logo

నీరో చక్రవర్తులు.. నీరడిగితే పట్టించుకోరు

ఈ అయిదేళ్లలో పల్లె పాలన పడకేసింది. పంచాయతీల్లో నిధులు లేక పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీరు ఇలా ప్రతిదానికీ అవస్థే. వేసవి వేళ గ్రామాల గొంతెండుతోంది. కొన్నిచోట్ల రోజుల తరబడి నీరు అందని పరిస్థితి...

Updated : 13 Apr 2024 05:50 IST

నిత్యం కొళాయిల చెంత నిరీక్షణే

పి.గన్నవరంలో వృద్ధురాలిపాట్లు

ఈ అయిదేళ్లలో పల్లె పాలన పడకేసింది. పంచాయతీల్లో నిధులు లేక పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీరు ఇలా ప్రతిదానికీ అవస్థే. వేసవి వేళ గ్రామాల గొంతెండుతోంది. కొన్నిచోట్ల రోజుల తరబడి నీరు అందని పరిస్థితి...మరికొన్నిచోట్ల పల్లెల నుంచి పట్టణాలకు వెళ్లి జలం కొనుక్కోవాల్సిన దుస్థితి.. మహిళలు నిరసన తెలుపుతున్నా పాలకులకు పట్టడం లేదు. గుక్కెడు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు.

    
పి.గన్నవరం, అయినవిల్లి: నియోజకవర్గ కేంద్రం పి.గన్నవరంలో పరిస్థితి ఇది. బిందెడు నీటికి నిత్యం కొళాయిల వద్ద మహిళలకు నిరీక్షణ తప్పడం లేదు. కొన్ని ప్రాంతాలకు మూడు రోజులైనా జలాలు రాని పరిస్థితి. నియోజకవర్గంలో ప్రజలకు రోజుకు సుమారు 1.30 కోట్ల లీటర్ల తాగునీరు సరఫరా చేయాలి. ప్రస్తుతం ఇస్తున్న జలాలు 75 లక్షల లీటర్లు. ఈ విధంగా చూస్తే రోజుకు ఇంకా 55 లక్షల లీటర్ల తాగునీటి కొరతను నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా చాలా గ్రామాల్లో రోజు విడిచి రోజు తాగునీరు సరఫరా చేయాల్సిన దుస్థితి దాపురించింది.  ఇంటింటికీ కొళాయి లక్ష్యంతో ప్రారంభించిన జలజీవన్‌మిషన్‌ పనులు పూర్తికాలేదు. ఒకవేళ జలజీవన్‌ మిషన్‌ నిధులతో పనులు నూరుశాతం పూర్తిచేసినా తాగునీటి పథకాలను విస్తరించకపోతే ఇంటింటికీ కొళాయిలద్వారా తాగునీరు ఇవ్వటం సాధ్యం కాదు.

ఆదుర్రు గరువులో ఖాళీ బిందెలతో మహిళలు

ఖాళీ బిందెలతో నిరసన

మామిడికుదురు: రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండలంలోని ఆదుర్రు గరువులో దుస్థితి ఇది. తాగునీటి సరఫరా లేకపోవడంతో స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. నాలుగైదు రోజులుగా ఓవర్‌హెడ్‌ ట్యాంకులోకి నీరు రాకపోవడంతో తీవ్ర యాతనలు పడుతున్నామని ఆందోళన చెందారు. స్థానికంగా బావుల్లో నీరు ఉపయోగానికి పనికిరాకపోవడం వల్ల ప్రత్యామ్నాయం లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని వాపోయారు.

పట్టణానికి వచ్చి కొనుకోవాల్సిందే..

కొవ్వూరు పట్టణం: నియోజకవర్గంలో పలు గ్రామాల్లోనూ నీటికి అవస్థలు తప్పడం లేదు. ‘మా కాలనీ నుంచి పట్టణంలోకి రెండు కిలోమీటర్లు వచ్చి మంచినీరు కొనుక్కుని తెచ్చుకుంటున్నాం. ఒక్కోసారి ఆటోపై వెళ్లి తెచ్చుకోవాలంటే రానూపోనూ ఛార్జీ రూ.40, డబ్బాకు రూ.12 అవుతోంది. బోరు వేసినా ఆ నీరు తాగేందుకు కుదరదు. రోజూ కచ్చితంగా ఒక డబ్బా తెచ్చుకోవాల్సిందే..’ పశివేదల రోడ్డులోని కాలనీ నివాసి దుర్గ ఆవేదన ఇది. బ్రిడ్జిపేట, శ్రీనివాసపురం (వాంబేకాలనీ), సత్యవతినగర్‌ శివారు వీధులు, యానాది కాలనీ, జగనన్న లేఅవుట్లలో నీటి ఎద్దడి పెరగడంతో అన్నిచోట్లా ఇబ్బందులు ఉన్నాయి. కొన్నిచోట్ల ట్యాంకర్లతో సరఫరా చేసే నీటికి జనం ఇలా క్యూ కట్టాల్సిన పరిస్థితులున్నాయి.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని