logo

పాలనా శాపం.. పల్లెకు దాహం

తీర ప్రాంతంలోని ప్రజల దాహార్తి తీర్చడానికి ఓఎన్జీసీ స్వచ్ఛ జలధార పథకాలను ఏర్పాటు చేసింది. వాటిని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఆ ప్రాజెక్టులు నుంచి చుక్క నీరివ్వకుండానే నిరుపయోగంగా మారాయి.

Published : 22 Apr 2024 05:52 IST

స్వచ్ఛ జలధార పథకాలపై చిన్నచూపేల
తీరప్రాంత ప్రజల గొంతు తడపలేకపోయావా

అంతర్వేది దేవస్థానంలో నిరుపయోగంగా పథకం

న్యూస్‌టుడే, సఖినేటిపల్లి: తీర ప్రాంతంలోని ప్రజల దాహార్తి తీర్చడానికి ఓఎన్జీసీ స్వచ్ఛ జలధార పథకాలను ఏర్పాటు చేసింది. వాటిని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఆ ప్రాజెక్టులు నుంచి చుక్క నీరివ్వకుండానే నిరుపయోగంగా మారాయి. జిల్లాలో ఓఎన్జీసీ బావులున్న సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిదేవస్థానం, అంతర్వేదికర, కేశవదాసుపాలెం, మలికిపురం మండలంలోని గొల్లపాలెం, కేశనపలిలలోన్లు, ఉప్పలగుప్తం, అల్లవరం, కాట్రేనుకోన మండలాల్లో రెండేసి చొప్పున ఒక్కొక్కదానికి రూ.18లక్షలు వెచ్చించి తెదేపా ప్రభుత్వం సమయంలో ఓఎన్జీసీ ఏర్పాటు చేసి 2019 ఫిబ్రవరిలో ప్రారంభించారు. వీటి నుంచి తాగునీరు పొందాలంటే ఏటిఎం తరహాలో కార్డు పెడితే 20లీటర్లు నీరు వస్తుంది. దీనికోసం గ్రామాల్లో ప్రతి కుటుంబానికి ఒక కార్డు చొప్పున స్థానిక పంచాయతీలకు అప్పట్లో పంపించారు. ఇంతలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ పథకాన్ని పట్టించుకోకపోవడంతో ఇటు ప్రజల దాహార్తి తీరక, అటు ఓఎన్జీసీ ఆశయం నెరవేరలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల సమన్వయలోపంతో ఇవి ఇలా తయారయ్యాయి. తాగునీరు సక్రమంగా రాకపోవడంతో ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద రూ.25కి 20లీటర్లు చొప్పున నెలకు రూ.1000కుపైగా నీటికే ఖర్చు అవుతుందని ప్రజలు వాపోతున్నారు.  


సదాశయానికి నిర్లక్ష్యపు చెద...
- శంకరగుప్తం నాని, అంతర్వేది దేవస్థానం

మా గ్రామంలో తాగునీటి సమస్య విపరీతంగా ఉంది. ఓఎన్జీసీ మంచి ఆశయంతో స్వచ్ఛజలధార ప్రాజెక్టును పెట్టింది. దీనిని జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. గత ఐదేళ్ల నుంచి ప్రాజెక్టుకు సంబంధించిన యంత్రాలు తుప్పుపట్టిపోతున్నాయి. వీటిని వినియోగంలోకి తీసుకొస్తే ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి మంచినీరు కొనుక్కొనే అవసరం ఉండదు.


నీరివ్వకుండానే పాడైపోయింది...
- ఉండపల్లి అంజి, కేశవదాసుపాలెం

కేశవదాసుపాలెంలో ఓఎన్జీసీ ఏర్పాటు చేసిన స్వచ్ఛజలధార ప్రాజెక్టు నీరివ్వకుండానే పాడైపోయింది. తెదేపా కృషితో వీటిని ఏర్పాటు చేశారు. అయితే జగన్‌ పాలనలో అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో వీటిని వినియోగించకుండా వదిలేశారు. ఏర్పాటు చేసిన ఓఎన్జీసి పట్టించుకోలేదు. దీని వల్ల లక్షలు వ్యయం వృథాగా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని