logo

సారు సిద్ధమన్నారు.. జనం వెళ్లమన్నారు!

ఎన్నికలు వచ్చాయంటే పార్టీ ఏదైనా సభలు, యాత్రలు కళకళలాడతాయి. అధికార వైకాపాకు మాత్రం భిన్న పరిస్థితి.. ఆ పార్టీ అధినేత జగన్‌ బస్సు యాత్రగా తిరుగుతున్నా జనంలో స్పందన కరవవడంతో శ్రేణులు డీలా పడ్డాయి.

Published : 22 Apr 2024 06:03 IST

ఎన్నికల వేళ వైకాపాలో అంతర్మథనం
తుస్సుమన్న తాజా బస్సు యాత్ర

ఈనెల 18న రావులపాలెం మండలం చొప్పెల్ల వద్ద సిద్ధం బస్సు యాత్రకు జనం స్పందన ఇంతే

ఉమ్మడి జిల్లా బస్సు యాత్రలో జగన్‌ ఎక్కడా కనీసం పెదవి విప్పి మాట్లాడలేదు.

ఎండ తీవ్రత ఉన్నప్పుడు శీతల బస్సులోంచి నవ్వుతూ, నమస్కరిస్తూ ముందుకు కదిలారు. జనం కాస్త కనిపించిన చోట, స్థానిక అభ్యర్థులు ఒత్తిడి తెచ్చినచోట మాత్రం బస్సుపైకి ఎక్కి అభివాదం చేశారు.

అచ్చంపేటలోని సిద్ధం సభలో మాట్లాడినా.. గోదావరి జిల్లాల అభివృద్ధికి, ఇక్కడ ప్రజల మేలుకు ఏం చేస్తామనేది చెప్పలేదు. తెదేపా, జనసేన అధినేతలపై విమర్శలకే ప్రాధాన్యమిచ్చారు. వైకాపా అభ్యర్థులకు ‘మంచి’ అనే సర్టిఫికెట్‌ ఇచ్చి పరిచయాలు చేశారు.


ఈనాడు, కాకినాడ: ఎన్నికలు వచ్చాయంటే పార్టీ ఏదైనా సభలు, యాత్రలు కళకళలాడతాయి. అధికార వైకాపాకు మాత్రం భిన్న పరిస్థితి.. ఆ పార్టీ అధినేత జగన్‌ బస్సు యాత్రగా తిరుగుతున్నా జనంలో స్పందన కరవవడంతో శ్రేణులు డీలా పడ్డాయి. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఈనెల 18, 19 తేదీల్లో ఈ యాత్ర సాగింది. పెరవలిలో ప్రవేశించిన యాత్ర.. తుని మీదుగా అనకాపల్లి జిల్లాలోకి వెళ్లింది. మధ్యలో కాకినాడ గ్రామీణంలో ‘సిద్ధం’ సభ జరిగింది. ఉమ్మడి జిల్లాలోకి ప్రవేశించినప్పుడు పదిమందైనా స్వాగతం పలకడానికి లేకపోగా.. రావుపాలెం, రాజమహేంద్రవరం, కాకినాడ, తుని వంటి కీలక మార్గాల్లో సైతం జనం కానరాలేదు.


ప్రయాణికులకు నరకం

సిద్ధం సభకు లక్షల్లో హాజరవుతున్నారంటూ వైకాపా హడావుడి చేసినా.. కాకినాడ గ్రామీణంలో జరిగిన సభకు 18వేల నుంచి 20వేల మంది మాత్రమే వచ్చారన్నది నిఘావర్గాల అంచనా. పలు జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు కాకినాడ మళ్లించేశారు. గంటలకొద్దీ ట్రాఫిక్‌లో వాహనదారులు ఇరుక్కుపోయారు. అనేక బస్సుల్లో ఇద్దరు ముగ్గురు మాత్రమే సభకు వచ్చారు. వచ్చిన వారు సైతం తిరుగు ప్రయాణంలో అవస్థలు పడ్డారు. బస్సుల రద్దు ఫలితంగా ఆర్టీసీ డిపోల్లో ప్రయాణికులు నరకం చవిచూశారు.


హామీలు అమలుకాక.. మాటలపై నమ్మకం లేక..

2019 మార్చి 11న కాకినాడ గ్రామీణం నుంచి ఎన్నికల ప్రచారానికి జగన్‌ శ్రీకారం చుట్టారు. ప్రత్యేక హోదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతి ఇంట, ప్రతి గ్రామంలో వైకాపా కార్యకర్తలు తిరిగి చర్చ పెట్టాలి.. 25 ఎంపీ స్థానాలు మనమే గెలుచుకున్న తర్వాత కేంద్రంలో ఎవరు ప్రధాని కావాలన్నా.. ప్రత్యేక హోదా ఫైలుపై సంతకం పెట్టిన తర్వాతే మద్దతు ఇస్తామని చెబుదాం.’ అని అన్నారు. అధికారంలోకి వచ్చాక హోదా సాధించలేదు. అయిదేళ్లుగా ఇచ్చిన హామీలు గంగలో కలిసిపోయాయి. సిద్ధం సభలోనూ హోదాపై మాట మార్చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని