logo

జగనన్నా.. ఫినిష్‌ ఆంధ్ర..!

గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి తాజా చేపలు, రొయ్యలు తదితర మత్స్య ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫిష్‌ ఆంధ్ర దుకాణాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రారంభంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఊదరగొట్టారు.

Updated : 13 Apr 2024 06:17 IST

ఆర్భాటంగా దుకాణాలు 

ప్రభుత్వ ప్రోత్సాహం లేక మూసివేత

 

అల్లవరం మండలం తాడికోనలో అవుట్‌లెట్‌ బంద్‌..

అమలాపురం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి తాజా చేపలు, రొయ్యలు తదితర మత్స్య ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫిష్‌ ఆంధ్ర దుకాణాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రారంభంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఊదరగొట్టారు. వీటికి తమ ప్రభుత్వమే కావాల్సిన పరికరాలను రాయితీపై అందిస్తుందని, యూనిట్‌ నెలకొల్పేవారు నామమాత్ర రుసుము చెల్లిస్తే సరిపోతుందని గొప్పలు చెప్పారు. తీరా చూస్తే క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది.

అందని రాయితీ.. నష్టాలే గతి..

ఈ పథకం ద్వారా యుతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని వారిని నమ్మించి దుకాణాల ఏర్పాటుకు ఉసిగొల్పారు. తీరా పథకం ప్రారంభించిన కొన్నాళ్లకే దీనికి చాప చుట్టేశారు. ప్రభుత్వం ఫిష్‌ ఆంధ్ర దుకాణాల నిర్వహణలో పూర్తిగా విఫలమైంది. ఒక్కో యూనిట్‌కు రూ.3 లక్షల వరకు ఇస్తామని మాయచేశారు. ఆ తరువాత రూ.2 లక్షలు అన్నారు. తీరా చూస్తే రూ. లక్షతో సరిపెట్టారు. లైవ్‌ ఫిష్‌ ట్యాంక్‌, ఐస్‌బాక్స్‌, ఇన్వర్టర్‌ తదితర వస్తువులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరల ప్రకారం ఫిష్‌ ఆంధ్ర దుకాణాలకు కూడా చేపలను ఇస్తుండడంతో తమకు లాభాలు రావడం లేదని నిర్వాహకులు వీటి నిర్వహణను పెద్దగా పట్టించుకోలేదు.

హబ్‌ లేకుండానే సరఫరా..

వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిష్‌ ఆంధ్ర దుకాణాల్లో బతికిన మత్స్య ఉత్పత్తులనే విక్రయించాలి. అందుకోసం వారికి అవసరమైన పరికరాలు అందజేశారు. వాస్తవానికి ఆక్వా హబ్‌ నుంచే అవుట్‌లెట్లకు చేపలు, రొయ్యలు సరఫరా కావాలి. కానీ వీటిని ఏర్పాటు చేయకుండానే మినీ ఔట్‌లెట్లను ప్రారంభించేశారు. దుకాణదారులకు మొదట్లో ప్రభుత్వమే చేపలు, రొయ్యలను ఇతర జిల్లాల్లోని హబ్‌ల నుంచి సరఫరా చేసింది. ఆ తరువాత హబ్‌కు, గుత్తేదారుకి రవాణా దూరం పెరగడం, ప్రభుత్వం సూచించిన నిబంధన ప్రకారం అవి చనిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిరావడం, ప్రభుత్వ ధరల ప్రకారం నష్టాలు రావడంతో పంపిణీ చేయలేక చేతులెత్తేశారు. అవుట్‌లెట్లు ఎక్కడికక్కడ మూతపడ్డాయి.

జిల్లాలో ఇలా..: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని 22 మండలాల పరిధిలో 245 దుకాణాలు తెరవాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 279 మంది లబ్ధిదారులు గుర్తించారు. వీరిలో అర్హులైనవారికి ఆప్కాబ్‌, ఇతర జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించి అవుట్‌లెట్లు తెరిపించారు. కొన్ని రోజులకే నష్టాలు రావడంతో నిర్వాహకులు వాటిని మూసేశారు. ప్రస్తుతం జిల్లాలో ఒకటి, రెండు చోట్ల మాత్రమే ఈ దుకాణాల ద్వారా మత్స్య ఉత్పత్తుల అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రజాదరణకు నోచుకోని పథకాలు ప్రవేశపెట్టి, తమను ఇబ్బందులపాలు చేశారని యూనిట్ల నిర్వాహకులు వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని