logo

మీకో దండం.. ఎలా పిండ ప్రదానం..?

పిండప్రదానం చేయడం.. పితృదేవతలకు తర్పణం వదలడం.. ప్రతి హిందువుడి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం.. తద్వారా వారి పూర్వీకుల ఆశీస్సులు కుటుంబంపై పుష్కలంగా ఉంటాయని ఆశపడుతుంటారు..

Published : 15 Apr 2024 09:07 IST

రుసుముల పెంపునకు అధికారుల ప్రతిపాదనలు
పాదగయకు వచ్చే భక్తులపై భారీ బాదుడుకు రంగం సిద్ధం

పాదగయ పుష్కరిణి

న్యూస్‌టుడే, పిఠాపురం: పిండప్రదానం చేయడం.. పితృదేవతలకు తర్పణం వదలడం.. ప్రతి హిందువుడి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం.. తద్వారా వారి పూర్వీకుల ఆశీస్సులు కుటుంబంపై పుష్కలంగా ఉంటాయని ఆశపడుతుంటారు.. అందుకోసం కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికైనా వెళ్లడానికి సిద్ధపడుతుంటారు. ఆ కార్యక్రమం చేసే అరుదైన ప్రాంతాల్లో  పిఠాపురంలోని పాదగయ కూడా ఒకటి.. అందుకే అనేక రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి పితృతర్పణాలు వదులుతుంటారు. కుక్కుటేశ్వరస్వామి, పురుహూతికా అమ్మవారు, దత్తాత్రేయస్వామి ఆశీస్సులు పొందుతుంటారు. ఇప్పుడు ఈ కార్యక్రమాలతో సహా ఆలయంలో జరిగే వివిధ పూజాదికాలపై అధికారుల కన్నుపడింది. ధరల పెంపుతో భక్తులను దోచేందుకు పూర్తిస్థాయిలో రంగం ‘సిద్ధం’ చేశారు.

కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రానికి దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ ఆలయంలో స్వయంభు కుక్కుటేశ్వరస్వామి, దత్తాత్రేయ స్వామి, పదోశక్తి పీఠం పురుహూతికా అమ్మవారు కొలువై ఉన్నారు. మరోవైపు త్రిగయ క్షేత్రాల్లో ఒకటైన పాదగయ క్షేత్రం ఇక్కడే ఉంది. పిండ ప్రదానాలు ఇక్కడ ఎక్కువగా జరుగుతుంటాయి. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటారు. విశేష సందర్భాలు, ప్రత్యేక పర్వదినాల్లో రెట్టింపు భక్తుల తాకిడి ఉంటుంది. ఆలయానికి విరాళాలు కూడా అధికంగా ఉండటంతో ఆదాయ పరంగా ఎలాంటి ఢోకాలేదు. కానీ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టని దేవాదాయ శాఖ.. ఇప్పుడు భక్తులపై భారం పెట్టేందుకు మాత్రం పక్కాగా సిద్ధమైంది. అంతరాలయ దర్శనం, మాలధారణ, ఇరుముడి రూ.20 నుంచి రూ.50కి పెంచనుండగా, సహస్ర నామార్చన రూ.50 నుంచి రూ.100.. వీడియో షూటింగ్‌ టిక్కెట్టు ధర రూ.558 నుంచి రూ.వెయ్యికి పెంచనున్నారు.

300 శాతం పెంపు?

ఆలయంలో పూజలు, సేవలు, అభిషేకాల రుసుములు 100 నుంచి 300శాతం మేర పెంపునకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయడం గమనార్హం. ఈ నెల 9న నిర్ణయం తీసుకున్నా రహస్యంగా ఉంచారు. 23వతేదీ లోపు అభ్యంతరాలు తెలపమంటూ సంబంధిత ప్రతులను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అందుబాటులో ఉంచారు. ఈ పెంపును వ్యతిరేకిస్తూ, హిందూ, బ్రాహ్మణ సంఘాలు సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. అభ్యంతరాలు 15రోజుల్లో లిఖితపూర్వకంగా కార్యాలయంలో ఇచ్చి రశీదు తీసుకోవాలని అధికారులు ప్రస్తావించగా.. ఈవో నారాయణమూర్తి మాత్రం 23వతేదీ లోపు అభ్యంతరాలు తెలపాలని, భక్తుల ఇబ్బందులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. సూర్యనమస్కారాలకి గతంలో రుసుం లేదు. తాజాగా రూ. 150, గోపూజకు గతంలో 100 ఉండగా ఇప్పుడు 150, నామకరణ, అన్నప్రాసనలకు 200 నుంచి 300లు పెంచాలని ప్రతిపాదించారు.

దేవాలయాలకు దూరం చేసే కుట్ర

రుసుముల పెంపుతో హిందువులను దేవాలయాలకు దూరం చేసే కుట్రే ఇది. టిక్కెట్ల ధరల పెంపును వ్యతిరేకిస్తున్నాం. వివిధ సంఘాలతో కలసి నిరసన తెలిపేందుకు సిద్ధంగా ఉన్నాం. దేవాదాయశాఖ కమిషనర్‌ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇటువంటి దుశ్చర్యకు పాల్పడడం బాధాకరం.

వెంకటేశ్వరరావు, విశ్వహిందూ పరిషత్‌ అధ్యక్షుడు, పిఠాపురం


సామాన్య భక్తులకు ఇబ్బందే

పాదగయకు వచ్చే సామాన్య భక్తులను ఇబ్బందికి గురి చేయడం అన్యాయం. ఈ ధరల పెంపును వ్యతిరేకిస్తూ సోమవారం అఖిల పక్ష సమావేశం జరుపుతున్నాం. సంఘటితంగా దీనిపై పోరాడుతాం. దైవ దర్శనం భారం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

వై.సూర్యనారాయణ, బ్రాహ్మణ పరిషత్‌ పట్టణాధ్యక్షుడు, పిఠాపురం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని