logo

సిద్ధమంటూ వచ్చి.. నరకం చూపించి

చిన్నారులు మొదలు వృద్ధుల వరకు ఎవరినీ వదలలేదు. పొలోమని బస్సులెక్కించారు.. సిద్ధం సభకు తరలి రావాల్సిందే అంటూ హుకుంలు జారీ చేశారు..తమకు తెలియని ప్రాంతానికి వచ్చి మండుటెండల్లో వారు నరకం చూశారు..

Published : 20 Apr 2024 08:30 IST

సీఎం రోడ్‌ షో, సభ కోసం దారి పొడవునా అప్రకటిత ట్రాఫిక్‌ ఆంక్షలు

బస్సు యాత్రలో జగన్‌

ఈనాడు, రాజమహేంద్రవరం, కాకినాడ; న్యూస్‌టుడే, బృందం: చిన్నారులు మొదలు వృద్ధుల వరకు ఎవరినీ వదలలేదు. పొలోమని బస్సులెక్కించారు.. సిద్ధం సభకు తరలి రావాల్సిందే అంటూ హుకుంలు జారీ చేశారు..తమకు తెలియని ప్రాంతానికి వచ్చి మండుటెండల్లో వారు నరకం చూశారు..

ముఖ్యమంత్రి రోడ్‌షో సాగుతుందని జాతీయ రహదారిని అష్టదిగ్బంధం చేశారు.. వందలాది వాహనదారులకు తీవ్ర అవస్థలు చూపించారు. చీమలదండులా ఎటుచూసినా కదలని వాహనాలతో అత్యవసర పనులపై వివిధ జిల్లాలకు వెళ్లేవారు మాకేంటీ శిక్ష అంటూ విలవిల్లాడారు.

వైకాపా అధినేత, సీఎం జగన్‌ రెండురోజులపాటు చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు అవస్థలు మిగిల్చింది. రంగంపేట మండలం ఎస్టీ రాజపురంలోని బస ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం 10.45 గంటలకు బయలుదేరిన యాత్ర పెద్దాపురం, సామర్లకోట కూడళ్ల మీదుగా ఉండూరు వద్ద మధ్యాహ్న భోజన శిబిరం వద్దకు చేరుకుంది. కాకినాడ గ్రామీణం అచ్చంపేట కూడలి వద్ద సాయంత్రం ‘సిద్ధం’ సభ అనంతరం పిఠాపురం, తుని మీదుగా అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించింది. సభలో ప్రసంగం మినహా మరెక్కడా జగన్‌ పెదవి విప్పలేదు. యాత్ర సాగిన కూడళ్లలో జనం పలచబడడం వైకాపా అధినేతను నిరుత్సాహ పరిచింది. పెద్దాపురం కూడలి వద్ద పట్టుమని పదిమంది కూడా కనిపించలేదు.

సభ కోసం వినియోగించిన బస్సుల బారులు
 

కీలక మార్గంలో చోదకులకు ఇక్కట్లు..

రాజానగరం-కాకినాడ మార్గంలో రోడ్డు పక్కన గురువారం రాత్రి సీఎం బస చేయడంతో అప్పటి నుంచే పోలీసులు తీవ్రమైన ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. బస ప్రాంగణానికి బస్‌ వెళ్లేటప్పుడు.. బయటకు వచ్చేటప్పుడు గంటల తరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం ఉదయం నుంచే రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వెళ్లాల్సిన వాహనాలను జగ్గంపేట మీదుగా మళ్లించారు. కొందరు గ్రామాల నుంచి ఏడీబీ రోడ్డులోకి వెళ్తే బారికేడ్లతో అడ్డుకుని వెనక్కి పంపారు. రంగంపేట నుంచి రాజానగరం వెళ్లే ప్రధాన మార్గాన్ని పోలీసులు బ్లాక్‌ చేయడంతో అంతా గండేపల్లి మీదుగా అదనంగా పది కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి గమ్యస్థానాలకు చేరుకున్నారు.

 

మండుటెండలో నిరీక్షణ

యాత్ర సాగే మార్గంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో మిట్ట మధ్యాహ్నం వాహన చోదకులు, ప్రయాణికులు విలవిల్లాడారు. జగన్‌ యాత్ర కారణంగా ప్రత్యక్ష నకరం చూశామని జనం ఆవేదన వ్యక్తం చేశారు. రాజానగరం నుంచి కాకినాడ వరకు ఇష్టారాజ్యంగా ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టడంతో పోలీసులపై జనం మండిపడ్డారు. అత్యవసరంగా వెళ్లాల్సి ఉందని.. సీఎం వస్తున్నారని అడ్డుకుంటే ఎలా అంటూ నిలదీశారు.

డబ్బులిచ్చి.. తీసుకొచ్చి..

సీఎం సభకు వస్తే.. బస్సులో అన్ని ఏర్పాట్లుచేసి ఒక్కొక్కరికి రూ.200 నుంచి రూ.300 ఇస్తామని చెప్పి చాలా మందిని తరలించారు. ముందుగా డబ్బులివ్వకుండా.. సభ పూర్తయిన తరువాత వెళ్లేటప్పుడు సొమ్ములిస్తామని ఆశ చూపారు. బస్సుల్లో అల్పాహారం, మంచినీటి సీసాలు మాత్రమే సరఫరా చేశారని పలువురు తెలిపారు.

శంఖవరం: జాతీయ రహదారిపై కత్తిపూడి వద్ద శుక్రవారం రాత్రి ట్రాఫిక్‌

బయటకొచ్చేసిన జనం

కాకినాడ కలెక్టరేట్‌: అచ్చంపేట కూడలి వద్ద జరిగిన ‘సిద్ధం’ సిభలో సీఎం జగన్‌ ప్రసంగిస్తుండగానే జనం బయటకు వచ్చేశారు. ఆయన సాయంత్రం 4.58 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించి, 6.20 గంటలకు ముగించారు. 5.30 నుంచే జనం బయటకు వచ్చి బస్సుల వద్దకు బయలుదేరారు. స్థానిక నాయకుల ఒత్తిడి తట్టుకోలేక వచ్చామని, తిరిగి ఇళ్లకు చేరుకోడానికి ఇబ్బంది అవుతుందని మధ్యలో వచ్చేస్తున్నామని సమాధానమిచ్చారు. వచ్చామంటే వచ్చాం..వైకాపాపై ప్రేమ ఉండి కాదని’ చెప్పడం గమనార్హం.

సీఎం వస్తున్న మార్గం ఎంత సుందరంగా ఉందో

ఏడీబీ రహదారి ఆర్‌బీపట్నం వద్ద పోలీసులు బైకును నిలిపివేయడంతో పసికందుతో నిరీక్షణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని