logo

కెమెరా కళ్లు గప్‌చుప్‌ కేటుగాళ్లు హల్‌చల్‌

జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో నిఘా కెమెరాల వ్యవస్థ నిద్దరోతోంది. దీంతో ఎన్నికల వేళ భద్రత సవాల్‌గా మారింది. గొడవలు, కవ్వింపు చర్యలు, అక్రమ మద్యం, నగదు, బహుమతుల తరలింపు, దొంగతనాల నివారణ తదితర చర్యలకు సీసీ కెమెరాల వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుంది.

Updated : 16 Apr 2024 05:35 IST

వైకాపా వచ్చాక కాకినాడలో నిఘా నేత్రం నిద్ర
న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌

జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో నిఘా కెమెరాల వ్యవస్థ నిద్దరోతోంది. దీంతో ఎన్నికల వేళ భద్రత సవాల్‌గా మారింది. గొడవలు, కవ్వింపు చర్యలు, అక్రమ మద్యం, నగదు, బహుమతుల తరలింపు, దొంగతనాల నివారణ తదితర చర్యలకు సీసీ కెమెరాల వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుంది. ఇలాంటి వ్యవస్థ ఏడాదిన్నరగా పనిచేయడం లేదు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాలు, కీలక కార్యాలయాలు, రక్షణకు సంబంధించిన వ్యవస్థలు ఉన్న ప్రాంతాల్లో స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గత తెదేపా ప్రభుత్వం హయాంలో రూ.98 కోట్ల వ్యయంతో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా నిఘా కెమెరాల వ్యవస్థను నెలకొల్పారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక.. ఈ సెంటర్‌ను గాలికి వదిలేసింది. దీని నిర్వహణ సంస్థకు రూ.కోట్లలో బకాయిలు పడటం, స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంతో నిర్వహణ అటకెక్కింది. దీంతో ఆ సంస్థ బాధ్యతల నుంచి తప్పుకొంది.

అస్థవ్యస్థం చేశారు..

కాకినాడ ఆకర్షణీయ నగరం 37 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 50 డివిజన్లు ఉన్నాయి. సర్పవరం కూడలి, భానుగుడి కూడలి, బాలాజీచెరువు కూడలి, మెయిన్‌రోడ్డు, సినిమారోడ్డు, సంత మార్కెట్‌, కలెక్టరేట్‌, జడ్పీ కూడలి, గాంధీనగర్‌, రామారావుపే, ఏటిమొగ, ముత్తానగర్‌, దుమ్ములపేట, పర్లోపేట, డెయిరీ ఫారం కూడలి, సాంబమూర్తినగర్‌, జగన్నాథపురం, అన్నమ్మఘాటీ వంటి కీలక ప్రదేశాల్లో స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ ద్వారా 370 సీసీ కెమెరా సర్వెలెన్స్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటిని వాటర్‌వర్క్సులో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేశారు. నేర పరిశోధన, ట్రాఫిక్‌ నియంత్రణ, వంటి కీలక చర్యలను ఈ కెమెరాలు ద్వారా పర్యవేక్షించేవారు. గుర్తించిన లోపాలు, అక్రమాలను స్మార్ట్‌సిటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించడం ద్వారా నేరాల అదుపునకు ఉపయోగపడేది. గత ఏడాదిన్నరగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో పోలీసు శాఖకు భద్రత నిర్వహణ కత్తిమీద సాములా మారింది. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పాటు పబ్లిక్‌ అడ్రసింగ్‌ సిస్టం, ఇతర వ్యవస్థలకు సంబంధించిన సామగ్రి వినియోగంలో లేక పాడైపోయింది. వీటిని మనుగడలోకి తెచ్చేందుకు స్మార్ట్‌సిటీ అధికారులు రూ.15కోట్లతో అంచనాలు తయారు చేసి టెండర్లు పిలిచారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ వ్యవస్థల పునరుద్ధరణ నిలిచిపోయింది.
పోలీసు కెమెరాలే దిక్కు..: నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. దీని ద్వారా నగరంలో 100 సీసీ కెమెరాలు మాత్రమే ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలీసులు, సాంకేతిక సిబ్బందితో సీసీ కెమెరా వ్యవస్థను నిర్వహిస్తున్నారు. ఈ శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నగరం అంతా విస్తరించి లేవు. దీంతో ఉన్నవాటితోనే నిర్వహణ చేస్తున్నారు. గత తెదేపా హయంలో కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. భవన నిర్మాణాలు పూర్తి చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక.. దీన్ని పట్టించుకోపోవడంతో ఏర్పాటు ఆగిపోయింది.


పెరుగుతున్న దొంగతనాలు..

  • నగరంలో ఇటీవల రాత్రిపూట డంపరు బిన్నులను దొంగలు ఎత్తుకుపోతున్నారు. వీటిని గ్యాస్‌ కట్టర్ల ద్వారా విభజించి, పాత ఇనుప సామాను దుకాణాలకు విక్రయించారు. గతనెల 31న ఒకే రోజు 12 డంపరు బిన్నులు మాయమయ్యాయి. దీనిపై కేసు నమోదైంది. సీసీ కెమెరాల వ్యవస్థ పనిచేయకపోవడంతో దొంగలు దర్జాగా చోరీలకు పాల్పడుతున్నారు.
  • నగరపాలక సంస్థ పరిధిలో కల్వర్టకు వేసిన ఇనుక మేన్‌హోల్‌ గ్రిల్స్‌ తరచూ తస్కరణకు గురవుతున్నాయి. గతంలో కొన్నిచోట్ల వీటిని గ్యాస్‌కట్టర్లతో తొలగించి పట్టుకు పోగా, కొత్తవి వేశారు. ఇటీవల మరో 35చోట్ల ఇనుప గ్రిల్స్‌ ఎత్తుకుపోయారు. వీటిని మళ్లీ కొత్తగా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు లేకపోవడం దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు.
  • నగర ముఖ ద్వారాల వద్ద మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వీటి వద్ద ఎన్నికల నిఘా అధికారులు పెద్ద ఎత్తున అక్రమ మద్యం, నగదు, బహుమతులు పట్టుకుంటున్నారు. నగరం వ్యాప్తంగా సీసీ కెమెరాలు లేనికారణంగా ఇవి వేర్వేరు మార్గాల్లో నగరంలోకి ప్రవేశిస్తే.. సులువుగా పట్టుకోవడం కష్టమే.
  • కాకినాడ నగర నియోజకవర్గంలో 233 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వీటిలో 62 సమస్యాత్మకమైనవి. వీటిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. సీసీ కెమెరాలు లేకపోవడంతో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కష్టతరంగా మారుతోంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని