logo

పల్లెల్లో చీకట్లు.. ప్రజలకు ఇక్కట్లు

అప్పటి వరకు ఉన్న పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం 2018 జులైతో ముగిసింది. దాంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది.

Published : 21 May 2024 05:34 IST

అల్లవరం మండలంలోని ఓ గ్రామంలో ఎల్‌ఈడీ దీపాలు పాడవటంతో సాధారణ బల్బు ఏర్పాటు చేసిన స్తంభం

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌: గ్రామ పంచాయతీల్లో వీధి దీపాల నిర్వహణ దయనీయంగా మారింది. విద్యుత్తు ఆదాతో పాటు పంచాయతీలపై నిర్వహణ భారం తగ్గించేందుకు గతంలోనే స్తంభాలకు ఎల్‌ఈడీ దీపాలు బిగించారు. నిర్వహణ బాధ్యతలను ఇంధన సామర్థ్య సేవల సంస్థకు అప్పగించారు. ఎల్‌ఈడీ దీపాల వినియోగం ద్వారా ఆదా అయిన సొమ్మువాయిదాల రూపంలో లైట్లు సరఫరా చేసే సంస్థకు చెల్లిస్తే సరిపోతుందని అధికారులు అప్పట్లో చెప్పారు. కొంతకాలం పాటు సక్రమంగా నిర్వహించినా.. ఆ తర్వాత చేతులెత్తేశారు. దీంతో ఇవి ఎక్కడికక్కడ మూలనపడ్డాయి. వీటి స్థానంలో తిరిగి చిన్న బల్బులు కొనుగోలు చేశారు. గతంలో వాడిన ఎల్‌ఈడీ దీపాలకు చేసిన ఖర్చును ప్రస్తుతం జిల్లాలోని పంచాయతీల నుంచి వైకాపా ప్రభుత్వం తీసుకుంది.

ఐదేళ్లుగా ఒక్క రూపాయి ఇచ్చింది లేదు..

ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి అధికార పీఠం ఎక్కిన తరువాత గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. రెండేళ్లుగా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 14, 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా సర్పంచులు, అధికారులకు కూడా తెలియకుండా దారి మల్లించింది. దీంతో గ్రామాల్లో ఎక్కడా కనీస అభివృద్ధి   అనేది లేకుండాపోయింది. వీటిలో అధిక భాగం విద్యుత్తు ఛార్జీల రూపంలో తిరిగి రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానాకు జమ చేసుకుంది. మిగిలిన వాటిలో కూడా ఎల్‌ఈడీ దీపాల నిర్వహణ పేరుతో మరికొంత తీసేసుకుంది. దీంతో గ్రామాల్లో కనీస వసతులు కల్పించలేకపోతున్నామని సర్పంచులు వాపోతున్నారు.

నిర్వహణపై నిలువెల్లా నిర్లక్ష్యమే..

గ్రామ పంచాయతీలపై వీధి దీపాల నిర్వహణ, విద్యుత్తు బిల్లుల భారం తగ్గించాలనే ఉద్దేశంతో గత తెదేపా ప్రభుత్వం 2019లో రాష్ట్రవ్యాప్తంగా వీధి దీపాలుగా ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ చాలా చౌకగా ఉండటం, విద్యుత్తు వినియోగం కూడా పెద్దగా ఉండకపోవడంతో వీటిని వినియోగిస్తే ప్రజాధనం ఆదా అవుతుందని వీటిని ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతను ఈసీఎల్‌ కార్పొరేషన్, నెడ్‌క్యాప్‌ సంస్థలకు అప్పగించారు. 2019 తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వీరికి నిర్వహణ నిధులు సక్రమంగా ఇవ్వకపోవడంతో వీరు 2020లో ఇక తమ వల్ల కాదని చేతులెత్తేశారు. ఇప్పటి వరకు వైకాపా గ్రామాల్లో ఒక్క ఎల్‌ఈడీ బల్బుకు కూడా మరమ్మతులు నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతో అనేక గ్రామాల్లో చీకట్లు అలముకున్నాయి. ప్రజల బాధలు చూడలేని కొందరు సర్పంచులు సాధారణ నిధులు నుంచి ఎల్‌ఈడీ బల్బుల స్థానంలో మళ్లీ స్తంభాలకు సాధారణ విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేశారు.

పాలక వర్గాల ఏర్పాటు ఇలా..

అప్పటి వరకు ఉన్న పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం 2018 జులైతో ముగిసింది. దాంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. 2019 మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వచ్చింది. కానీ పంచాయతీలకు మాత్రం ఎన్నికలు నిర్వహించలేదు. 2021 ఫిబ్రవరి వరకు రెండేళ్ల పాటు గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగింది. 2021 ఏప్రిల్‌లో పంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామాల అభివృద్ధికి పంచాయతీ ఖాతాలకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయనేలేదు.

 జిల్లాలో ఇలా..

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వ్యాప్తంగా గతంలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ దీపాల నిర్వహణను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేయడంతో ప్రస్తుతం 80 శాతానికిపైగా వెలగడం లేదు. కనీస మరమ్మతులు కూడా చేయించే పరిస్థితి లేదు. వెలగని దీపాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేవారు కూడా కరవయ్యారు. ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకోవడంతో సర్పంచులుసైతం వీధి దీపాలు నిర్వహించలేని స్థితికి చేరుకున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఎల్‌ఈడీ దీపాలు వెలగని కొన్నిచోట్ల చిన్న బల్బులు ఏర్పాటు చేశారు. వీటి నుంచి సరిపడా వెలుతురు రాక గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు