logo

అయ్యో అన్నదాత.. ఇది జగన్‌ రాసిన రాత

‘నేను విన్నాను.. నేను ఉన్నాను..’ అని జపించే సీఎం.. అన్నదాత వేదన వినడం లేదు. జగనన్న ఏలుబడిలో కౌలు రైతుల మెడపై ఉరి తాళ్లు వేలాడుతూనే ఉన్నాయి. సీసీఆర్‌ కార్డులు జారీ చేస్తున్నామని చెబుతున్నా అందేది కొందరికే.. కార్డులు పొందిన రైతులకు పంట రుణాలు అందుతున్నాయా..?

Published : 22 Apr 2024 06:24 IST

‘నేను విన్నాను.. నేను ఉన్నాను..’ అని జపించే సీఎం.. అన్నదాత వేదన వినడం లేదు. జగనన్న ఏలుబడిలో కౌలు రైతుల మెడపై ఉరి తాళ్లు వేలాడుతూనే ఉన్నాయి. సీసీఆర్‌ కార్డులు జారీ చేస్తున్నామని చెబుతున్నా అందేది కొందరికే.. కార్డులు పొందిన రైతులకు పంట రుణాలు అందుతున్నాయా..? అంటే అదీ లేదు.  అప్పులు తెచ్చి.. పెట్టుబడులు పెట్టి.. పంట నష్టం వస్తే రుణం తీర్చలేక కౌలు రైతులు ఊపిరి తీసుకుంటున్నారు. కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.  ఈ కుటుంబాలకు ప్రభుత్వ పరిహారమూ పరిహాసంగానే మారుతోంది.


జనసేనాని సాయంతో.. కదిలిన ప్రభుత్వం

భార్యాపిల్లలతో దుర్గారావు (పాత చిత్రం)

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం మర్లపాలెం శివారు తోట్లపాలేనికి చెందిన శీలం దుర్గారావు కౌలుకు మూడెకరాలు వరి సాగుచేసి పంటనష్టం రావడంతో అప్పులు తీర్చలేక 2019లో పొలంలో పురుగుమందు తాగి ప్రాణం తీసుకున్నారు. దుర్గారావుకు సీసీఆర్‌కార్డు లేకపోవడంతో పంటనష్ట పరిహారం, ఆర్బీకేలో ధాన్యం అమ్ముకునే అవకాశం తదితరాలు లేకుండా పోయాయి. ఏటా పంటనష్టపోవడంతో అప్పులభారం పెరిగి చివరకు బలవన్మరణానికి పాల్పడ్డారు. పెద్ద దిక్కు కోల్పోయి భార్య నాగలక్ష్మి, ఇద్దరు ఆడపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భర్త మృతితో గ్రామంలో ఉపాధి లేక.. ఇద్దరు పిల్లలతో నాగలక్ష్మి పొట్టచేతపట్టుకుని హైదరాబాద్‌కు వలస వెళ్లిపోయారు. మూడేళ్ల వరకు ప్రభుత్వం నుంచి పరిహారం అందించలేదు. నాగలక్ష్మి ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి వేడుకున్నా.. కనికరం చూపలేదు. తర్వాత 2022 మే నెలలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌.. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవాలనే సంకల్పంతో రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ క్రమంలో దుర్గారావు కుటుంబానికి రూ.లక్ష సాయాన్ని ఆయన అందించారు. ఆ తరువాత నాలుగు నెలలకు తీరిగ్గా ప్రభుత్వం నుంచి నాగలక్ష్మికి రూ.7లక్షల సాయం అందించారు. అప్పటికే పిల్లల చదువులు నిలిచి..చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి ఆ కుటుంబం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంది.


బతుకుదెరువుకు వలస బాట

కాకినాడ జిల్లా: గ్రాంటులో ఉపాధికి వలస వెళ్లడంతో సందడి లేని గృహాలు

తాళ్లరేవు: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరం పంచాయతీ పరిధిలో నాలుగు తరాల కిందట వ్యవసాయమే ఆధారంగా ఏర్పడింది గ్రాంటు గ్రామం. వ్యవసాయం కలిసిరాక పలు కుటుంబాలు వలస వెళ్లి హైదరాబాద్‌లో కూలిపని చేసుకుంటున్నాయి. వ్యవసాయంలో పెట్టుబడులు భారీగా పెరగడం, పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర రాకపోవడం, సకాలంలో సాగునీరు పొలాలకు అందించలేని పరిస్థితులు రైతులను నడ్డివిరిచే దుస్థితి ఏర్పడింది. పంట నష్టపోవడం, అప్పులు విపరీతంగా పెరగడం.. తీర్చలేని స్థితిలో మానసిక  ఒత్తిడికి గురై కుటుంబాలతో సహా రైతులు వలసబాట పట్టారు.

ఒకప్పుడు వ్యవసాయం పండగలా ఉండేది..

వ్యవసాయం అంటే ఒకప్పుడు మా ఊళ్లో పండగలా ఉండేది. ఊరందరికీ పనులు దొరికేవి. ప్రస్తుతం కొన్నేళ్లుగా వ్యవసాయమంటే నష్టాలే వస్తున్నాయి. అప్పులు అధికంగా ఉండడంతో నా కొడుకు, ముగ్గురు అల్లుళ్లు కుటుంబాలతో కూలిపని కోసం హైదరాబాద్‌ వెళ్లిపోయారు. నేను ఇంటి వద్ద ఒంటరిగా మిగిలా.

- పలివెల నాగేశ్వరరావు, గ్రాంటు గ్రామం


పేదింటిపై రూ.15 లక్షల భారం

జగ్గంపేట: కాట్రావులపల్లికి చెందిన కంకుపాటి నూకరాజు వ్యవసాయంపై ఆసక్తితో ఎనిమిది ఎకరాలు కౌలు తీసుకుని సాగు చేసి నష్టాల బారినపడ్డారు. అప్పుల బాధ భరించలేక కౌలుకు తీసుకున్న పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటన 2021లో చోటుచేసుకుంది. నూకరాజు మృతి ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. రూ.15 లక్షల వరకు పడిన ఆర్థిక భారం ఆ కుటుంబాన్ని కుదేలు చేసింది.  

భర్త నూకరాజు చిత్రపటంతో గంగ

ఇంటి స్థలానికీ నోచుకోలేదు

ఈ కుటుంబానికి కనీసం జగనన్న కాలనీలో స్థలం కూడా మంజూరు కాని పరిస్థితి. స్థలం కోసం వాలంటీర్లు, గ్రామ నాయకులకు విన్నవించినా మంజూరు చేయలేదని నూకరాజు భార్య గంగ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఒక చిన్న పెంకుటింట్లో రూ.1000 అద్దె చెల్లించి కుమారుడితో కలిసి ఉంటున్నారు.


నివేదిక వెళ్లినా స్పందన కరవు

వెంకట సుబ్బారావు కుటుంబ వేదన(పాత చిత్రం)

కిర్లంపూడి: కిర్లంపూడి మండలం గోనేడకు చెందిన పెన్నాడ వెంకట సుబ్బారావు(33) ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగుచేశారు. పంటనష్టంతో సాగుకు చేసిన అప్పు పెరిగిపోయి.. తీర్చేదారిలేక 2022లో పురుగుమందు తాగి పొలంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. పంట సాగుకు అప్పులు చేసి తీర్చలేకే రైతు మృతిచెందినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించినా వైకాపా సర్కారు నుంచి  స్పందన కరవైంది. రూ.5 లక్షల అప్పు తీర్చలేక ఆ కుటుంబం ఇప్పటికీ అవస్థ పడుతూనే ఉంది. ప్రభుత్వం కనీసం పంట నష్ట పరిహారమూ ఇవ్వలేదని మృతుడి భార్య విజయ కన్నీరుమున్నీరవుతున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తమ పరిస్థితి తెలుసుకుని రూ.లక్ష ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నారని ఆమె వివరించారు.


అందని సర్కారు సాయం

రాజానగరం: నందరాడకు చెందిన కడియాల సూర్యనారాయణ  ఎకరన్నర పొలంలో సాగుచేసుకుంటూ  కుటుంబాన్ని పోషించుకునేవారు. వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడం, పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం, సాగుకోసం తెచ్చిన అప్పులు  తీర్చేదారిలేక 2022లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికీ తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సాయం అందలేదని మృతుడి భార్య సూర్యకాంతం తెలిపారు. తమకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి అన్నారు. ఒక అమ్మాయికి వివాహం చేశామన్నారు. ప్రస్తుతం కుటుంబమంతా కూలి పనులకు వెళ్తున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని