logo

4 వరకు నిషేధాజ్ఞలు

జిల్లాలో జూన్‌ 4వ తేదీవరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత, ఎస్పీ జగదీష్‌ తెలిపారు.

Published : 18 May 2024 03:06 IST

సమావేశంలో కలెక్టర్, ఎస్పీ, జేసీ ఇతర అధికారులు

రాజమహేంద్రవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో జూన్‌ 4వ తేదీవరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత, ఎస్పీ జగదీష్‌ తెలిపారు. నలుగురికి మించి ఎక్కువ మంది ఎక్కడా గుమిగూడి ఉండకూడదని, కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేవరకు అనుమతి లేకుండా రాజకీయ, మతపరమైన సమావేశాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా శుక్రవారం దూరదృశ్య సమావేశం ద్వారా ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రం పరిసరాల్లో భద్రత ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్షించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్, ఎస్పీలతోపాటు జేసీ తేజ్‌భరత్, డీఆర్వో నరసింహులు ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ పోలింగ్‌ అనంతరం జిల్లాలోని ఏడు నియోజక వర్గాలకు సంబంధించి బ్యాలెట్, కంట్రోల్‌ యూనిట్లు, వీవీప్యాట్స్‌ను నన్నయ విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్‌రూమ్‌ల్లో అత్యంత జాగ్రత్తగా భద్రపరిచినట్లు తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రం, స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద కేంద్ర బలగాలు, ఆర్డ్మ్‌ పోలీసు ఫోర్సు, మొబైల్‌ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ, మూడంచెల భద్రతతో కూడిన పహారా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో ఎటువంటి విద్యుత్తు షార్టుసర్క్యూట్‌ జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నన్నయ విశ్వవిద్యాలయం వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు ముగిసేవరకు స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, అలాగే జిల్లా అంతటా నిషేధాజ్ఞలు అమలు జరుగుతాయని తెలిపారు. సమావేశంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కృష్ణనాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని