logo

ఎన్నికల వేళ యువతా.. అప్రమత్తం

ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్‌ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు.

Published : 19 Apr 2024 05:12 IST

జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నేరవార్తలు: ఎన్నికల వేళ యవత మరిన్ని జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలిచారని బైక్‌ ర్యాలీల్లో పాల్గొనడం, ప్రత్యర్థులతో ఘర్షణకు దిగడం వంటివి ఎంతమాత్రం సరికాదని హెచ్చరిస్తున్నారు. అలా వ్యవహరిస్తే బైండోవర్‌ తప్పదని,  చేసిన తప్పునకు ఏళ్లతరబడి స్టేషన్ల చుట్టూ తిరగడంతో పాటు కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుందంటున్నారు. అటువంటి వారిపై ఏ ఎన్నికలు వచ్చినా ముందుగా బైండోవర్‌ చేస్తుంటారు. మీ సమీపంలో ఎటువంటి అసాంఘిక, హింసాత్మక ఘటనలు జరిగితే మీరు స్టేషన్‌కు రావాల్సిందే.. పోలీసు అధికారులు మారినా.. మీపై పడిన ముద్ర అలాగే ఉంటుంది.

బైండోవర్‌ ఎలా చేస్తారు..

శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావించినా.. సదరు వ్యక్తి చర్యలు అనుమానాస్పదంగా ఉన్నా.. తహసీల్డారు, ఆర్డీవో ఎదుట పోలీసులు హాజరుపరుస్తారు. చట్టవ్యతిరేక పనులు చేసినా.. బాండు పేపర్లపై లిఖితపూర్వకంగా హామీ తీసుకుని సొంత పూచీకత్తుపై విడుదల చేస్తారు. దీన్నే బైండోవరు అంటారు. ఎన్నికల కోడ్‌ అమలు నాటినుంచి పోలీసులు బైండోవర్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా గోడవల్లో పాల్గొన్న వారిపై, అనుమానితులపై ఈ చర్యలు తీసుకుంటున్నారు. వారినుంచి హామీ పత్రం తీసుకుంటారు. రూ.లక్ష బాండు ఆధారంగా బైండోవరు చేస్తుంటారు.

ప్రభుత్వ ఉద్యోగానికీ అనర్హులే..

ఒకటి.. రెండు.. అంతకంటే ఎక్కువసార్లు తహసీల్దారు ఎదుట హాజరైన వ్యక్తిపై రౌడీషీట్‌ తెరవొచ్చు. షీట్‌ తెరవాలని సంబంధిత స్టేషన్‌ సీఐ ప్రతిపాదనను డీఎస్పీకి సిఫార్పు చేస్తారు. ఆయన పరిశీలించి అనుమతి జారీచేస్తారు. ఒక్కసారి తెరిస్తే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులవుతారు. పాస్‌పోర్టు లభించదు. ప్రతి వారం జరిగే కౌన్సెలింగ్‌లో పాల్గొనాలి. వారు ఉండే ప్రాంతాల్లో ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు, గొడవలు, ఘర్షణలు జరిగితే షీట్‌ ఉన్న వ్యక్తులను పిలిచి విచారిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న బైండోవర్లలో యువతనే అగ్రస్థానంలో ఉండటం గమనార్హం. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

జిల్లాలో ఇప్పటివరకు 5,689 మందిని బైండోవర్‌ చేశారు.
వీరిలో 708 మందిపై రౌడీషీట్లు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని