logo

జగనన్న ఏలుబడి.. గురువులు బాధపడి..

తమ పాలనలో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చామని, పేద విద్యార్థులకు కార్పొరేట్‌ తరహా విద్యను చేరువచేశామని గొప్పలు చెప్పే జగనన్న హయాంలో ప్రభుత్వ బడుల నిర్వహణ పూర్తిగా సాగిలపడిందని ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు.

Updated : 22 Apr 2024 07:28 IST

నేను ఇప్పటివరకు సుమారు రూ.1.50 లక్షల వరకు పాఠశాల నిర్వహణకు నా సొంత డబ్బులు ఖర్చు చేశా. గత విద్యా సంవత్సరం కేవలం రూ.30 వేలు మాత్రం తిరిగి వచ్చాయి. ఇంకా రూ.1.20 లక్షలు రావాల్సిఉంది. కొన్ని రోజుల్లో ఈ విద్యా సంవత్సరం పూర్తి కానుంది. బిల్లులు వస్తాయోరావో తెలియని పరిస్థితి.

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలానికి చెందిన ఓ హైస్కూల్‌ హెచ్‌ఎం


సమ్మెటివ్‌, ఫార్మెటివ్‌ పరీక్ష పత్రాలను ఆన్‌లైన్‌లో పెడతారు. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలి. జిరాక్సులకు మేమే ఖర్చుపెట్టుకోవాలి. పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రాల నుంచి పాఠశాలకు మేమే తెచ్చుకోవాలి. వీటికి రవాణా ఛార్జీలు కూడా ఇవ్వడం లేదు. ఇదేంటని ప్రశ్నిస్తుంటే రూ.లక్షల్లో వేతనాలు తీసుకోవడం లేదా.. అని అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు చులకనగా మాట్లాడి అవమానాలకు గురి చేస్తున్నారు.

ఉప్పలగుప్తం మండలానికి చెందిన ప్రధానోపాధ్యాయుడు

 


అమలాపురం పట్టణంలో జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌: తమ పాలనలో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చామని, పేద విద్యార్థులకు కార్పొరేట్‌ తరహా విద్యను చేరువచేశామని గొప్పలు చెప్పే జగనన్న హయాంలో ప్రభుత్వ బడుల నిర్వహణ పూర్తిగా సాగిలపడిందని ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చేశామంటూ సామాజిక మాధ్యమాలు, ప్రచార సభల్లో ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్నారు. ఇవన్నీ కేవలం ప్రచార ఆర్భాటాలు మాత్రమేనని, ఆచరణలో మాత్రం తమకు వైకాపా పాలనలో అష్టకష్టాలు తప్పడం లేదని పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ విద్యా వ్యవస్థ గురించి చెబుతున్నవన్నీ ఆబద్ధాలేనని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం సుద్దముక్క కొనేందుకు కూడా చిల్లిగవ్వ లేదంటూ ఉపాధ్యాయులు వాపోతున్నారు.


తెదేపా ప్రభుత్వంలో నాడు..

తెదేపా అధికారంలో ఉండగా విద్యావ్యస్థకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. ఏ విధమైన మార్పుచేర్పులు చేయాలన్నా నిపుణుల సూచనలు, ఉపాధ్యాయుల సలహాల మేరకు మాత్రమే నిర్ణయాలు తీసుకునేవారు. గత ప్రభుత్వం హయాంలో ప్రతి క్లస్టర్‌ రిసోర్స్‌ సెంటర్‌కు నాలుగు రకాల నిధులు మంజూరయ్యేవి. కంటింజెన్సీ, మీటింగ్‌ టీఏ, నిర్వహణ గ్రాంట్స్‌ నిధులు వచ్చేవి. అవి కాకుండా విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.25 వేల నుంచి రూ.3లక్షల వరకు పాఠశాల నిర్వహణ నిధులు అందించేవారు. వాటితో తరగతి గదులు, మరుగుదొడ్లు, నీటి ట్యాంకులు, ఇతర మరమ్మతులు, పాఠశాల నిర్వహణ వంటి పనులు చేసుకునేందుకు ప్రధానోపాధ్యాయులకు ఎంతో వెసులుబాటు ఉండేది.


వైకాపా పాలనలో నేడు..

రాష్ట్రంలో వైకాపా అధికారం చేపట్టిన తరువాత ఈ వసతులన్నీ మూలకుచేరాయి. ఈ అయిదేళ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పనులకు తప్ప, ఇతర ఖర్చులకు ఒక్క రూపాయి కూడా ఇచ్చిందిలేదు. మూడేళ్లుగా పాఠశాలల నిర్వహణ నిధులు పూర్తి స్థాయిలో ఇవ్వకపోవడంతో పాఠశాలల నిర్వహణ భారం తమపై పడుతోందని ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఎంఈవోలు, హెచ్‌ఎంలు విలవిల

విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేలా వైకాపా అయిదేళ్ల పాలన కొనసాగిందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. సౌకర్యాలు కల్పించకుండా తమపైనే పాఠశాల నిర్వహణ భారం మోపడం ఎంతవరకు సమంజసమని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మండల సముదాయాలకు నిధులు రాకపోవడంతో ఎంఈవోలు సొంత నిధులు ఖర్చుచేసి ప్రభుత్వంవైపు దీనంగా ఎదురుచూస్తున్నారు. క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌లదీ ఇదే దుస్థితి. తమ పరిధిలో జరిగే సమావేశాలకు తమ జేబుల్లోంచే నిధులు ఖర్చు చేయాల్సివస్తోందని వారు వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని