధ్వజమెత్తారు. ఖాళీ భూములన్నీ ఆక్రమిస్తూ కబ్జాల రాజా ఎంతో ఎదిగారని తెలిపారు. ఈయనకు పన్నులు కట్టలేక యాజమాన్యాలు పరిశ్రమలు మూసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాంటి వ్యక్తికి మళ్లీ టికెట్‌ ఇచ్చారని, ఓటు కోసం ఆయన ఎంతైనా ఇస్తాడని, ఇచ్చేదంతా ప్రజల డబ్బేనని దంచి వసూలు చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రాజేష్‌నాయుడు మాట్లాడుతూ మార్పు కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి లక్ష్యంగా మన్నవరం భెల్‌ పరిశ్రమను అందుబాటులోనికి తీసుకురావడం, గాడి తప్పిన ఏరియా ఆస్పత్రిలో సేవలు అందించేలా చేయడం, స్కిట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలను జేఎన్‌టీయూలో విలీనం చేసే బాధ్యత కాంగ్రెస్‌ పార్టీ తీసుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం ఏరియా కార్యదర్శి పుల్లయ్య, సీపీఐ ఏరియా కార్యదర్శి గురవయ్య, పలువురు నేతలు ప్రసంగించారు. ః శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సీటు మహిళలకు కేటాయించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అన్నపూర్ణమ్మ ప్లకార్డులతో సభాస్థలి వద్ద నిరసన తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బత్తెయ్యనాయుడు వర్గీయులు షర్మిల సభకు డుమ్మా కొట్టారు.

వైకాపాకు ఓటేస్తే పెద్దిరెడ్డిదే పెత్తనం

సత్యవేడు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి నూకతోటి రాజేష్‌ను గెలిపిస్తే ప్రతి సమస్య పరిష్కారానికి ప్రజలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లాల్సి వస్తోందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పేర్కొన్నారు. సత్యవేడులో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. సత్యవేడులో పెత్తనమంతా పెద్దిరెడ్డిదేనని దుయ్యబట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ అభ్యర్థి బాలగురువం బాబు, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని