logo

ప్రలోభాలకు గురిచేస్తే.. తప్పదు భారీ మూల్యం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియమావళి అమలు కఠినతరం చేశారు. త్వరలో నామ పత్రాల స్వీకరణ పర్వం కూడా మొదలు కానుంది.

Updated : 16 Apr 2024 05:37 IST

న్యూస్‌టుడే, పామర్రు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియమావళి అమలు కఠినతరం చేశారు. త్వరలో నామ పత్రాల స్వీకరణ పర్వం కూడా మొదలు కానుంది. పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఓ పక్క ప్రచారం సాగిస్తునే.. మరో పక్క ప్రలోభాల ఎర వేయడానికి సమాయత్తం అవుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం తీవ్రమైన నేరం. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, భారత శిక్షాస్మృతి చట్టాల కింద కేసులు నమోదు చేస్తారు. నేరం రుజువైతే జరిమానా, లేదా జరిమానాతోపాటు శిక్షకు కూడా గురవుతారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2019లో జరిగిన ఎన్నికల్లో నిబంధనలు మీరిన ఘటనలపై 84 కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రలోభాల ఎర ఎలా ఉంటే.. శిక్షలు ఎలా నమోదవుతాయన్న అంశాన్ని పరిశీలిస్తే..

మద్యం సరఫరా చేస్తే..

ఎన్నికలంటే డబ్బు తరువాత మద్యం గుర్తుకొస్తుంది. ప్రతి గ్రామంలోనూ రాజకీయ పక్షాలు మద్యం పంపిణీ చేస్తుంటాయి. నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి మూడు సీసాలుకు మించి మద్యం తీసుకెళ్లడం నేరం. ఓటర్లకు పంపిణీ చేసేందుకు భారీ మోతాదులో మద్యం రవాణా చేస్తూ పట్టుబడుతుంటారు. ఇలా దొరికితే అబ్కారీ చట్టం 1968 సెక్షన్‌ 34(ఎ) కింద కేసు నమోదు చేస్తారు. దీనికిగాను ఆరు నెలల నుంచి ఏడాది వరకు శిక్ష, రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.


లంచాలిచ్చినా.. డబ్బులు పంచినా..

ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు అభ్యర్థులు ప్రధానంగా నగదు ఎరగా వేస్తారు. అక్రమ చెల్లింపులు చేయడం ప్రధానం. పలు రకాలుగా పంపిణీలు జరుపుతుంటారు. ఇలా చేస్తే ఐపీసీ 171(హెచ్‌) కింద చర్యలుంటాయి. అధికారులకు లంచం రూపంలో డబ్బులిచ్చినా, ఓటర్లకు డబ్బులు పంచినా ఐపీసీ 171(బి) సెక్షన్‌ కింద చర్యలు తీసుకుంటారు.


ప్రచార సమయం మీరొద్దు..

అభ్యర్థులకు కేటాయించిన సమయాన్ని మాత్రమే వినియోగించుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా మైకులు, డీజేలు వాడడం, వివిధ రకాల ప్రచార సామగ్రి వినియోగించడం కూడదు. దీనికి గాను ఐపీసీ 171(ఎఫ్‌) చట్టం కింద చర్యలు తీసుకుంటారు.


ఓటర్లను బెదిరిస్తే..

ప్రతి ఓటరుకు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ఉంది. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకూడదు. ఓటర్లను ఒత్తిడికి గురిచేయడం, బెదిరించడం తీవ్ర నేరంగా
పరిగణిస్తారు. ఇలా చేసినట్లు రుజువైతే బాధ్యులపై ఐపీసీ 171(సి) చట్టం కింద కేసు నమోదు చేస్తారు.


లేనిది ఉన్నట్లు చెప్పినా..

ప్రచారం చేసే అభ్యర్థులు ప్రజలను ఆకర్షించేందుకు ఒక్కోసారి అబద్దాలను చెబుతుంటారు. లేనిది ఉన్నట్లు ప్రచారం చేస్తుంటారు. దీనిపై ప్రత్యర్థులు ఫిర్యాదులు చేస్తే, రుజువైతే ఐపీసీ 171(జి) కింద కేసు నమోదు చేస్తారు.


కానుకల పంపిణీ నేరం..

ఇప్పటికే పలు చోట్ల పలు వర్గాలకు కానుకలు పంపిణీ చేస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ఓటర్లకు నేరుగా ప్రలోభానికి గురి చేస్తూ కానుకలు పంపిణీ చేయడం నేరం. అన్నదానాలు, వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయకూడదు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఐపీసీ171(ఇ) చట్టం కింద శిక్షార్హులవుతారు.


రెచ్చగొట్టినా.. కించపర్చినా..

ఓట్ల కోసం కులం, మతం, సామాజిక వర్గాలను రెచ్చగొట్టేలా పలువురు వ్యాఖ్యలు చేస్తుంటారు. ఎదుటి వ్యక్తుల మనోభావాలను కించపరచడం చేస్తారు. ఇలా జరిగినట్లు, నిబంధనలు ఉల్లంఘన గమనించినట్లయితే ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్‌ 125 కింద కేసు నమోదు చేస్తారు.


ఖర్చుల వివరాలు సమర్పించాలి..

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలు ఎన్నికలు ముగిసిన నెలలోగా అందించాలి. లేకుంటే ఐపీసీ 171(ఐ) సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు