logo

AP News: రోజా ఇంట్లో నలుగురు మంత్రులు.. నగరిలో జబర్దస్త్‌ దోపిడీ: షర్మిల

‘నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే జబర్దస్త్‌ రోజా ఇంట్లో మొత్తం నలుగురు మంత్రులు ఉన్నారు. రోజా, ఆవిడ భర్త, ఇద్దరు అన్నలు కలిసి యథేచ్ఛగా ఇసుక మాఫియా, ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తున్నారు..

Updated : 15 Apr 2024 09:14 IST

పుత్తూరులో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, పక్కన నగరి కాంగ్రెస్‌ అభ్యర్థి రాకేష్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, తిరుపతి, పుత్తూరు, న్యూస్‌టుడే: ‘నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే జబర్దస్త్‌ రోజా ఇంట్లో మొత్తం నలుగురు మంత్రులు ఉన్నారు. రోజా, ఆవిడ భర్త, ఇద్దరు అన్నలు కలిసి యథేచ్ఛగా ఇసుక మాఫియా, ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తున్నారు.. ఈసారి మంత్రి రోజా ఓడిపోతారు’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి పుత్తూరు కాపు వీధిలో ఏపీ న్యాయ యాత్రలో ఆమె మాట్లాడారు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగనన్న ఈ జిల్లాకు ఇచ్చిన హామీలు మరిచిపోయారని, తన తండ్రి వైఎస్‌ గాలేరు పనులు 90శాతం పూర్తిచేస్తే, జగనన్న కనీసం పదిశాతం పనులు కూడా చేయలేదని దుయ్యపట్టారు. చేనేత కార్మికులకు 50 శాతం ఉచిత విద్యుత్తు ఇస్తామని, చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని గొప్పలు చెప్పి ఏ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. ‘ఎమ్మెల్యే రోజమ్మ ఏ ఒక్కరోజు కూడా నియోజకవర్గం కోసం పనిచేయలేదు.. కానీ నేడు మళ్లీ ఆవిడే అభ్యర్థిగా తిరుగుతూ ఓట్లు అడుగుతుంది. ఇసుక, మట్టి మాఫియా నుంచి దోచుకున్న డబ్బులే మీ అందరికీ పంచిపెడుతుంది. ఓటు ఎవరికి వేయాలో ప్రజలు ఆలోచించాలి’ అని షర్మిల పిలుపునిచ్చారు.

  • అక్రమ లేఔట్లు, ఇసుక మాఫియాల ద్వారా మంత్రి రోజా అరాచకాలకు అడ్డు లేకుండాపోయిందని, రూ.కోట్ల సంపాదనలో మునిగితేలుతూ నియోజకవర్గ అభివృద్ధి గాలికి వదిలేశారని కాంగ్రెస్‌ అభ్యర్థి రాకేష్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు భాస్కర్‌, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు కేశవులు, సీపీఐ నేత రామానాయుడు, సీపీఎం నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని