logo

మాటలతో మొదలెట్టావ్‌.. మార్పులతో చెడగొట్టావ్‌

చదువుల్లో ప్రతిభ చూపి మెరవాల్సిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులు డీలా పడ్డారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు మార్పు దేవుడెరుగు.. అత్తెసరు మార్కులతోనైనా పాసైతే పదివేలు అనుకున్న తల్లిదండ్రులకు నిరాశే ఎదురయ్యింది

Updated : 13 Apr 2024 06:13 IST

 ముఖ్యమంత్రి జగన్‌ నిర్వాకంపై ఆవేదన

ఇంటర్‌ ఫలితాల్లో దిగజారిన కాకినాడ, కోనసీమ

 ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, శ్యామల సెంటర్‌, కాకినాడ నగరం, అల్లవరం : ‘‘ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను ఒడిసి పట్టుకోవాలి. లేకపోతే పాశ్చాత్య దేశాల పిల్లల మాదిరిగా మన పిల్లలు సమాధానాలు చెప్పగలిగే స్థితిలో ఉండరు. పిల్లలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం.’’
- 2023 జులై 20న సీఎం జగన్‌ వ్యాఖ్యలివి..

చదువుల్లో ప్రతిభ చూపి మెరవాల్సిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల విద్యార్థులు డీలా పడ్డారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు మార్పు దేవుడెరుగు.. అత్తెసరు మార్కులతోనైనా పాసైతే పదివేలు అనుకున్న తల్లిదండ్రులకు నిరాశే ఎదురయ్యింది. తాజా ఇంటర్‌ ఫలితాల్లో కాకినాడ జిల్లా రాష్ట్రంలో 16వ స్థానం, కోనసీమ జిల్లా 18వ స్థానానికి దిగజారి పరువు పోగొట్టుకున్నాయి.తూర్పు గోదావరి జిల్లా అయిదో స్థానంతో కాస్త గౌరవం దక్కించుకుంది. జగన్‌ ప్రవచించిన అంతర్జాతీయ ప్రమాణాల డొల్లతనమేమిటో బయటపడింది.
2024 ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం  ఉత్తీర్ణులు గమనిస్తే: కాకినాడ జిల్లా నుంచి ప్రభుత్వ, ప్రైవేట్‌ కలిపి 15,969 మంది పరీక్షలు రాయగా 11,337 మంది ఉత్తీర్ణులయ్యారు. కోనసీమలో 8,844 మందికి 6,338 మంది, తూర్పులో 15,394 మందికి 12,837 మంది పాసయ్యారు.

లోపం ఎక్కడుంది...?

విద్యకు వేలకోట్లు ఖర్చుచేస్తున్నామని సర్కారు గొప్పగా చెబుతున్నా.. ఆచరణలో నిలబెట్టుకోలేకపోయింది. కళాశాలలకు రెగ్యులర్‌ అధ్యాపకులు లేకపోవడం..ఒప్పంద, అతిథి లెక్చరర్లతో నెట్టుకొస్తుండడం సమస్యగా మారింది. పాఠాలు సవ్యంగా సాగలేదు.. 2022లో ఉమ్మడి జిల్లాలో 51 హైస్కూల్‌ ప్లస్‌లలో ఇంటర్మీడియట్‌ విద్య ప్రవేశపెట్టినా.. బోధన సమర్థంగా సాగక, వనరులు లేక వ్యవస్థ పట్టాలు తప్పింది. తెదేపా హయంలో జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనం పథకం గ్రామీణ, దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఉపకరించేది. వైకాపా ప్రభుత్వం దీన్ని రద్దుచేసింది.గతంలో విద్యా సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.25వేల నుంచి రూ.లక్ష వరకు కళాశాలలకు నిర్వహణ నిధులు మంజూరయ్యేవి. ఇప్పుడవేవీ లేవు.

 • తూర్పుగోదావరి జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. 220 మందికి రెగ్యులర్‌ అధ్యాపకులు 90 మందే ఉన్నారు. ఒప్పంద ప్రాతిపదికన 121, అతిథి అధ్యాపకులు 23 మందితో నెట్టుకొస్తున్నారు. బోధనేతర సిబ్బంది 80 మందికి 39 మందే ఉన్నారు. రాజమహేంద్రవరం ఇంటర్మీడియట్‌ బోర్డులో నాలుగో తరగతి సిబ్బంది ఒక్కరే కనిపిస్తారు.
 •  కాకినాడ జిల్లాలో 15 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా రెగ్యులర్‌ పోస్టులు 205కు 90 మందే ఉన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో 105 మందితో నెట్టుకొస్తుంటే.. మరో 10 ఖాళీగా ఉన్నాయి.
 • కోనసీమ జిల్లాలో 13 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. రెగ్యులర్‌ అధ్యాపకులు 62, ఒప్పంద పద్ధతిలో 90 , అతిథి అధ్యాపకులు 18, మినిమం టైం స్కేల్‌ సిబ్బంది 9 మందే ఉన్నారు.

ఇన్‌ఛార్జిలతో నెట్టుకొచ్చేస్తూ..

రాజమహేంద్రవరంలో ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ) పోస్టులో ఇన్‌ఛార్జి ఉన్నారు. ప్రాంతీయ కళాశాలల పర్యవేక్షణ అధికారి (ఆర్‌ఐవో) పోస్టుదీ అదే పరిస్థితి. ఈ జిల్లాలో ప్రభుత్వ కళాశాలలను తనిఖీచేసే జిల్లా వృత్తివిద్య
అధికారి (డీవీఈవో) పోస్టు ఇన్‌ఛార్జితో నెట్టుకొస్తున్నారు.

ఫలితాలను విశ్లేషిస్తే..

 • కాకినాడ జిల్లాలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అబ్బాయిలు 55 శాతం ఉత్తీర్ణత సాధిస్తే.. అమ్మాయిలు 65 శాతం.. ద్వితీయ సంవత్సరంలో అబ్బాయిలు 67..అమ్మాయిలు 74 శాతం సాధించారు.
 •  అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అబ్బాయిలు 50..అమ్మాయిలు 67 శాతం ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో అబ్బాయిలు 65 శాతం.. అమ్మాయిలు 76 శాతం సాధించారు
 •  తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అబ్బాయిలు 75 శాతం..అమ్మాయిలు 76 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సర విద్యార్థుల్లో అబ్బాయిలు 84 శాతం..అమ్మాయిలు 83 శాతం సాధించారు.

పన్నెండుకు ఒక్కరే..

ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి ఉన్నత పాఠశాలలో నూతనంగా ప్రారంభించిన ప్లస్‌-2లో మొదటి ఏడాది 12 మంది ఇంటర్‌ విద్యార్థినులు పరీక్షలు రాయగా ఒక్కరు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. సరైన శిక్షణ ఇవ్వకపోవడమే కారణం.


హైస్కూలు ప్లస్‌.. ‘సున్నా’లే అధికం

ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోనే ఇంటర్మీడియట్‌ తరగతులు కూడా ప్రారంభించామని జగన్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పినా.. ఫలితాలకొచ్చేసరికి బోర్లాపడాల్సి వచ్చింది. అధ్యాపకులు లేక, ఉన్నవారికి ఇంటర్‌ పాఠ్యాంశాలు బోధించే అనుభవం లేక ఫెయిలయ్యే పరిస్థితి నెలకొంది. పలుచోట్ల ఏకంగా సున్నా ఫలితాలు రావడం దయనీయతకు అద్దంపడుతోంది.

 • కొత్తపేట మండలం చప్పిడివారిపాలెం హైస్కూలులో ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు 8 మంది, ద్వితీయ ముగ్గురు రాస్తే ఉత్తీర్ణత శాతం సున్నా.
 • కొత్తపేట మండలం చంద్రమాంపల్లి హైస్కూల్‌ ప్లస్‌లో ఇంటర్‌ ప్రథమ 11 మంది రాస్తే ఒక్కరూ పాసవ్వలేదు.
 • ప్రత్తిపాడు మండలం లంపకలోవ హైస్కూలు ప్లస్‌లో ప్రథమ సంవత్సరంలో 21 మందిలో ఒక్కరూ ఉత్తీర్ణులు కాలేదు. ద్వితీయ సంవత్సరం 16 మందిలో నలుగురు గట్టెక్కారు.
 • కరప జడ్పీ హైస్కూలులో మొదటి సంవత్సర పరీక్షలు 35 మంది రాస్తే.. నలుగురు పాసయ్యారు. ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసిన 11 మందిలో ఒక్కరూ ఉత్తీర్ణులు కాలేదు.
 • పెరవలి మండలం కానూరులో ప్రథమ సం।। నలుగురు, ద్వితీయ పరీక్షలు అయిదుగురు రాస్తే ఒక్కరూ పాసవ్వలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని