logo

East Godavari: సెల్ఫీ దిగిన 13 నిమిషాలకే విషాదం..

కాలుడు కాచుకు కూర్చుని కేవలం 13 నిమిషాల వ్యవధిలోనే తమ ప్రాణాలు హరిస్తాడని ఆ యువకులకు తెలియదు.

Updated : 28 Nov 2023 11:54 IST

కొయ్యలగూడెం సమీపాన తీసుకున్న చివరి స్వీయచిత్రం

గోపాలపురం, న్యూస్‌టుడే: కాలుడు కాచుకు కూర్చుని కేవలం 13 నిమిషాల వ్యవధిలోనే తమ ప్రాణాలు హరిస్తాడని ఆ యువకులకు తెలియదు. తాము మార్గం మధ్యలో ఉత్సాహంగా తీసుకున్న స్వీయచిత్రం (సెల్ఫీ) ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.  హైదరాబాద్‌ నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరిచర్లగూడెం సమీపాన మాతంగమ్మమెట్ట వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఎదురుగా వచ్చిన లారీ, వారి బైకూ పరస్పరం బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు, సంఘటన స్థలంలో లభించిన వారి చరవాణి ఆధారంగా సాయంత్రానికి వారి వివరాలు పోలీసులు గుర్తించి, వెల్లడించారు.

ఈ యువకులిద్దరూ హైదరాబాద్‌ అమీనాపూర్‌ లోని సాయిరాం రెసిడెన్సీలో ఉంటూ, వివిధ చోట్ల ఇళ్ల స్లాబ్‌ పనులను కాంట్రాక్టు  పద్ధతిలో చేస్తుంటారు. రంజాన్‌ కుమార్‌(22) రోహిత్‌(24) అన్నవరంలో  చేపట్టిన పనులను పరిశీలించడానికి హైదరాబాద్‌ నుంచి ద్విచక్రవాహనంపై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరూ శిరస్త్రాణాలు ధరించినా ఫలితం లేకపోయింది. రంజాన్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. అపస్మారకస్థితిలో ఉన్న రోహిత్‌ను 108 వాహనంలో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స పొందుతూ అతనూ కొద్ది సమయంలో మృతి చెందాడు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి ఎస్సై సతీష్‌కుమార్‌ దర్యాఫ్తు చేస్తున్నారు.

జాతీయ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాద స్థలాన్ని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్‌ సోమవారం సాయంత్రం పరిశీలించారు. ప్రమాదం సమయానికి 13 నిముషాల ముందు (ఉదయం 7.32 గంటలకు) ఏలూరు జిల్లా కొయ్యలగూడెం సమీపాన ఇద్దరు యువకులూ చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీ దిగారు. అక్కడి నుంచి బయలుదేరి ఉదయం 7.45 నిమిషాలకు కరిచర్లగూడెం సమీపంలో మాతంగమ్మ మెట్ట వద్దకు చేరగా ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. అదే వారి చివరి ఫొటో. చరవాణి ఆధారంగా పోలీసులు ఈ ఫొటో సేకరించారు. అన్నవరంలో వారు ఎక్కడి వెళుతున్నదీ కూడా గుర్తించి అక్కడికి, హైదరాబాదులో వారి బంధువులకూ సమాచారం పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని