logo

ఏడు రోజులన్నారు.. ఏడిపిస్తున్నారు

సీపీఎస్‌.. ఈ విధానం రద్దుకు రాష్ట్రంలో ఉద్యోగులు తెలపని నిరసన లేదు.. చేయని ఆందోళన లేదు.

Updated : 17 Apr 2024 06:37 IST

సీపీఎస్‌ రద్దు చేయని వైకాపా ప్రభుత్వం
ఉమ్మడి జిల్లాలో 27,200 మంది ఉద్యోగుల వేదన ఇది
న్యూస్‌టుడే, పామర్రు

నాడు

‘అధికారంలోకి వస్తే.. వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తా. నా పిల్లలకు నేను బాగానే ముట్ట జెెప్పాననే సంతోషం ఉద్యోగుల ముఖాల్లో కనిపించేలా చూస్తా.’

 ప్రతిపక్షనేతగా జగన్‌ మోహన్‌రెడ్డి అయిదేళ్ల క్రితం చెప్పిన మాటలివి.


నేడు

సీపీఎస్‌ రద్దు చేయలేం.. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది. దానికన్నా మెరుగైన జీపీఎస్‌ తెస్తాం.


సీపీఎస్‌.. ఈ విధానం రద్దుకు రాష్ట్రంలో ఉద్యోగులు తెలపని నిరసన లేదు.. చేయని ఆందోళన లేదు. పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు.. రాస్తారోకో, రైల్‌రోకోల్లో పాల్గొన్నారు.. సీపీఎస్‌పై సమరభేరి మోగించారు.. 2కె, 4కె పాదయాత్రలు.. పరుగులు నిర్వహించి సమస్యను వివిధ రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇచ్చిన హామీని పక్కన పెట్టిన జగన్‌ సర్కారు.. ఉద్యోగులకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాని కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. ప్రశ్నించిన గొంతు నొక్కేయాలని.. ఆందోళనలను తొక్కేయాలని శతవిధాలా ప్రయత్నించినా.. అరెస్టులు చేసినా.. ఉద్యోగులు ఇప్పటికీ ముక్తకంఠంతో నినదిస్తూనే ఉన్నారు.

ఇతర రాష్ట్రాల్లో భారం పడదా?

ఓపీఎస్‌ పునరుద్ధరణ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందని.. ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారిపోతుందని కొత్త వాదన లేవనెత్తింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చలేమని, సీపీఎస్‌ రద్దు చేయడం కుదరదని చేతులెత్తేసింది. మరి ఇదే సమయంలో రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘడ్‌, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు ఎలా రద్దు చేశాయి.. కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా ప్రస్తుత ప్రభుత్వాలు సీపీఎస్‌ రద్దును ఎలా ప్రకటిస్తున్నాయి.. అని ఇక్కడి ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

  జీపీఎస్‌ అంటూ వక్రభాష్యం

సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా జీపీఎస్‌(గ్యారెంటీ పింఛన్‌ స్కీం) తీసుకొస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఈ విధానంలో ఉద్యోగి పదవీ విరమణ తరువాత పింఛనుకు పూర్తి గ్యారంటీ అని అంకెల గారడీ చేసింది. ఈ లెక్కలన్నీ తప్పుల తడకలే అని ఉద్యోగులు అంటున్నారు. 

ఇదీ రెండింటికీ తేడా..

  •  ఓపీఎస్‌(ఓల్డ్‌ పింఛను స్కీం): ఉద్యోగి పదవీ విరమణ చేశాక.. చివరి నెలలో ఉన్న వేతనంలో 50 శాతాన్ని సర్వీస్‌ పింఛను కింద ప్రభుత్వం చెల్లించేది. ఒకవేళ పింఛనుదారుడు చనిపోతే అతని భార్య, ఆ తరువాత వారిపై ఆధారపడిన దివ్యాంగులైన, పెళ్లికాని పిల్లలకు పింఛను అందించేవారు.
  •  సీపీఎస్‌(కాంట్రీబ్యూటరీ పింఛను విధానం): ఉద్యోగి చందా ఆధారిత స్కీం కింద వారి మూల వేతనం, డీఏ(కరవు భత్యం) నుంచి ప్రతి నెలా 10 శాతం చొప్పున కట్‌ చేస్తారు. దానికి ప్రభుత్వం మరో 10 శాతం జత చేసి మొత్తాన్ని ఎన్‌పీఎస్‌-ఎన్‌ఎస్‌డీఎల్‌కు బదిలీ చేస్తుంది. ఉద్యోగి పర్మినెంట్‌ రిటైర్‌మెంట్‌ అకౌంట్‌ నంబరులో ఈ మొతం జమ చేస్తారు. సదరు ఉద్యోగి పదవీ విరమణ చేశాక మొత్తం సొమ్ము నుంచి 60 శాతం చెల్లించేస్తారు. మరో 40 శాతం సొమ్మును షేర్‌ మార్కెట్‌లో కొనసాగిస్తూ.. వచ్చే లాభనష్టాలతో కలిపి ఎంతో కొంత ప్రతి నెలా పింఛను రూపంలో చెల్లిస్తారు.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

2004 జనవరి ఒకటో తేదీ తరువాత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అన్ని శాఖల్లోనూ కలిపి 27,200 మంది వరకూ ఉద్యోగులు చేరి విధులు నిర్వర్తిస్తున్నారు. అందరూ కూడా తమకు ఓపీఎస్‌ విధానంలోకి మార్చాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


జీపీఎస్‌ అంకెల గారడీ అంగీకరించం

మా కుటుంబాల ఆర్థిక ప్రయోజనాలూ మాకు ముఖ్యమే. ఓపీఎస్‌లో పలు రకాల అడ్వాన్సులు తీసుకునే అవకాశం ఉంది.  జీపీఎస్‌ అనేది అంకెల గారడీ తప్ప ఏం లేదు. సీపీఎస్‌ రద్దు చేసే వారికే ఉద్యోగులంతా అండ ఉంటాం. 

మద్దా బాపూజీ, వీఆర్వో సంఘ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు 


మాయమాటలతో నమ్మించాలనుకున్నారు..

సీపీఎస్‌ రద్దుకు కేంద్రం ఒప్పుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వం మాయమాటలు చెప్పి నమ్మించడానికి ప్రయత్నించింది. సీపీఎస్‌ను రద్దు చేసుకుని ఓపీఎస్‌ను అమలు చేసుకోవడం రాష్ట్రాల స్వయం నిర్ణయానికే వదిలేస్తున్నామని కచ్చితంగా కేంద్రం చెప్పడంతోనే పలు రాష్ట్రాలు ఈ దిశగా పయనిస్తున్నాయి. మరి మన రాష్ట్రాధినేతలకే ఈ మూర్ఖత్వం ఎందుకో అర్థం కావడం లేదు.

 ఎం.వెంకటేశ్వర్లు, ఎన్జీవోల సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి


ఇది మంచి విధానం కాదు..

సీపీఎస్‌ రద్దుకు అనేక ఉద్యమాలు చేశాం. మా డిమాండును ప్రభుత్వం పట్టించుకోకుండా జీపీఎస్‌ను అమల్లోకి తెచ్చింది. ఇది మంచి విధానం కాదు. సీపీఎస్‌, జీపీఎస్‌ వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఒరిగేది ఏమీలేదు. దీనివల్ల తీరని నష్టం ఏర్పడుతుంది.

 డి.శ్రీనివాస్‌, ఛైర్మన్‌, జెఏసీ, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని