logo

రాజులు కలిశారు.. దండయాత్రకు కదిలారు

గోపాలపురం నియోజకవర్గంలో ఇద్దరు రాజుల కలయికతో తెలుగు తమ్ముళ్ల హుషారు రెట్టింపు అయ్యింది. మొన్నటి వరకు ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా ఉన్నారు.

Published : 22 Apr 2024 05:57 IST

గోపాలపురం తెదేపాలో కొత్త జోష్‌

ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరాజు, జడ్పీ మాజీ ఛైర్మన్‌ బాపిరాజు కలిసి ప్రచారం

గోపాలపురం, న్యూస్‌టుడే: గోపాలపురం నియోజకవర్గంలో ఇద్దరు రాజుల కలయికతో తెలుగు తమ్ముళ్ల హుషారు రెట్టింపు అయ్యింది. మొన్నటి వరకు ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా ఉన్నారు. తెలుగు దేశం ఎమ్మెల్యే అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ మాజీ ఛైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజులు చెరో వర్గంగా ఉండేవారు. దీంతో నియోజకవర్గ తెదేపా శ్రేణుల్లో కొంత గందరగోళం ఉండేది. తెదేపాకు కంచుకోట అయిన గోపాలపురంలో 2019లో మాదిరిగా బీటలు పడతాయనే సందిగ్ధం ఉండేది. అధిష్ఠానం పలుమార్లు ఆ వర్గాలను పిలిచి మాట్లాడినా ప్రయోజనం కనిపించలేదు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఈనెల 5న నల్లజర్ల వచ్చారు. ఇరువర్గాల నాయకులతో మాట్లాడారు. బాపిరాజు వర్గం అనుకూలంగా స్పందించలేదు. మళ్లీ 10న నిడదవోలు వచ్చిన చంద్రబాబు మరోసారి బాపిరాజు వర్గంతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి పనిచేసే బాధ్యత తెదేపా ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులకు అప్పగించారు. సుదీర్ఘ చర్చల తర్వాత పెద్దల సమక్షంలో వెంకటరాజు, బాపిరాజు కలిశారు.

కలిసికట్టుగా మూడు పార్టీలు

ఇద్దరు రాజుల కలయికతో నియోజకవర్గంలోని తెదేపా శ్రేణులు మంచి జోష్‌ మీద ఉన్నారు. అప్పటివరకు స్తబ్ధుగా ఉన్న నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. వీరికి తోడుగా జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమంలో పాల్గొని, కార్యకర్తలను ఉరకలెత్తిస్తున్నారు. భాజపా శ్రేణులు సైతం ప్రచారంలో హుషారుగా పాల్గొంటున్నారు. మొన్నటివరకు అయోమయంలో ఉన్న నాయకులు ఇప్పుడు విజయం కోసం ఉరకలేస్తున్నారు. మద్దిపాటి నామినేషన్‌ రోజు అన్ని వర్గాల నాయకులు, మూడు పార్టీల శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని