logo

ప్రచారం కాదు.. ఫలితాలను చూడు జగన్‌ మావయ్యా

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దామన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాటలు నీటిమూటలయ్యాయి. దీనికి తాజాగా వెలువడిన ఇంటర్మీడియట్‌ ఫలితాలే నిదర్శనం. 

Updated : 13 Apr 2024 06:27 IST

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అరకొర ఫలితాలు

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దామన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాటలు నీటిమూటలయ్యాయి. దీనికి తాజాగా వెలువడిన ఇంటర్మీడియట్‌ ఫలితాలే నిదర్శనం. ఎక్కువగా పేదింటి పిల్లలు చదువుకునే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వైకాపా సర్కారు గత అయిదేళ్లుగా మౌలిక వసతులు, బోధనా సిబ్బంది నియామకం, ఇతర సౌకర్యాలు కల్పించకపోవడంతో అరకొర ఫలితాలు మాత్రమే సాధించగలిగాయి. దీంతో నేతల మాటలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండాపోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

- న్యూస్‌టుడే, శ్యామలాసెంటర్‌

 రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ఫలితాలు నిరాశపరిచాయి. జనరల్‌ విభాగంలో ప్రథమ సంవత్సరం 45 శాతం, ద్వితీయ సంవత్సరంలో 58 శాతం మాత్రమే సాధించింది. నగరంలో ఉన్న ఏకైనా కళాశాలలో చేరేందుకు ఏటా వందలాది మంది విద్యార్థులు పోటీ పడేవారు. ఎమ్మెల్యే సిఫార్సులు సైతం తెచ్చుకొని మరీ ఇక్కడ విద్యనభ్యసిస్తుంటారు. ఇదంతా గతం. ప్రస్తుతం అధ్యాపకుల కొరత, విద్యార్థులకు అందించాల్సిన మధ్యాహ్న భోజనం పథకం రద్దు చేయడం, ఆధునికీకరించని ల్యాబ్‌లు, పాతకాలం నాటి తరగతి గదులు వంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ఫలితాల్లో నానాటికీ వెనుక పడుతోంది.

పథకాల రద్దుతో ఫలితాలు తారుమారు

ఇక్కడ సౌకర్యాలు మెరుగు పరచడంలో వెనుకపడ్డారు. దీనికితోడు మండలానికొక జూనియర్‌ కళాశాలంటూ జగన్‌ ప్రభుత్వం ఆర్భాటంగా మొదటి ఈ కళాశాలను బాలికల కళాశాలగా ప్రారంభించింది. దీనిపై విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఎట్టకేలకు దిగొచ్చిన ప్రభుత్వం కోఎడ్యుకేషన్‌గా మార్చింది. మధ్యాహ్న భోజనాన్ని రద్దు చేసింది. దీంతో కొంతమంది ప్రతిభ గల పేద పిల్లలు ఇతర కళాశాలలకు తరలివెళ్లిపోతున్నారు. ల్యాబ్‌లు, కంప్యూటర్లను ఆధునికీకరించకపోవడం వల్ల ప్రైవేటు కంప్యూటర్‌ సెంటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. పాతకాలం నాటి ల్యాబ్‌లను నేటికీ ఆధునికీక రించకపోవడం,  రసాయనాలు లేకపోవడం వంటి కారణాల కారణంగా చదువులో వెనకపడుతున్నారని తల్లిదండ్రులు అంటున్నారు.
సినిమాలు: దానవాయిపేట: శ్యామల: గీతాంజలి మళ్లీ వచ్చింది, స్వామి, వీఎస్‌ మహల్‌: ది ఫ్యామిలీ స్టార్‌, రంభ, రాజా: బడేమియా ఛోటేమియా, శివజ్యోతి: లవ్‌గురు, సూర్యప్యాలెస్‌, అనుశ్రీ: మంజుమ్మల్‌ బాయ్స్‌, సూర్యమినీ: మైదాన్‌, కుమారి, అప్సర: టిల్లు స్క్వేర్‌, ఊర్వశి: శ్రీరంగనీతులు, మేనక: ప్రాజెక్టు-2.

ఆర్ట్స్‌ కళాశాల సందర్శన  

దేవీచౌక్‌: కళాశాల విద్య కమిషనర్‌ పోలా భాస్కర్‌ శుక్రవారం ఆర్ట్స్‌ కళాశాలను సందర్శించారు. గ్రంథాలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన రేడియో ఫ్రీక్వెన్సీ ఆధారిత ఐడెంటిఫికేషన్‌, బుద్ధ భవన్‌లో ఏర్పాటు చేసిన స్టూడియో, తదితర విభాగాలను సందర్శించారు. ప్రిన్సిపల్‌ కె.రామచంద్రరావు పాల్గొన్నారు.

ఐదేళ్లుగా విడుదలకాని నిర్వహణ నిధులు

ఐదేళ్లుగా ఈ కళాశాలలకు నిర్వహణ నిధులు రాకపోవడంతో ప్రిన్సిపల్‌ సొంతంగా డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. స్టేషనరీ, హాజరు పట్టిక రిజిస్టర్లు, డైరీలు, సుద్దముక్కలు, విద్యుత్తు మరమ్మతులు, రంగులు, సామగ్రి కొనుగోలు, అంతర్గత, పబ్లిక్‌ పరీక్షలకు అవసరమైన నిధులకు ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ఏటా నిర్వహణ నిధులు కింద చెల్లించాలి. గత ఐదేళ్లుగా ఇవేవీ ఇవ్వకపోవడంతో ఆ భారం పిల్లలపై పడుతోంది.  వారు చెల్లించే అడ్మిషన్‌ ఫీజుతో పాటు ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. యూనిట్‌ పరీక్షలు, స్టేషనరీ, క్రీడలు, గ్రంథాలయం వంటి వాటికి సైతం వారినుంచే రుసుము వసూలు చేస్తున్నారు.

అంతంత మాత్రంగానే ఫలితాలు

ఈ కళాశాలలో ప్రథమ సంవత్సరం జనరల్‌ విభాగంలో 416కి 188 మందితో 45 శాతం, ద్వితీయ సంవత్సరంలో 278కి 162 మంది  ఉత్తీర్ణతతో 58 శాతం,  ఒకేషనల్‌ విభాగంలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 313కి గాను 207 మంది ఉత్తీర్ణతతో 66 శాతం, ద్వితీయ సంవత్సరంలో 172కి 146 మంది ఉత్తీర్ణతతో 85 శాతం సాధించిందని ప్రిన్సిపల్‌ ఎన్‌ఎస్‌వీఎల్‌ నరసింహం తెలిపారు.


సౌకర్యాలు లేకుండా చదువెలా?

ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలి. కళాశాల ఏకరూప దుస్తులు, షూ, బ్యాగ్‌లు వంటివి వర్తింపజేయాలి. అప్పుడే ఉన్నత చదువులు చదువుకునేందుకు, ఫలితాల్లో మెరుగ్గా రాణించేందుకు ఆస్కారముంటుంది.
- కె.అనిత, విద్యార్థి తల్లి


బోధించే వారేరి?

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో  సౌకర్యాలు మెరుగుపరచాలి. జూనియర్‌ లెక్చరర్ల నియామక ప్రక్రియ చేపట్టాలి. అన్ని సబ్జెక్టులకు అధ్యాపకులను నియమించినప్పుడే విద్యలో నాణ్యత పెరుగుతుంది. ఫలితాలు మెరుగుపడతాయి.
- ఎన్‌.శంకర్రావు, విద్యార్థిని తండ్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని