logo

ఆడపిల్లని తుప్పల్లో విసిరేసి..

ప్రస్తుత సమాజంలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు రాణిస్తున్నారు. ఏ రంగమైనా దూసుకుపోతున్నారు. అయినా ఎక్కడో ఏదో మూల వివక్ష ఎదురవుతుంది.

Published : 16 Apr 2024 04:00 IST

మూడో సంతానంగా బాలిక..
వదిలించుకోవాలని తల్లి నిర్వాకం

కడియం, న్యూస్‌టుడే: ప్రస్తుత సమాజంలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు రాణిస్తున్నారు. ఏ రంగమైనా దూసుకుపోతున్నారు. అయినా ఎక్కడో ఏదో మూల వివక్ష ఎదురవుతుంది. తనకు మూడో కాన్పులోనూ ఆడబిడ్డే పుట్టడంతో ఆ తల్లి అసహనానికి గురైంది. ముక్కుపచ్చలారని పసికందును తుంచాలనుకుంది. విషయం అందరికీ తెలియడంతో తిరిగి అక్కున చేర్చుకుంది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు కుటుంబం తాపీపనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. మగ సంతానంపై ఆమెకు ఉన్న మక్కువతో ఇద్దరు ఆడపిల్లలు అనంతరం మరో కాన్పుకు సిద్ధమయ్యారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్నట్లు భర్తతో పాటు బంధువులను నమ్మించింది. పెరుగుతున్న పొట్టపై భర్త ఆరా తీస్తే.. అతిగా తినడంతోనే వచ్చిందని చెప్పేది. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఎలాంటి వైద్యసేవలు పొందలేదు. అబ్బాయి పుడితే అందర్నీ ఆశ్చర్య పరుద్దామని అనుకుంది. ఆదివారం ఉదయం పురుటినొప్పులు రావడంతో భర్త, పిల్లలను చర్చికి పంపించింది. తనకు తానుగా పురుడుపోసుకుంది. కూరలు తరిగే కత్తిపీటతో తల్లిపేగు కత్తిరించింది. అమ్మాయే పుట్టడంతో హతాశురాలైంది. తన పాత నైటీలో పసికందును చుట్టి సమీపంలో ఉన్న 20 అడుగుల లోతు తుప్పల్లోకి విసిరేసింది. తిరిగి ఇంటికి చేరింది. తుప్పల్లోంచి చంటిబిడ్డ అరుపులు వినిపించడంతో స్థానికులు గుర్తించారు. అందులో ఆమె భర్త కూడా ఉన్నారు. స్థానికులే ఇలా చేసి ఉంటారని గ్రహించి ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ నైటీ తన భార్యదిగా గుర్తించి ఆ భర్త ఆమెను నిలదీశాడు. దాంతో అసలు విషయం బయటపడింది. మొత్తం విషయాన్ని భర్తతో చెప్పి, బోరున విలపించింది. తల్లీబిడ్డల్ని కడియంలోని సీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని