logo

అధినేతల దిశానిర్దేశం..శ్రేణుల్లో సమరోత్సాహం

తెదేపా, జనసేన, భాజపా అధినేతలు ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ప్రజాగళం బహిరంగ సభలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

Updated : 13 Apr 2024 06:14 IST

ప్రజాగళం సభలు విజయవంతం

అమలాపురం కిమ్స్‌ ఆవరణలో చంద్రబాబు బస వద్ద శ్రేణుల సందడి

 ఈనాడు, రాజమహేంద్రవరం: తెదేపా, జనసేన, భాజపా అధినేతలు ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ప్రజాగళం బహిరంగ సభలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయిదేళ్ల వైకాపా పాలనలో రంగాల వారీగా జరిగిన విధ్వంసం, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, అవినీతి, అక్రమాలను ఎండగట్టారు. కూటమి వస్తే ఏం చేస్తామనే అంశాలను చెప్పి, అభ్యర్థుల విజయానికి బాటలు వేశారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, పురందేశ్వరి సమర శంఖం పూరించడంతో ఆయా పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది.

స్థానిక సమస్యలపై ప్రస్తావిస్తూ..: నిడదవోలు, అంబాజీపేట, అమలాపురంలో నిర్వహించిన సభల్లో దీర్ఘకాలంగా ప్రజలను వేధిస్తున్న సమస్యలను ప్రస్తావిస్తూనే వాటికి పరిష్కార మార్గాలు సూచించారు. వైకాపా పాలనలో పచ్చని కోనసీమను కలహాల సీమగా మార్చేందుకు చేసిన కుట్రలను అడ్డుకోగలిగామని చంద్రబాబు, పవన్‌ పేర్కొన్నారు. ప్రధానంగా కోనసీమ రైల్వేలైన్‌, భవన నిర్మాణ కార్మికులకు భరోసా, నదీకోత, పంట కాలువల నిర్వహణ, కొబ్బరి, వరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి పంట విరామం అనే మాట లేకుండా చేస్తామన్నారు. కోనసీమ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించిన సందర్భాల్లో ఇచ్చిన హామీలు, వాటి అమలుతీరును తేదీలతో వివరిస్తూ వైకాపా పాలనా వైఫల్యాలను ఎండగట్టారు.

అంతర్గత సమీక్షలు: తెదేపా అధినేత చంద్రబాబు అభ్యర్థులు, ఇతర ముఖ్యనాయకులతో అంతర్గత సమావేశాలు నిర్వహించారు. లోటుపాట్లు వివరించి, భవిష్యత్తు కార్యాచరణపై సూచనలిచ్చారు. నిడదవోలు, అమలాపురంలో పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. జనసేనాని పవన్‌కల్యాణ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే గురువారం రాజమహేంద్రవరంలో పార్లమెంట్‌ పరిధిలోని కూటమి అభ్యర్థులతో ముఖాముఖి మాట్లాడారు. ఓటు  బదిలీపై స్పష్టమైన సూచనలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని