logo

ఎదురు చూపులే మిగిలినే..!

చక్కటి రహదారులు... తాగునీరు... విద్యుత్తు సదుపాయం... మురుగునీటికాలువలు  ... ఇలా పూర్తి మౌలిక వసతులతో జగనన్న లేఅవుట్‌లను తీర్చిదిద్దాం... అంటూ పాలకులు ఊదరగొట్టారు.

Published : 18 May 2024 03:24 IST

ఒక్క లేఔట్‌ బాగు పడలేదు.. ఒక్కరికీ ఇల్లు ఇవ్వలేదు
న్యూస్‌టుడే, పి.గన్నవరం

ఆర్‌.ఏనుగుపల్లిలో అసంపూర్తిగా మెరకపనులుచేసి వదిలేసిన జగనన్న లేఅవుట్‌

చక్కటి రహదారులు... తాగునీరు... విద్యుత్తు సదుపాయం... మురుగునీటికాలువలు  ... ఇలా పూర్తి మౌలిక వసతులతో జగనన్న లేఅవుట్‌లను తీర్చిదిద్దాం... అంటూ పాలకులు ఊదరగొట్టారు. 1.25 లక్షలమందికి జగనన్న లేఅవుట్‌ స్థలాలను అప్పగించామంటూ గొప్పలు చెప్పటం మినహా అసలు ఆ లేవుట్‌ స్థలాలు ఎలా ఉన్నాయి...? అవి పక్కా ఇళ్లు కట్టుకోవడానికి అనువుగా ఉన్నాయా...?లేదా...? మౌలిక వసతులు కల్పించామా...?లేదా.. అనే అంశాలపై  దృష్టిపెట్టలేదు.

పేదలకు పక్కాఇళ్ల నిర్మాణాలు చేపడతామంటూ జగన్‌ సర్కారు మూడేళ్లక్రితం నియోజకవర్గాల్లోని వివిధ గ్రామాల్లో జగనన్న లేఅవుట్‌లకోసం రూ.కోట్లు కుమ్మరించి భూసేకరణ చేసింది. జగనన్న కాలనీలు కాదు ఊళ్లేనంటూ చెప్పుకొచ్చిన ప్రభుత్వం కనీసం ఆ స్థలాలు ఇళ్ల నిర్మాణాలకు అనుకూలంగా లేవనే విషయాన్ని పట్టించుకోకపోవటం సహించరానిది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వ్యాప్తంగా 700 వరకు లేఔట్లలో సుమారు 20 వేల మంది లబ్ధిదారులను గుర్తించి పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం వాటిల్లో పూర్తిస్థాయిలో మెరకచేసి ప్రభుత్వం చెప్పినట్టు మౌలిక వసతులు కల్పించాలి. ఇలా ఏమీ చేయకుండా స్థలాలను లబ్ధిదారులకు స్వాధీనం చేయకుండా పక్కాఇళ్లు మంజూరు చేయకుండా వదిలేసింది. ఈ నేపథ్యంలో ఆ స్థలాల్లో దుబ్బులు, ఇతర మొక్కలు మొలిచిపోయి అధ్వానంగా మారాయి.

అనువుగానిచోట భూసేకరణ

ఇది పి.గన్నవరం మండలం గుడ్డాయిలంకలో జగనన్న లేఅవుట్‌. పూర్తిగా వరద ముంపుప్రాంతం. ఉద్థృతి వరదల సమయంలో ఇదంతా గోదావరిలా ఉంటుంది. పేదలకు పక్కాఇళ్లు నిర్మించేందుకు అనువుగాని ఈ స్థలాన్ని ఎందుకు సేకరించారంటూ ఎమ్మెల్యే  కొండేటి చిట్టిబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. జగనన్న లేఅవుట్‌లకోసం సేకరించిన ఇలాంటి స్థలాలు అనేకం ఉన్నాయి.

బరకాలే ఇంటి గోడలు...

ఈమె పేరు కొపనాతి నారాయణమ్మ, లంకలగన్నవరం గ్రామం. 2022 జులైలో వచ్చిన గోదావరి వరదలకు ఆమె పూరిల్లు పూర్తిగా దెబ్బతింది. మట్టి గోడలు వరదలకు నానిపోయి పడిపోయాయి. కనీసం మళ్లీ మట్టిగోడలు ఏర్పాటు చేసుకోలేని నిస్సహాయురాలు ఆమె. ప్రభుత్వం పక్కా ఇల్లు మంజూరు చేయకపోవడంతో పడిపోయిన మట్టిగోడలు స్థానే ప్లాస్టిక్‌ బరకాలు కట్టుకుని దుర్భర జీవితం గడుపుతుంది. ప్రభుత్వం పక్కాఇల్లు మంజూర ుచేస్తుందని ఆమె ఆశగా ఎదురుచూస్తుంది. వైకాపా ప్రభుత్వం మంజూరు చేయలేదు.

మెరక పేరు చెప్పి.. ఆగని తవ్వకాలు

పి.గన్నవరం మండలంలోని మానేపల్లి, శివాయిలంక, కందాలపాలెం, మొండెపులంక, వై.వి.పాలెం ఏటిగట్టుదిగువన, ఊడిమూడిలంకలో నాలుగేళ్లగా లంకభూముల్లో ఇష్టానుసారంగా మట్టి, తువ్వ వంటివి యంత్రాలతో తవ్వి తరలిస్తున్నారు. పి.గన్నవరం మండలంలోని జగనన్న లేఅవుట్‌లతోపాటు, ఇతరప్రాంతాల్లో జగనన్న లేఔవుట్‌లను మెరకచేసేందుకు లంకమట్టిని, తువ్వను తరలించేందుకు అనుమతులు ఇచ్చామంటూ అధికారులు చెప్పుకొచ్చారు. ఈ వంకతో  ఇసుకనుసైతం తరలించేశారు. నాలుగేళ్ల కాలంలో వేలకొలది టిప్పర్లలో ఈ వనరులు దోచేశారు.  లేఔట్‌లోనైనా నూరుశాతం మెరక చేయకపోవడం బాధాకరం. జగనన్న లేఅవుట్‌ల మెరకపనుల పేరుతో అనుమతులు తీసుకుని వైకాపా నాయకులు కొందరు ప్రైవేటు వ్యాపారం చేశారు.

పక్కా ఇళ్ల కోసం 27,224 కుటుంబాల నిరీక్షణ

జిల్లాలో బలహీనవర్గాల గృహనిర్మాణాల మంజూరుకోసం 27224 కుటుంబాలు వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిరీక్షిస్తున్నాయి. వీటిలో జగనన్న లేఅవుట్‌ కుటుంబాలు సుమారు 20వేలు ఉన్నాయి. సొంతస్థలాలు ఉన్న కుటుంబాలు 5422, ఇక 2022 జులైలో వచ్చిన గోదావరి వరదలకు పూరిళ్లు దెబ్బతిన్న కుటుంబాలు 1802 ఉన్నాయి. వీరికి పక్కాఇళ్లు మంజూరు చేయకపోవడంతో వారంతా పరాయిపంచన జీవిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు