logo

జగన్‌ యాత్రన.. జనం యాతన

విద్యుత్తు కట్‌.. అంతర్జాలం బంద్‌.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు..

Updated : 19 Apr 2024 06:18 IST

విద్యుత్తు కట్‌.. అంతర్జాలం బంద్‌.. దుకాణాల మూత.. సామాన్యుల వాహనాలకు తోడు అంబులెన్సులు సైతం నిలిపివేత.. గంటలపాటు డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు..

ముఖ్యమంత్రి సిద్ధం రోడ్‌షో సాక్షిగా వేలాదిమంది ప్రజలు గురువారం పడిన అవస్థలివి. ఎంత సీఎం వస్తే మాత్రం మాకు ఇన్ని అగచాట్లా అంటూ భార్య, పసిబిడ్డతో ట్రాఫిక్‌లోనే ఉండిపోయిన యువకుడు ఆవేదన వ్యక్తం చేయగా.. ఆసుపత్రికి వెళ్లి వస్తుంటే ఇలా చిక్కుకుపోయా అంటూ ఓ పెద్దావిడ ఉసూరుమన్నారు. ఇలాంటి వేదనలు ఎన్నో...

ఈనాడు, కాకినాడ, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే బృందం: ఒకవైపు మండుటెండ.. ఇంటి నుంచి కాలు బయట పెట్టాలనే భయపడే పరిస్థితి. అలాంటిది ముఖ్యమంత్రి జగన్‌ ‘సిద్ధం’ రోడ్‌షో కోసం ఎక్కడికక్కడ జనంపై ఆంక్షలు విధించారు.. వాహనాలు నిలిపివేశారు.. ఇష్టానుసారం మళ్లించేశారు. నిడదవోలు నియోజకవర్గం పెరవలి మొదలుకొని రాజమహేంద్రవరం శివారు దివాన్‌చెరువు వరకు ఒకటే పరిస్థితి. భరించలేని ఎండలో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. గోపాలపురం, ఈతకోట, రావులపాలెంలో మహిళల పరిస్థితి సరేసరి. మిట్టమిధ్యాహ్నం జొన్నాడ జాతీయ రహదారిపై సుమారు అరగంటకు పైగా ట్రాఫిక్‌ ఆంక్షలతో అటు కాకినాడ ప్రధాన రహదారి, ఇటు రాజమహేంద్రవరం నుంచి రావులపాలెం రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి కనిపించాయి. ముఖ్యమంత్రి ఎక్కడో కిలోమీటర్ల దూరం ఉంటే ఇక్కడ తమను నిలిపివేయడం ఏమిటని పలువురు పోలీసులపై మండిపడ్డారు. నీ సీఎం యాత్రకు పలుచోట్ల ప్రజల నుంచి స్పందన కరవైంది. మూలస్థానం ఇందిరా కాలనీ సెంటర్‌, చొప్పెల్ల సెంటర్‌లలో కనీసం పదిమంది కూడా లేకపోయినా జగన్‌ బస్సులోంచి అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లారు.

రోడ్‌ షో కారణంగా రాజమహేంద్రవరం చర్చిగేటు మార్గంలో ఇలా..

బలవంతపు జనసమీకరణతో మమ

యాత్రకు ఆశించిన స్థాయిలో జనసమీకరణ చేయడంలో స్థానిక అభ్యర్థులు విఫలమయ్యారన్న అభిప్రాయం ఆ పార్టీ నాయకుల నుంచే వినిపిస్తోంది. మధ్యాహ్నం వరకు సాగిన యాత్రలో కనీస స్థాయిలో జనం లేరు. భోజన విరామ సమయంలో సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాజమహేంద్రవరం నగరం, గ్రామీణ నియోజకవర్గాల పరిధిలోని జనసమీకరణకు ఆపసోపాలు పడ్డారు.  కొత్తపేట నియోజకవర్గంలో సిద్ధం రోడ్‌షోకు వచ్చిన వారికి రూ.200, యువత వాహనాలకు పెట్రోలుకు రూ.200 కూపన్లు ఇచ్చారు. రాజమహేంద్రవరం నగరం, గ్రామీణ నియోజకవర్గాల పరిధిలోనూ మహిళలకు రూ.200 చొప్పున చెల్లించి గ్రామ కూడళ్ల వద్దకు వాహనాలు సమకూర్చి తీసుకొచ్చారు.

పెరవలిలో ట్రాఫిక్‌ ఆంక్షలు

నగరవాసులకు నరకం

ముఖ్యమంత్రి వాహనం రాజమహేంద్రవరం నగరంలోకి ప్రవేశించడానికి అర్ధగంట ముందు నుంచే ప్రధాన మార్గాల్లో పోలీసులు బారికేడ్లు పెట్టి ట్రాఫిక్‌ మళ్లించేశారు. మోరంపూడి కూడలి, తాడితోట, స్టేడియం రోడ్డు, దేవీచౌక్‌ వద్ద వాహన రాకపోకలను అడ్డుకోవడం వల్ల పక్క వీధులగుండా ద్విచక్రవాహనాలు, ఆటోలు వెళ్లడంతో అన్ని మార్గాలు కిక్కిరిశాయి. ట్రాఫిక్‌మళ్లించాల్సి వచ్చినప్పుడు ముందస్తుగా సమాచారం ఇచ్చి ప్రజలకు అప్రమత్తం చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కోటిపల్లి బస్టాండ్‌ నుంచి వచ్చే బస్సులను శ్యామలాసెంటర్‌ వద్ద ఆపేయడంతో పలువురు నడుచుకుంటూ వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ ఇతర బస్సులను సైతం గంటల కొద్దీ నిలిపేయడంతో ఉక్కపోతతో ప్రత్యక్ష నరకం చూశామని ప్రయాణికులు వాపోయారు. నగరంలోని పలు ప్రాంతాల్లో దుకాణాలను మధ్యాహ్నం నుంచే మూయించారు. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌ సేవలు నిలిచాయి. మొబైల్‌ నెట్‌వర్క్‌ సేవల్లో ఇబ్బందులు తలెత్తాయి. యాత్రకు వచ్చిన మహిళలకు నగదు ఇచ్చేందుకు డ్వాక్రా సంఘ సభ్యురాలు పేర్లు రాసుకుంటూ కనిపించారు. దివాన్‌చెరువు, రాజానగరం వద్ద  సీఎం బస్సు ఆగుతుందని ఎదురుచూసినా ఆపకపోవడంతో ఈమాత్రం దానికి ఇక్కడి వరకు ఎందుకు రావాలంటూ కొందరు అసహనం వ్యక్తం చేశారు.  జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ నిలిపేయడంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. రంగంపేట మండలం ఎస్‌.టి.రాజపురం బస కేంద్రానికి సీఎం చేరుకున్నారు. అప్పటివరకు వాహనాలు నిలిపేయడంతో కాకినాడ, దూరప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.

విద్యుత్తు నిలిపివేశారు

ఉదయం ఎనిమిదికి కరెంటు తీసేశారు. మళ్లీ 10.30 గంటలకు ఇచ్చారు. 12 గంటలకు ఇళ్లు, వ్యాపార దుకాణాలకు ఉన్న సర్వీసు తీగలను విద్యుత్తు స్తంభాల నుంచి తొలగించారు. దుకాణంలో వంటలు పూర్తికాక ఉక్కపోతతో యాతన అనుభవించాం. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇలా ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే మా లాంటి చిరువ్యాపారులం ఎలా సాగేది.

టి.సూర్యనారాయణరావు, కర్రీ పాయింట్‌ యజమాని, రాజమహేంద్రవరం

ఓ రోజు వ్యాపారం పోయింది

రాజమహేంద్రవరంలో ఫాస్ట్‌ ఫుడ్‌ బండి నడిపే చిరు వ్యాపారిని. ఉదయం నుంచి ఇంట్లో కరెంటు లేదు. దీంతో సాయంత్రం వ్యాపారానికి కావాల్సిన ఆహార పదార్థాలు తయారు చేసుకోలేకపోయా. సీఎం యాత్ర జరుగుతున్న మార్గాల్లో ఇలా జరుగుతుందని తెలిస్తే ఉదయం వస్తువులు కొనుగోలు చేసేవాడిని కాదు. అవి నిల్వ చేయలేని పదార్థాలు. వ్యాపారం పోయినట్లే.

ఎన్‌.ప్రసాద్‌బాబు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వాహకుడు, రాజమహేంద్రవరం

ఆరోగ్యం బాగోలేక వస్తే ఆపేశారు

ఆరోగ్యం బాగోలేక రాజమహేంద్రవరంలోని ఆసుపత్రికి వెళ్లి చూపించుకుని ఇంటికెళ్లేందుకు వచ్చా. ముఖ్యమంత్రి యాత్ర కారణంగా పోలీసులు రావులపాలెంలో బస్సులను నిలిపివేశారు. ఒకవైపు ఆరోగ్యం బాగోలేక.. మరోవైపు ఎండకు తట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నా.

భారతి, ఐ.పోలవరం

ముఖ్యమంత్రి కోసం ఇలా చేస్తారా?

వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్లి రావులపాలెం వచ్చాం. ముఖ్యమంత్రి పర్యటన ఉందంటూ బస్సులను ఆపివేయడం దారుణం. రహదారులపై ఇవి తిరగకుండా చేస్తే సామాన్య ప్రజలు ఏమైపోవాలి. ఇలా చేయడం సరికాదు.

కృష్ణవేణి, వాకాడ

రాంగ్‌రూట్‌లో సీఎం బస్సు యాత్ర..

బస్సు యాత్ర గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు కడియం మండలం కడియపులంకలోని భోజన విరామ శిబిరం వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వాహనశ్రేణి రాంగ్‌ రూట్‌లో జాతీయ రహదారిపై వెళ్లడం విమర్శలకు తావిచ్చింది. కడియం మండలం పొట్టిలంక అమ్మవారి ఆలయం దగ్గర్నుంచి రాంగ్‌రూట్‌లో బస ప్రాంతం ఉన్న కడియపులంక పూల మార్కెట్‌ కూడలి వరకు అర కిలోమీటరుపైగా వెళ్లారు. వాహనం వెళ్లిన 20 నిమిషాల వరకు అటుగా రాకపోకలు నిలిపివేశారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు అపసవ్య దిశలో రాకపోకలు సాగించాల్సి వచ్చింది. సీఎం, వైకాపా నేతల తీరును చూసి సామాన్యులకొక న్యాయం.. పెద్దలకో న్యాయ మా..? అనే చర్చ జనంలో నడిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని