logo

వరి మాసూళ్లకు చోటేదీ..!

ఖరీఫ్, రబీ సీజన్లలో వరిపంట చేతికొచ్చే సమయంలో రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. చినుకుపడితే పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థల అన్నీఇన్నీకావు.

Published : 18 May 2024 02:56 IST

ప్రైవేటు స్థలాలు...రహదారులే దిక్కు

తాటికాయలవారిపాలెంలో ప్రవేటు స్థలంలో ధాన్యం

పి.గన్నవరం, రాజోలు, న్యూస్‌టుడే: ఖరీఫ్, రబీ సీజన్లలో వరిపంట చేతికొచ్చే సమయంలో రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. చినుకుపడితే పంటను కాపాడుకునేందుకు రైతుల అవస్థల అన్నీఇన్నీకావు. గతంలో పంటకోసిన తరువాత మాసూళ్లు చేసేందుకు ప్రభుత్వస్థలాలు ఖాళీగా ఉండేవి. అలాంటి ప్రదేశాలకు వరిమోపులను చేర్చి అక్కడ మాసూళ్లు చేసేవారు. రానురాను ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలబారిన పడటంతో రైతులు వరిమాసూళ్ల సమయంలో పడుతున్న అవస్థలు అన్నీఇన్నీకావు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 1.69లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరిసాగుచేస్తున్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు వరిపంటకోసి మాసూళ్లు చేసేందుకు రహదారులు, ప్రైవేటు స్థలాలను ఆశ్రయించాల్సి వస్తుంది. ప్రధానంగా ఖరీఫ్‌ సమయంలో అధికవర్షాలు ఉంటాయి. ఆ సమయంలో పంటను ఒబ్బిడి చేసుకునేందుకు అనువైన జాగాలు లేవు.

పంట విరామ సమయంలో చర్చించినా...

పుష్కరకాలం క్రితం కోనసీమలో రైతులు పంటవిరామం ఉద్యమం చేపట్టారు. అప్పట్లో ఈ ఉద్యమం లోక్‌సభలో చర్చకు వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో జాతీయస్థాయి నాయకులు అమలాపురం వచ్చి పంటవిరామ ఉద్యమంపై చర్చించారు. అప్పట్లో రైతులు వివిధ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. వాటిలో ఒకటి కల్లాల సమస్య. వరిపంటను మాసూళ్లు చేసేందుకు అనువైన ప్రభుత్వస్థలాలు గుర్తించి వాటిని కాంక్రీటు కల్లాలుగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. పంటవిరామం ఉద్యమం నేపథ్యంలో రైతుల డిమాండ్లపై చర్చించి నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం అప్పట్లో మోహనకందా నేతృత్వంలో కమిటి ఏర్పాటుచేసింది. దీంట్లో రైతులకు కల్లాల సమస్యతోపాటు, పంటను ఒబ్బిడి చేసుకునేందుకు గోదాములు నిర్మించాల్సిన అవసరం ఉందని గుర్తించారు. నాటి డిమాండ్లు ఏవీ అమలుకు నోచుకోలేదు. రైతులు పంటను మాసూళ్లు చేసి విక్రయించేవరకు పంటను అనువైన ప్రదేశంలో ఉంచాలంటే అక్కడ బురద వాతావరణం ఉండకూడదు. కాంక్రీటుకల్లాలు, గోదాములు నిర్మిస్తే రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. వైకాపా ప్రభుత్వం కూడా రైతులకు ఈ బాపతు హామీలు ఇచ్చింది. అవికూడా అమలుకునోచుకోలేదు. ఇప్పటికైనా రైతులకు అనువైన కాంక్రీటు కల్లాలు, గోదాములు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని