logo

రెంటికీ చెడ్డ రేవడిలా..

రాజమహేంద్రవరం ఆనుకొని చుట్టుపక్కల ప్రాంతాలను, గ్రామ పంచాయతీలను విలీనం చేసే ప్రతిపాదనలు కొలిక్కి రాలేదు.

Updated : 13 Apr 2024 05:51 IST

శివారు విలీన ప్రతిపాదిత ప్రాంతాల్లో దయనీయ పరిస్థితులు 

మాట ఇచ్చి ముఖం చాటేసిన వైకాపా ప్రభుత్వం

 

మల్లయ్యపేటలో అపారిశుద్ధ్యం

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం ఆనుకొని చుట్టుపక్కల ప్రాంతాలను, గ్రామ పంచాయతీలను విలీనం చేసే ప్రతిపాదనలు కొలిక్కి రాలేదు. దీంతో గత పదేళ్ల పైబడి అక్కడ అధికారుల పాలన కొనసాగుతోంది. నగరంలో అనధికారికంగా విలీనమైనప్పటికీ ఆ మేరకు సౌకర్యాలు కల్పించడం లేదు. అటు విలీనం జరక్క, ఇటు పాలన లేకుండా దశాబ్దకాలంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్లు, కాలువలకు నోచుకోకపోవడంతో పరిస్థితి రెంటికీచెడ్డ రేవడిలా పరిస్థితి మారిందని స్థానికులు వాపోతున్నారు.

 మొదట్లో 17.. తర్వాత 23

రాష్ట్ర విభజన తర్వాత నగరాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాలను విలీనం చేయాలని అప్పటి తెదేపా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అప్పట్లో సుమారు 17 గ్రామ పంచాయతీలను విలీనం చేసేందుకు సిద్ధపడ్డారు. ఆ తర్వాత ఆ సంఖ్యను 23కు పెంచారు. ఇందులో భాగంగా నగరపాలక సంస్థ ఆయా దస్త్రాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒకపక్క గ్రామసభలు కూడా పూర్తయ్యాయి. రాజమహేంద్రవరాన్ని మహా నగరంగా ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. అటు విజయవాడ ఇటు విశాఖ మధ్యలో ఉన్న ఆధ్యాత్మిక, చారిత్రక మహా నగరాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. దీంతో స్థానిక గ్రామాల్లో వ్యతిరేక రాజకీయాలు ఆరంభమయ్యాయి. విలీనంపై కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత అధికారం చేపట్టిన వైకాపా ప్రభుత్వం ముందు విలీనానికి మొగ్గు చూపినా, క్రమంగా మాటమార్చింది. విలీనం విధానం, ఆవశ్యకతపై కోర్టులో ప్రభుత్వం తరఫున తమ వాదనలు వినిపించాల్సి ఉంది. విలీనంతో ఎన్నికలకు వెళితే ఫలితాలు తారుమారవుతాయనే ఉద్దేశంతో నిర్ణయం మార్చుకొంది. దీంతో ఈ ప్రక్రియకు బ్రేక్‌ పడింది. రెండేళ్ల క్రితం కేవలం 10 గ్రామాలను విలీనం చేస్తున్నామని ప్రకటించారు. గెజిట్‌ విడుదలైంది. అప్పటికే విలీనంపై కోర్టులో కేసు ఉండడంతో ముందుకు వెళ్లలేదు.

నాటినుంచి కలిసే..

విలీన ప్రతిపాదిత గ్రామాల్లో ఉన్న హుకుంపేట, కోలమూరు, కొంతమూరు, బొమ్మూరు, దివాన్‌చెరువు, తొర్రేడు, వెంకటనగరం, వేమగిరి, రాజవోలు, ధవళేశ్వరం తదితర గ్రామాలు నగరంలో కలిసే ఉన్నట్లు ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. వీటి రికార్డులను గతంలోనే నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకొంది. ఈ ప్రాంతాల్లో ప్రజలు అర్బన్‌ సౌకర్యాలు పొందలేకపోతున్నారు.

ప్రజలకు తప్పని పాట్లు

ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారుతోంది. ప్రత్యేకాధికారులు తమ విధుల్లో ఉండటంతో స్థానిక సమస్యలపై దృష్టిసారించలేకపోతున్నారు. పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో రోడ్లు, కాలువల నిర్మాణం జరగడం లేదు. ఉన్న కాలువలనే సిబ్బంది నెలకు ఒకసారి శుభ్రం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు వచ్చేంత వరకు మురుగునీరు రోడ్లపైకి చేరి దుర్గంధం వ్యాపిస్తోంది.  ఒకపక్క నగరంలో రోడ్లు, కాలువలు వ్యవస్థ ఉండగా, పక్కనే ఉన్న ఈ ప్రాంతాలలో పరిస్థితి ఘోరంగా మారింది. దశాబ్ద కాలంగా కాలువలు, రోడ్లు విస్తరణ జరగలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటికి కూడా కటకటలాడాల్సిన దుస్థితి. గోదావరి నీటికోసం ద్విచక్రవాహనాలపై ప్రతిరోజు నగరానికి వచ్చి తీసుకెళ్లాల్సి వస్తోంది.

ఇలా ఎందుకో..

నగరాన్ని ఆనుకొని ఉన్న రాజానగరం మండలం పరిధిలో ఉన్న లాలాచెరువు పంచాయతీని అనూహ్యంగా రాజకీయ కారణాలతో విలీనం చేయించారు. దీంతో నగరంలో నిధులు అక్కడ వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం ఆక్కడ కాలువలు, రోడ్లు, పార్కులు నిర్మాణం జరుగుతుంది. ఇదే తరహాలో మిగిలిన ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరగాలంటే విలీనం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని