logo

ఖరీఫ్‌ సాగుపై సందిగ్ధం!

జిల్లాలో ఖరీఫ్‌ వరిసాగుపై సందిగ్ధం నెలకొంది. సకాలంలో పంట కాలం పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

Updated : 21 May 2024 05:27 IST

జూన్‌ 1 నుంచి నీటి విడుదలపై తర్జనభర్జన

నేడు వ్యవసాయ అధికారుల కీలక సమావేశం

న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌: జిల్లాలో ఖరీఫ్‌ వరిసాగుపై సందిగ్ధం నెలకొంది. సకాలంలో పంట కాలం పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వచ్చేనెల 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఖరీఫ్‌ సాగు ప్రణాళికలు, జూన్‌ 1 నుంచి గోదావరి కాలువలకు తాగునీటి విడుదల అంశాలపై అధికార యంత్రాంగం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా.. పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై అధికారులు అంతర్మథనం చెందుతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరాక.. సాగునీరు విడుదల చేయాలా..?.. ఈలోగా నీరివ్వకపోతే ఖరీఫ్‌ పరిస్థితి ఏంటనే చర్చ తీవ్రంగా నడుస్తోంది. 

ప్రభుత్వ విధానాలు.. రైతులకు శాపం

వైకాపా ప్రభుత్వంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెట్టుబడి రాయితీ, పంట నష్టపరిహారం, బీమా, తుపాను పరిహారం విడుదలకు ఎప్పుడో బటన్‌నొక్కిన సీఎం జగన్‌.. ఎన్నికల పోలింగ్‌ తర్వాత కూడా వాటిని రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయలేని దుస్థితిని తీసుకువచ్చారు. ఇవన్నీ ఇప్పుడు రైతులకు శాపంగా మారాయి. ఇక పది రోజుల్లో ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధం కావాల్సి ఉంది. జూన్‌ ఒకటి నుంచి కాలువలకు నీరిస్తే.. నంబరు నెలాఖరుకు కోతలు పూర్తవుతాయి. మళ్లీ డిసెంబరులో రబీ నాట్లు వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఖరీప్‌కు సకాలంలో నీరివ్వకపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్‌కు సంధికాలం నడుస్తోంది. కాలువలకు సాగునీరు విడుదల, వ్యవపాయ ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. ఇలాంటి తరునంలో మంగళవారం కాకినాడలో జిల్లా వ్యవసాయ శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. మండలాల వారీగా వ్యవసాయ అధికారుల నుంచి సాగు విస్తీర్ణంపై వివరాలు సేకరించనుంది. మంగళవారంనాటి సమావేశంలో ఏం నిర్ణయాలు చేస్తారో వేచి చూడాలి.

రబీకి వద్దన్నా నీరిచ్చేశారు..?

జిల్లాలో రబీలో వరి పంట పొట్ట, ఈనిక దశలో ఉన్నప్పడు జవనరుల శాఖ సాగునీరు సక్రమంగా అందించలేకపోయింది. తీరా పంట చేతికి వచ్చాక ఈ నెల 10 వరకు సాగునీరిచ్చారు. దీంతో చాలాచోట్ల పంట పొలాల్లోకి నీరు చేరి ఇబ్బందులు  ఏర్పడ్డాయి. తాళ్లరేవు మండలంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇక్కడ కీలక దళలో నీళ్లు లేక రైతు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేతికి వచ్చిన పంటను కోసుకోడానికి అవస్థలు పడ్డారు. వాస్తవంగా ఏప్రిల్‌ 20 నాటికి కాలువులకు నీటి సరఫరా నిలిపివేయాలి. మళ్లీ జూన్‌ ఒకటి నుంచి నీరివ్వాలి. ఈ పరిస్థితి లేకపోవడంతో జిల్లాలో అపరాల సాగుకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలాచోట్ల అపరాల సాగు చేయలేదు. రబీ కోతలు ముగియగానే పొలాన్ని దున్ని అపరాలు సాగు చేస్తారు. కానీ ఈ నెల 10 వరకు నీటిని సరఫరా చేయడంతో అపరాల సాగు అటకెక్కింది. దీంతో ఈ ఏడాది పెసలు, మినుములు రైతుల అవసరాలకు అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. ఇన్ని ప్రతికూలతల నేపథ్యంలో ఖరీప్‌ సాగును ఏవిధంగా గట్టెక్కిస్తారో చూడాలి.

జిల్లాలో వనరులు

జిల్లాలో తూర్పుడెల్టా పరిధిలోని ఆయకట్టుకు గోదావరి కాలువ, ఇతర ప్రాంతాలకు ఏలేరు, పీబీసీ, పంపా నుంచి నీరు అందుతుంది. మెట్ట ప్రాంతాల్లో బోర్లు ఆధారంగానూ సాగు చేస్తారు.

కాలువల పనులు లేనట్టే..

సాధారణంగా ప్రతి వేసవిలో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు గోదావరి కాలువ ఆధునికీకరణ పనులు చేపడతారు. కాలువల్లో పూడికతీత, గుర్రపు డెక్కను తొలగిస్తారు. సాగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించిన వాటికి సాంకేతిక మరమ్మతులు చేపడతారు. ఈసారి ఈ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఖరీఫ్‌లో శివారు ప్రాంతాలో ఏవిధంగా సాగునీరు ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో గోదావరి, ఏలేరు, పీబీసీ ద్వారా ఖరీఫ్‌కు నీరు అందించాల్సి ఉంది. వీటిలో కాలువలకు సంబంధించిన మరమ్మతులు చేపట్టపోతే పరిస్థితి అగమ్యచోచరంగా మారే అవకాశం ఉంది.

2.60 లక్షల ఎకరాల్లో  సాధ్యమేనా..?

జిల్లాలో ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో 2.60 లక్షల ఎకరాల్లో వ్యవపాయ పంటలు సాగు చేస్తున్నారు. దీనిలో 2.22 లక్షల ఎకరాల్లో వరి ఉంటుంది. ఈ సారి పూర్తి ఆయకట్టుకు సాగునీరు ఇస్తారా.. లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. నీటి లభ్యత ఆధారంగా జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఈసారి ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాలు జరగలేదు. జిల్లాలోని 21 మండలాల పరిధిలో తూర్పుడెల్టాకు గోదావరి నుంచి, ఇతర ప్రాంతాలకు ఏలేరు, పీబీసీ, పంపా నుంచి సాగునీరు అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం గోదావరిలో నీటి లభ్యత ఉన్నా.. ఎప్పటి నుంచి నీటిని విడుదల చేయాలనే మీమాంస నెలకొంది. జూన్‌ 15 తర్వాత నీటిని విడుదల చేయాలని జలవనరుల శాఖ ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌ సాగు ఏవిధంగా ఉంటుందనేది వేచి చూడాలి.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు