logo

అసలేం జరుగుతోంది..?

ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్‌ పెట్టి తెప్పించేస్తారు.

Published : 19 Apr 2024 05:10 IST

అర్ధరాత్రి పూట ‘ప్రైవేటు’ నమూనాలకు పరీక్షలు
జీజీహెచ్‌ ల్యాబుల్లో ఇదీ పరిస్థితి

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం: ప్రజాధనం వృథా అయినా ఫర్వాలేదు. రోగులు పాట్లు పడినా పట్టించుకోరు.. కావాల్సిన మందులు ఉండవు.. అవసరం లేనివి మాత్రం పదేసి రెట్లు అధికంగా ఇండెంట్‌ పెట్టి తెప్పించేస్తారు. వచ్చినవన్నీ అందుబాటులో ఉన్నాయా లేక పక్కదారి పట్టాయా అనేది వారికే తెలియాలి.. ఇదీ రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో పరిస్థితి. సర్వజన ఆసుపత్రిలోని రోగనిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబుల్లో పరిస్థితి మరీ వింతగా ఉంటోంది. అవసరానికి మించి రోగ నిర్ధారణ కిట్లు తెప్పించడం, అవి ఉన్నాయో లేదో తెలియని వైనం ఒకటైతే.. అందులో పనిచేసే కొందరు ల్యాబ్‌ టెక్నీషియన్లు బయట సొంతంగా ల్యాబులు పెట్టుకుని అక్కడి పరీక్షలు సైతం జీజీహెచ్‌ కిట్లను ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీజీహెచ్‌కు వచ్చే నమూనాలను వారి ల్యాబులకు తీసుకెళ్లి ఉచితంగా అయ్యే పరీక్షలకు డబ్బులు వసూలు చేస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

అంతకుమించి..

రాజమహేంద్రవరం వైద్యశాల జీజీహెచ్‌గా మారిన తరువాత సిబ్బంది, వైద్యులు పెరగడంతో పాటు ల్యాబులను సైతం బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పెథాలజీగా మార్చారు. ఇందులో మైక్రోబయాలజీకి సంబంధించి ఇన్‌ఫ్లుయింజా వైరస్‌ వచ్చినప్పుడు ఉపయోగించే హెచ్‌1ఎన్‌1 కిట్లను వినియోగం కంటే 15 రెట్లు అధికంగా ఎందుకు తెప్పించారో ఆ విభాగపు అధికారులకే తెలియాలి. సాధారణంగా వీటిని అప్పుడప్పుడు మాత్రమే వినియోగిస్తుంటారు. నెలకు సుమారు పదిలోపు కూడా వినియోగించని పరిస్థితి. అలాంటిది ఒకేసారి అయిదు వేల కిట్లను ఏపీఎంఎస్‌ఐడీసీ నుంచి తెప్పించేశారు. బయోకెమిస్ట్రీకి సంబంధించి గుండెపోటు వచ్చిన రోగులకు పరీక్ష చేసే ట్రోపోనైన్‌ కిట్లను మూడువేల వరకు రప్పించారు. నెలకు సుమారు 30 కూడా వినియోగించని వీటిని మూడువేల వరకు ఇండెంట్‌ పెట్టి తెప్పించడం విమర్శలకు తావిస్తోంది. కీటోన్‌ బాడీస్‌ తెలుసుకునే కీటో కిట్లను సైతం మూడువేల వరకు రప్పించారు. ఇందుకోసం సుమారు రూ.4 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. వీటిని వెనక్కి పంపేందుకు చర్యలు చేపట్టామని ఉన్నతాధికారులు చెబుతున్నా ఇవి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయా లేక పక్కదారి పట్టాయా అన్నదానిపై దృష్టిసారించాల్సి ఉంది. ఆయా విభాగాల హెచ్‌వోడీల పర్యవేక్షణపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి.

రోగులను మభ్యపెట్టి..

ఆసుపత్రిలో పనిచేసే కొందరు ల్యాబ్‌ టెక్నీషియన్లు నగరంలో ప్రైవేటుగా ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకుని ఆసుపత్రికి వస్తున్న రోగులను మభ్యపెట్టి నమూనాలను తీసుకొస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జీజీహెచ్‌లోని కొన్ని కిట్లను సైతం మాయం చేసి సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇద్దరు ఉద్యోగులు ముఠాగా ఏర్పడి ప్రైవేటు ల్యాబులకు థైరాయిడ్‌ పరీక్షల కోసం వచ్చిన నమూనాలను సొమ్ములు తీసుకుని అర్ధరాత్రి సమయాల్లో జీజీహెచ్‌లోని యంత్రాలపై పరీక్షలు చేసేసుకుని రిపోర్టులు ఇచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల నుంచి ఇదంతా జరుగుతున్నా ఆయా విభాగాల హెచ్‌వోడీలు నోరు మెదపకపోవడం గమనార్హం. రోగులపై దురుసు ప్రవర్తన, ఇష్టానుసారం మాట్లాడటం వంటి ఆరోపణలు సైతం ల్యాబ్‌ ఉద్యోగులపై అధికంగా ఉన్నాయి.

పరిశీలించి చర్యలు చేపడతాం...

గతంలో ఆసుపత్రికి అధికంగా వచ్చిన హెచ్‌1ఎన్‌1, ట్రోపోనైన్‌ కిట్లను వెనక్కి పంపేందుకు చర్యలు చేపట్టాం. ఆసుపత్రిలో అర్ధరాత్రి ప్రైవేటు నమూనాలకు పరీక్షలు చేస్తున్న అంశంపై పరిశీలించి బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తాం.

డాక్టర్‌ లక్ష్మీసూర్యప్రభ, సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని