logo

సుప్రీం చెప్పినా వినరా?

ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ ఇసుక మీదనే. అధికార పార్టీ ఆధ్వర్యంలో ఇష్టారీతిన నదులను ధ్వంసం చేసి రూ.వందల కోట్ల విలువైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టారు.

Updated : 18 May 2024 05:20 IST

ఇసుకాసురులకు పడని అడ్డుకట్ట
రేవుల్లో యంత్రాలు ఆగినా.. డ్రెడ్జింగ్‌ మాత్రం కొనసాగింపు
వందల లారీల్లో తరలింపు

పడవల పోటీలు కాదు.. ధవళేశ్వరం వద్ద గోదావరిలో ఇసుక తవ్వుతున్న డ్రెడ్జింగ్‌ బోట్లు

ఈనాడు, రాజమహేంద్రవరం: ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ ఇసుక మీదనే. అధికార పార్టీ ఆధ్వర్యంలో ఇష్టారీతిన నదులను ధ్వంసం చేసి రూ.వందల కోట్ల విలువైన ఇసుకను అక్రమార్కులు కొల్లగొట్టారు. ఈ తవ్వకాలపై అధికారులను హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్, సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నిస్తున్నా మార్పు రావడంలేదు. తాజాగా జిల్లా స్థాయిలో కమిటీలు వేయాలని.. ఎక్కడైనా అక్రమంగా తవ్వినట్లు నిర్ధారణైతే చర్యలు తప్పవని సుప్రీంకోర్టు ఆదేశించింది. శుక్రవారం ఓపెన్‌ రీచ్‌లలో ఉన్న యంత్రాలన్నీ బయటకు వచ్చి తవ్వకాలు నిలిచినా.. గోదావరిలో డ్రెడ్జింగ్‌ భారీస్థాయిలో కొనసాగింది. బోట్స్‌మన్‌ సొసైటీల పేరుతో దందా నడుస్తోంది.

70 పడవల్లో తోడేస్తూ..

రాజమహేంద్రవరం గ్రామీణ పరిధి ధవళేశ్వరం ఎడమ గట్టుకు ఆనుకుని 8 రీచ్‌లకు అనుమతులున్నాయి. నిబంధనల మేరకు బోట్స్‌మన్‌ సొసైటీ సభ్యులు పడవల్లో వెళ్లి ఇసుక తెచ్చిన తరువాత లారీల్లో లోడ్‌ చేయాలి. గతంలో లోడింగ్‌ కూడా మనుషులే చేయడం వల్ల వేలాది మందికి ఉపాధి లభించేది. ఇప్పుడు భిన్నం. ఆ రీచ్‌లో యంత్రాలే తప్ప మనుషులు కనిపించరు.

  • ధవళేశ్వరం, కాతేరు, వెంకటనగరం, కోటిలింగాలు, దొండగంటిరేవు, యర్నమ్మ రేవుల్లోని సుమారు 30 రీచ్‌లలో దాదాపు 150 బోట్స్‌మన్‌ సొసైటీలకు డీసిల్టేషన్‌ ద్వారా ఇసుక తీసేందుకు అనుమతులున్నాయి. ఈ సొసైటీల్లో 2 వేల మంది సభ్యులుంటారని అంచనా.
  • దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న రీతిలో కొత్త ప్రభుత్వం రాకముందే నదిని పిండేందుకు అక్రమార్కులు బరితెగించారు. భారీ డ్రెడ్జర్లతో ఇసుకను తవ్వేసి 30 నుంచి 50 టన్నుల లారీల్లో తరలిస్తున్నారు. గోదావరి తీరంలో 70 డ్రెడ్జర్లతో రోజూ 35 వేల టన్నుల ఇసుక తోడి తరలిస్తున్నట్లు అంచనా.

గాయత్రీ రేవు వద్ద శుక్రవారం ఇసుక తరలించే వాహనాలు

దూసుకొస్తున్నాయ్‌..

ధవళేశ్వరం సమీపంలోని గాయత్రీ ర్యాంపుల్లో డ్రెడ్జర్లతో ఇసుక తవ్వకాలు సాగుతున్న ప్రాంతాన్ని ‘ఈనాడు’ పరిశీలించింది. తోడేస్తూ.. లారీల్లో భారీ యంత్రాలతో లోడింగ్‌ చేస్తున్నారు. గోదావరిలో ఎటుచూసినా డ్రెడ్జర్లు తిరుగుతున్న దృశ్యాలే. పడవల పోటీని తలపించేలా ఉన్నాయి.

అబ్బే.. ఆ బాధ్యత మాదికాదు

ఇసుక ఏవిధంగా తవ్వుతున్నారనేది జలవనరుల శాఖ పరిధి అని.. భూగర్భ గనుల శాఖ ఏడీ సుబ్రహ్మణ్యం చెబుతున్నారు. ఇసుక బయటకు వచ్చిన తరువాతే తమ పాత్ర ఉంటుందన్నారు. డ్రెడ్జింగ్‌ అంశం తమ పరిధిలోకి రాదన్నారు.

కడియం మండలం బుర్రిలంక వద్ద స్టాక్‌పాయింట్‌ ఎలా సిద్ధం చేశారో చూశారా..

ఎస్‌ఈబీ ఏం చేస్తున్నట్టు..

మద్యం, ఇసుక అక్రమ రవాణా, తవ్వకాల అడ్డుకట్టకు వైకాపా ప్రభుత్వం ఎస్‌ఈబీ (స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో)ను నియమించింది. గోదావరిలో యంత్రాలతో తవ్వకాలు సాగినా, డ్రెడ్జింగ్‌ జరుగుతున్నా ఈ విభాగం ఏం చేస్తోంది..? బోట్స్‌మన్‌ సొసైటీల పేరిట అనుమతులు పొంది ఇలా డ్రెడ్జింగ్‌ చేయకూడదని నిబంధనలున్నా జలవనరులశాఖ కిమ్మనడంలేదు.

అరకొర చేస్తుండొచ్చు

ధవళేశ్వరంలోని జలవనరులశాఖ కార్యాలయాలకు సమీపంలో యథేచ్ఛగా ఇసుక డ్రెడ్జింగ్‌ జరుగుతున్న విషయాన్ని ఆ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్తే శనివారం ఈఈని తనిఖీలకు పంపిస్తామని తెలిపారు. ఇప్పటివరకు మీ దృష్టికి రాలేదా అని ప్రశ్నిస్తే బోట్స్‌మన్‌ సొసైటీలు అప్పుడప్పుడు అరకొర చేస్తుండొచ్చని, భారీగా డ్రెడ్జింగ్‌ జరుగుతున్నట్లు తెలియదన్నారు.


రీచులలో నిశ్శబ్దం

ఈనాడు కథనానికి స్పందన

బుర్రిలంక రేవు నుంచి యంత్రాలను లారీలో బయటకు తరలిస్తూ..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఇసుక ఓపెన్‌ రీచ్‌లన్నీ శుక్రవారం నిశ్శబ్దంగా కనిపించాయి. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకు తోడు.. జిల్లాలో దందాపై ‘ఈనాడు’లో ‘నడుంబిగిస్తారా.. నిద్ర నటిస్తారా!’ శీర్షికన శుక్రవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కడియం మండలం బుర్రిలంక రేవు నుంచి 10 జేసీబీలు, 5 ట్యాంకర్లు బయటకు వచ్చాయి. ఆ రేవులో ఉన్న వేబ్రిడ్జికి తాళాలు వేసి అక్రమార్కులు పలాయనం చిత్తగించారు. భారీ ఎక్స్‌కవేటర్లను లారీల్లో తరలించారు. నిడదవోలు, సీతానగరం, పెరవలి మండలాలు.. కోనసీమ జిల్లాలోని కపిలేశ్వరపురంలో పడవలు నిలిచిపోయాయి.

ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక - రాజుపాలెం మధ్యలో అనుమతులు లేకున్నా కొద్ది రోజులుగా తవ్వకాలు జరిగాయి.

గురువారం రాత్రి సైతం ఇసుక తరలించారు. దీనిపైనా కథనం రావడంతో రెవెన్యూ అధికారులు శుక్రవారం చేరుకుని గోదావరిలోకి వెళ్లే మార్గాన్ని జేసీబీతో ధ్వంసం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని