logo

పిఠాపురంలో పవనోత్సాహం.. అత్యధికంగా పోలింగ్‌ నమోదు

ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకత సంతరించుకున్న పిఠాపురం నియోజకవర్గంలో పవనోత్సాహం కనిపించింది. ఈ ఎన్నికల వేళ ఎన్నడూ లేని విధంగా ఇక్కడ పోలింగ్‌ ప్రక్రియ సాగింది.

Published : 15 May 2024 05:34 IST

పిఠాపురం, న్యూస్‌టుడే: ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకత సంతరించుకున్న పిఠాపురం నియోజకవర్గంలో పవనోత్సాహం కనిపించింది. ఈ ఎన్నికల వేళ ఎన్నడూ లేని విధంగా ఇక్కడ పోలింగ్‌ ప్రక్రియ సాగింది. ఈ అసెంబ్లీ స్థానం నుంచి జనసేనాని పవన్‌కల్యాణ్‌ పోటీ చేయడంతో పోలింగ్‌లోనూ ఓటర్లు తమదైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఈసారి 86.63శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అదే 2014లో అయితే 79.44శాతం.. 2019లో 80.92శాతమని లెక్కలు చెబుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఈసారి నమోదు ఎక్కువే.

ప్రకటన నుంచీ అంతే

పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్నట్లు ప్రకటన వెలువడినప్పటి నుంచీ ఇక్కడ అందరి దృష్టి పెరిగింది. పోలింగ్‌ రోజుకు యువత, ఉద్యోగులు, వృద్ధులు భారీగా క్యూకట్టారు. ఉపాధి, ఉద్యోగం, చదువు కోసం పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న పిఠాపురం వాసులు ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడైనా, టిక్కెట్లు దొరక్కపోయినా స్వస్థలాలకు చేరుకున్నారు. గత ఎన్నికల్లో వచ్చి ఓటేయడానికి మొగ్గుచూపని వారు సైతం.. ఈసారి హాజరయ్యారు. మెగా కుటుంబ సభ్యులు, సినీ, బుల్లితెర నటులు నిత్యం క్షేత్రస్థాయిలో ఉంటూ ముమ్మరంగా ప్రచారం చేశారు.

వైకాపాకు తాయిలాల తలనొప్పి

ఈ నియోజకవర్గంలో వైకాపా నేతలు పోలింగ్‌కు రెండ్రోజుల ముందు నుంచి ఓటర్లకు ఎన్నికల తాయిలం కింద రూ.3వేలు పంపిణీ చేపట్టారు. ఇది  అనేకమందికి అందక ఆగ్రహం చెందారు. అభ్యర్థి వంగా గీతను పలు సందర్భాల్లో ప్రశ్నించడంతో పాటు.. వైకాపా నాయకుల ఇళ్లపై దాడులు, కార్యాలయాల వద్ద నిరసనలకు దిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని