logo

ఎన్నికల వేళ వైకాపాలో కుదుపు

రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో 1996 డిసెంబర్‌ 29న దళితులకు శిరోముండనం చేసిన ఘటన రాష్ట్రమంతా నాడు కుదిపేసింది. కుంగిపోయిన బాధితులు ఇళ్లలోనే ప్రాణభయంతో మగ్గిపోయారు.

Published : 17 Apr 2024 06:37 IST

శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు ఎదురుదెబ్బ
ఆయనతో సహా తొమ్మిది మందికి జైలు.. జరిమానా
దళితుల దశాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు ఉపశమనం

ఇరవై ఎనిమిదేళ్ల పాటు సాగించిన పోరాటమది..ఎన్నో మలుపులు, మరెన్నో అడ్డంకులు.. అయినా బాధితులు, సంఘాలు వెనుకడుగు వేయలేదు.. అయిదుగురు దళితులను హింసించి, అందులో ఇద్దరికి శిరోముండనం చేసి ఘోరంగా అవమానించిన కేసులో వైకాపా ఎమ్మెల్సీ, మండపేట వైకాపా అభ్యర్థి తోట త్రిమూర్తులుకు శిక్ష పడింది. ఆయనతోపాటు తొమ్మిది మందిని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. 18 నెలల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఎన్నికల వేళ తగిలిన ఎదురుదెబ్బ వైకాపాను అయోమయంలోకి నెట్టేసింది. నేర చరిత్ర న్యాయస్థానంలో రుజువు కావడంతో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి ప్రజల వద్దకు వెళ్తామనే తర్జనభర్జన నడుస్తోంది.

ఈనాడు, కాకినాడ

రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో 1996 డిసెంబర్‌ 29న దళితులకు శిరోముండనం చేసిన ఘటన రాష్ట్రమంతా నాడు కుదిపేసింది. కుంగిపోయిన బాధితులు ఇళ్లలోనే ప్రాణభయంతో మగ్గిపోయారు. విషయం ఆలస్యంగా వెలుగుచూడడం.. వ్యవహారం పెనుదుమారం రేపడంతో సాక్షాత్తూ అప్పటి జిల్లా ఎస్పీ తుషార్‌ ఆదిత్య త్రిపాఠిÈ విచారణకు రంగంలోకి దిగారు. 1997 జనవరి 5న ద్రాక్షరామ పోలీసు స్టేషన్‌లో ప్రధాన నిందితుడు తోట త్రిమూర్తులు, ఆయన కుటుంబీకులు, అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల చట్టం క్లాజ్‌ 3తోపాటు ఐపీసీ 506, 324 రెడ్‌ విత్‌ 34గా కేసు నంబర్‌ 1/97గా కేసు నమోదుచేశారు. 27 ఏళ్ల మూడు నెలలకు తీర్పు వెలువడింది.

విశాఖలో కోర్టు వద్ద తోట త్రిమూర్తులు, అనుచరులు

సభ్యసమాజం తలదించుకునేలా..

వెంకటాయపాలెంలో దళితులపై అఘాయిత్యం జరిగిందని.. సభ్య సమాజం తలవంచుకునేలా ఈ సంఘటన ఉందని అప్పటి ఎస్పీ పేర్కొన్నారు. 1996 డిసెంబర్‌ 21న వెంకటాయపాలెం నందిబొమ్మ వద్ద దళిత యువకులు కొందరు ఆడపిల్లలను కించపరిచేలా అసభ్యకర రాతలు రాశారని, ఇద్దరిపై కేసు నమోదయ్యిందని, రిమాండుకు వెళ్లి బెయిల్‌పై తిరిగి వచ్చిన తర్వాత ప్రతీకారంగా దళిత యువకులను హింసించిన ఘటన చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. చినరాజు, వెంకటరమణలకు శిరోముండనం చేయించడమే కాకుండా, కనుబొమ్మల మీద వెంట్రుకలు తొలగించారని.. గణపతి, పట్టాభిరామయ్య, వెంకటరమణలను తీవ్రంగా హింసించినట్లు బాధితులు వెల్లడించారని ఎస్పీ నాడు వివరించారు. కేసు నమోదు నుంచి తుది తీర్పు వరకు ఘటన అనేక మలుపులు తిరిగింది. తీర్పు నేపథ్యంలో పోలీసులు వెంకటాయపాలెం, ద్రాక్షారామ, బోసు కూడలి, యానాం కూడలి ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటుచేశారు. 

కులధ్రువీకరణ పత్రాలకూ మోకాలడ్డు

వైకాపా ప్రభుత్వంలో.. బాధిత దళితులు తమ కులధ్రువీకరణ పత్రాలకు కూడా పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. బాధితులు ఎస్సీలు కారంటూ ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ప్రభుత్వం కాకినాడ కలెక్టరేట్‌లో విచారణకు జేసీ కోర్టు ఏర్పాటు చేసింది. 2019 జూన్‌ 27న బాధితులకు రామచంద్రపురం మండల రెవెన్యూ అధికారి నుంచి కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరయ్యాయి. వీటిని రద్దుచేయాలని వెంకటాయపాలేనికి చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించారు. తోట త్రిమూర్తులు సైతం ఇంటీరియం స్టే ఆర్డర్‌ తెచ్చుకున్నారు. బాధితులు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేయడంతో.. వారికి కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని తహసీల్దారుకు సింగిల్‌ బెంచ్‌ జడ్జి ఆదేశాలిచ్చారు. దీన్ని అమలుచేయకుండా రామచంద్రపురం తహసీల్దారు, ప్రభుత్వ న్యాయవాదితో కలసి డివిజన్‌ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లారు. దానిని డిస్మిస్‌ చేయడంతో సింగిల్‌ బెంచ్‌ తీర్పు ప్రకారం ధ్రువపత్రాలు ఇవ్వాల్సి ఉండగా అమలుచేయకపోవడంతో బాధితులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తీర్పు ఇస్తూ 2019లో తహసీల్దారు జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలను పరిగణలోకి తీసుకుని కేసు విచారణ కొనసాగించమని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టుకు ఆదేశాలు జారీచేశారు. ఇలా కేసులో ఏళ్ల తరబడి జాప్యానికి వైకాపా ప్రభుత్వమూ కారణమైంది.

నీరుగార్చేందుకు నిందితుల ప్రయత్నాలెన్నో..

విశాఖపట్నం, కాకినాడ: బాధితుల తరపున.. 28 ఏళ్ల కాలంలో అయిదుగురు ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు(పీపీ)గా వాదనలు విన్పించారు. అందులో ముగ్గురిని వివిధ ఆరోపణలపై పక్కకు తప్పించారు. తొలుత రఫీ అహ్మద్‌, ఆ తర్వాత జవహర్‌ నియమితులయ్యారు. జవహర్‌ వాదన చట్ట పరిధిలో లేదని, తమని బెదిరిస్తున్నారంటూ ప్రధాన నిందితుడుగా ఉన్న తోట త్రిమూర్తులు ఫిర్యాదు చేయడంతో మార్పు చేశారు. అనంతరం సలాది శ్రీనివాస్‌ను నియమించగా...‘నిందితుడు, పీపీ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో న్యాయం జరిగే అవకాశం లేద’ని బాధితులు, దళిత సంఘాలు అభ్యంతరం తెలిపాయి. ఆ తర్వాత పీపీగా సుజాతను నియమించారు. అంతకు ముందు ఇచ్చిన సాక్ష్యంతోపాటు కుల ధ్రువీకరణ పత్రాలు ఆమె హయాంలో మాయమయ్యాయి. పోలీసుల వద్ద ఉన్న ఆధారాల్లో అవి కనిపించినా.. కొత్తగా కుల ధ్రువీకరణ తెచ్చుకోవాలని న్యాయమూర్తి సూచించారు. బాధితులు తెచ్చి ఆమెకు ఇవ్వగా కోర్టులో ఇవ్వకుండా హుద్‌హుద్‌ తుపాన్‌లో పోయాయని చెప్పారని, ఈ విషయంపై హైకోర్టుకు వెళ్లినట్లు విదసం(విశాఖ దళిత సంఘాల ఐక్యవేదిక) సభ్యులు తెలిపారు. దీంతో పాత ధ్రువీకరణ పత్రాలే పరిగణనలోకి తీసుకోమని చెబుతూ, 2016లో పీపీని ఈ కేసు నుంచి పక్కన పెట్టాలని హైకోర్టు సూచించిందన్నారు. తర్వాత 2018 నుంచి పీపీగా సత్యనారాయణ మూర్తి బాధితుల తరుపున వాదనలు వినిపిస్తున్నారు.

రాజకీయ పలుకుబడితో..

శిరోముండనం కేసును నీరుగార్చేందుకు తోట త్రిమూర్తులు రాజకీయ పలుకుబడితో ఎన్నో ప్రయత్నాలు చేశారు. దీంతో బాధితులకు ప్రజా, పౌర హక్కుల సంఘాల అండగా నిలిచాయి. దళిత ఐక్య పోరాట వేదిక- వెంకటాయపాలెం ఏర్పాటు చేసుకుని న్యాయపోరాటం చేశారు. ఫలితంగా త్రిమూర్తులుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అప్పట్లో కేసు నమోదు చేశారు. 87 రోజులపాటు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉంచారు. ఆయనకు క్లీన్‌చిట్‌ ఇస్తూ జస్టిస్‌ పుట్టుస్వామి కమిషన్‌ ఇచ్చిన నివేదికపై బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. తోట త్రిమూర్తులుని ప్రాసిక్యూట్‌ చేయాల్సిందేనని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడంతో.. 2008లో ఎస్‌.సి.నెం.2/2008 ప్రకారం శిరోముండనం కేసును రీ ఓపెన్‌ చేశారు. ప్రముఖ హైకోర్టు న్యాయవాది బొజ్జా తారకం ఆధ్వర్యంలో 2015 జనవరి 8న హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ (మాండమస్‌) వేశారు. ఎట్టకేలకు 2017లో విశాఖలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు