logo

తొలగని ముంపు ముప్పు

సముద్ర మట్టానికి కాకినాడ నగరం దిగువున ఉంది. చిన్న వర్షం కురిసినా ముంపుబారిన పడుతోంది.

Published : 18 May 2024 03:03 IST

వర్షాలు కురుస్తున్నా స్పందించని అధికార యంత్రాంగం

జలమయమైన నగరంలోని మెయిన్‌రోడ్డు (పాతచిత్రం)

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: సముద్ర మట్టానికి కాకినాడ నగరం దిగువున ఉంది. చిన్న వర్షం కురిసినా ముంపుబారిన పడుతోంది. ఏటా వర్షాకాలంలో మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తమై పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుంది. ఇక వరదలు, భారీ వర్షాలు వస్తే చెప్పక్కర్లేదు.. సముద్రంలోకి కాలువల ద్వారా వెళ్లే నీరు వెనక్కి తన్నుకురావడంతో ముంపు అనివార్యం అవుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితులున్నా.. నగరపాలక సంస్థ పరిధిలో మురుగునీటి పారుదల వ్యవస్థను అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేస్తోంది. డ్రెయిన్లలో పేరుకుపోయిన పూడిక తొలగించకపోవడంతో అది ముంపునకు ప్రధాన కారణమవుతోంది. ఏటా ఏప్రిల్‌ నెలాఖరుకు కాలువల్లో పూడికతీత పనులు పూర్తిచేయాలి. ఈ ఏడాది మే నెలలో సగం రోజులు గడిచిపోయినా పూడికతీత పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఎప్పటికి పూర్తవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. సార్వత్రిక ఎన్నికల సాకుతో కీలకమైన డ్రెయినేజీ వ్యవస్థను అధికారులు నిర్లక్ష్యం చేశారు. అత్యవసర సేవల కిందకు వచ్చే ఈ పనులను పూర్తిచేయడంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే నగరంలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించి వానలు కురిస్తే మరోమారు నగరం మునకలో చిక్కుకుంటుంది.

చిన్నకాలువలను పట్టించుకోరా..?

నగరపాలక సంస్థ పరిధిలో 700 కిలోమీటర్ల పొడవునా మురుగునీటి పారుదల వ్యవస్థ విస్తరించి ఉంది. దీనిలో 44 కి.మీ. మేర మేజర్‌ డ్రెయినేజీ వ్యవస్థ ఉంది. ఏటా వీటిలో పూడికతీత పనులను ప్రైవేటు వ్యక్తులతో చేయిస్తారు. ఈ ఏడాది కూడా దాదాపు రూ.50 లక్షల నిధులతో పనులు అప్పగించారు. వీటిని మొక్కుబడిగా పూర్తిచేశారు. చీడీలపొర వంటి మేజరు డ్రెయిన్‌లో పూర్తిస్థాయిలో పూడిక తొలగలేదు. అధికారులు, గుత్తేదారు కుమ్మక్కై ఈ పనుల్లోనూ నొక్కేస్తున్నారు. అక్రమ వసూళ్లపై ఉన్న శ్రద్ధ చిన్న కాలువల్లో పూడిక తొలగింపుపై పెట్టడం లేదు. నగర పరిధిలో 15 శానిటేషన్‌ సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలోని డ్రెయిన్లలో పూడికతీత పనులు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోనే చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికి సగం సర్కిళ్లలో పనులు పూర్తి చేయలేదు. పూర్తిస్థాయిలో వర్షాలు కురవక ముందే యుద్ధప్రాతిదిక పనులు పూర్తిచేయకపోతే నగర ప్రజలకు ముంపు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గత ఏడాది ఎంతో మెరుగ్గా...!

గత ఏడాది వేసవిలో కాకినాడ కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి మహేశ్‌కుమార్‌ ఉన్నారు. ఆయన విధుల్లో చేరగానే డ్రెయినేజీ వ్యవస్థ, ముంపు నివారణ చర్యలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ప్రధాన డ్రెయిన్లలో పూడికతీత, శివారు ప్రాంతాల్లోని అవుట్‌లెట్ల పునరుద్ధరణ, పంపుహౌస్‌ వంటి పనులను ఏప్రిల్‌ నెలలోనే పూర్తి చేయించారు. దీంతో గత ఏడాది వర్షాకాలంలో ముంపు సమస్య చాలా వరకు తప్పింది. కమిషనర్‌ ఆకస్మికంగా బదిలీ అయిన తరవాత డ్రెయినేజీ వ్యవస్థను మిగిలిన అధికారులు నిర్లక్ష్యం చేశారు. ఈ ఏడాది ఇంజినీరింగ్‌ అధికారులు అస్సలు పట్టించుకోలేదు. సార్వత్రిక ఎన్నికల విధులను సాకుగా  చూపించి డ్రెయిన్లలో పూడికతీత పనులను గాలికొదిలేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని