logo

పాదయాత్ర అబద్ధాలతో దండయాత్ర

పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను.

Published : 19 Apr 2024 05:05 IST

సాగునీటి వెతలు తీర్చలేదు
కొండలు, గుట్టలూ మాయం
హామీలు గాలికొదిలి నేడు మళ్లీ సిద్ధం సభ

పాదయాత్రలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు విన్నా. ప్రజలతో మమేకమై ప్రతి కష్టాన్ని చూశా. పంటలకు సక్రమంగా సాగునీరు అందించడంతోపాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాను. ప్రతి సమస్యకూ పరిష్కారం చూపుతా. నవరత్నాలతో ప్రతి జీవితాన్నీ మార్చేస్తా.

2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా జగన్‌ మాటలివి.

పాదయాత్రలో జగన్‌ హామీలను జనం నమ్మారు. అధికారం కట్టబెట్టారు. సీఎంగా వివిధ సందర్భాల్లో జిల్లాకు వచ్చినప్పుడూ  సమస్యలు విన్నారు. పరిష్కారం చూపిస్తానని, నిధులు ఇచ్చేస్తానని రూ.వందల కోట్లతో ముడిపడిన హామీలు గుప్పించారు. మళ్లీ అదే మాట.. పాత పాట చెప్పడానికి కాకినాడ సమీపంలోని సిద్ధం సభలో జగన్‌ పాల్గొననున్నారు.  ఈసారి నమ్మాలా..? వద్దా? అని తేల్చుకోవాల్సింది ప్రజలే.

మాయ మాటలతో ముంచేశారు..

30 జులై 2018

 • ఏలేరు రిజర్వాయర్‌ ద్వారా నియోజకవర్గంలో పొలాలకు సాగునీరు అందిస్తామని జగన్‌ చెప్పారు. తిరుమలాయపురం కాలువకు ఏలేరు నుంచి పంపుల ద్వారా నీరు అందిస్తామన్నారు. ఇవేవీ సాకారం కాలేదు.
 • సీఎం అయిన తర్వాత గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఏలేరు కుడికాలువ నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నేటికీ నిధుల ఊసేలేదు.
 • పుష్కర ఎత్తిపోతల పథకంలో 14వ లిఫ్ట్‌ ఏర్పాటు చేసి గ్రామాలకు మంచినీరు అందిస్తామన్న దానికీ దిక్కులేదు. ఆయిల్‌పాం, చెరకు రైతులను ఆదుకుంటామని మాట ఇచ్చి మోసం చేశారు.

పేద రోగులతోనూ ఓట్ల ఆట..

12 జూన్‌ 2018

 • జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను ఏరియా ఆసుపత్రిగా మారుస్తాం.  
 • జగ్గంపేట సీహెచ్‌సీ ప్రాంతీయ ఆసుపత్రిగా మారలేదు. ఈ ఆసుపత్రికి గండేపల్లి, కిర్లంపూడి జగ్గంపేట మండలాల నుంచి పెద్దసంఖ్యలో రోగులు వస్తారు. అత్యవసర కేసులైతే కాకినాడ తీసుకెళ్లాల్సి వస్తోంది.

26 జులై 2018

 • పెద్దాపురం సీహెచ్‌సీని ఏరియా ఆసుపత్రిగా మార్చుతాం. వైద్యసేవలు మెరుగుపరుస్తాం. సిబ్బంది కొరత తీరుస్తాం.
 • జగన్‌ మాటలే మిగిలాయి. పెద్దాపురం ఆసుపత్రిలో సర్జన్‌ కొరత వేధిస్తుండడంతో శస్త్రచికిత్స అవసరమైన కేసులు కాకినాడ తరలించాల్సి వస్తోంది.

11 ఆగస్టు 2018

 • తుని ప్రాంతీయ ఆసుపత్రిని అభివృద్ధి చేసి, సిబ్బంది కొరత తీరుస్తాం.. నూతన పరికరాలు సమకూరుస్తాం..
 • నాడు-నేడు పేరిట రూ.10 కోట్లతో ఆసుపత్రి అభివృద్ధి పనులు చేపడితే అయిదేళ్లలో రూ.3 కోట్ల విలువైన పనులు మాత్రమే జరిగాయి. రేడియాలజీ, డిప్యూటీ, జనరల్‌ సివిల్‌ సర్జన్‌, ఆర్‌ఎంవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్టాఫ్‌నర్సు, ల్యాబ్‌ టెక్నీషియన్‌, డార్క్‌ రూం అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ తదితర పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

కొండలు నేలమట్టం.. మట్టి మాయం..

మట్టి తవ్వకాలను, చెరువు కబ్జాలను అడ్డుకుంటానని పెద్దాపురం పాదయాత్రలో జగన్‌ భరోసా ఇచ్చారు. రామేశ్వరం మెట్టలో రెండు, మూడు విద్యుత్తు స్తంభాలంత ఎత్తున్న కొండలను నేలమట్టం చేసేశారు. వీటి వెనుక వైకాపా కీలక నేత ఉండడం గమనార్హం. ఆయనకు పార్టీ పెద్దల ఆశీస్సులు ఉండడంతో వీరి జోలికి ఎవ్వరూ వెళ్లరు.

 • తుని పాదయాత్రలో ఇసుక మాఫియాను అడ్డుకుంటామన్నారు. అవి ఆగలేదు సరికదా అంతకు మించిపోయాయి. అధికార పక్ష నాయకుల దన్నుతో చెలరేగిపోయారు. తాండవ నదిలో తుని గ్రామీణం, కోటనందూరు మండలాల పరిధిలో ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. ఆక్వాకు పూర్వవైభవం తెస్తామని భరోసా ఇచ్చినా.. యాజమాన్యానికి ఊరట దక్కలేదు. చెరువుల కోసం అధికారపక్ష నాయకులకు ముడుపులు చెల్లిస్తేనే అనుమతులు దక్కే పరిస్థితి ఉంది.

పైసా విదల్చ లేదు

31 జులై 2018

పిఠాపురం నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించిన జగన్‌ ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు పూర్తిచేసి నియోజకవర్గానికి సాగునీరు అందిస్తాం. పిఠాపురం బ్రాంచి కెనాల్‌ అభివృద్ధిచేసి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఇదే హామీలు పునరావృతం చేశారేగానీ.. రెండు దశల పనులకు ఇస్తానన్న రూ.292 కోట్లలో పైసా కూడా విదల్చలేదు.

భూబకా సురులు..

18 జులై 2018

కాకినాడలో భూ కబ్జాలను అరికడతానని ప్రతిపక్ష నేతగా భరోసా ఇచ్చారు. వైకాపా అధికారంలోకి వచ్చాకే భూ ఆక్రమణలు పెరిగాయి. రూ.వందల కోట్ల విలువైన భూములు చేతులు మారాయి. అధికారపక్ష నాయకులే ప్రైవేటు సైన్యంగా ఏర్పడి ఖాళీ భూములపై కన్నేసి, కబ్జా చేస్తున్నారు. దేవాదాయ, భూదాన, జిల్లా పరిషత్తు, ప్రభుత్వ భూములకూ రక్షణ లేకుండా పోయింది. అధికారులకు వందల సంఖ్యలో ఫిర్యాదులు వెళ్లినా న్యాయం జరగడం లేదు.

 • కాకినాడ గ్రామీణంలోని తమ్మవరంలో 300 ఎకరాల భూమికి సంబంధించి ఏపీఐఐసీ రైతులకు మధ్య వివాదం పరిష్కరిస్తామని జగన్‌ పాదయాత్రలో హామీ ఇచ్చినా నేటికీ పరిష్కారం చూపలేకపోయారు.

కాకినాడలో అన్నీ గాలి కబుర్లే..

కాకినాడ నగరంలో ఆయిల్‌, డీజిల్‌ మాఫియాకు అడ్డుకట్ట వేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. అవి ఆగకపోగా నాటుసారా, గంజాయి పెరిగాయి. ఆవ స్కీం కింద నగరానికి మంచినీటి సదుపాయం మెరుగుపరుస్తామని హామీ ఇచ్చినా ఆ ఊసేలేదు. అయిదేళ్ల క్రితం నిర్వహించిన పాదయాత్రలో కాకినాడ స్మార్ట్‌సిటీ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తయ్యేలా సహకరిస్తామని చెప్పినా.. వాటా నిధుల విడుదలలో జాప్యంతో నేటికీ పనులు కొలిక్కిరాలేదు. రూ.వెయ్యి కోట్లతో చేపట్టే పనుల్లో చాలావరకు నాసిరకంగానే ఉన్నాయి.

సీఎంగా చెప్పినా..

ఈ ఏడాది జనవరి 3న కాకినాడలో వైఎస్‌ఆర్‌ పింఛను కానుక పెంపు బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగిస్తూ.. కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని జగన్నాథపురంలో తాగునీటి¨ శుద్ధి ప్లాంటు నిర్మాణానికి రూ.47 కోట్లు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఈలోగా ఎన్నికలు వచ్చేశాయి. కాకినాడలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు అందించి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదు. ఉన్న పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొంది. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు లేక ఐటీ సంస్థలూ వెళ్లిపోయే పరిస్థితి. కాకినాడలో మెరైన్‌ యూనివర్సిటీ ఏర్పాటుచేస్తానని హామీ ఇచ్చినా ఆ మాటే లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని