logo

వస్తోంది.. ఆహార భద్రత రథం

మనం తింటున్న ఆహారంలో ఏది మంచిదో.. ఏది కల్తీదో తెలుసుకోగలిగితే.. ఆరోగ్యాన్నికాపాడుకున్నట్లే. ప్రజల్లో చైతన్యం, వ్యాపారులను అప్రమత్తం చేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది

Published : 21 May 2024 05:55 IST

కల్తీలను కనిపెట్టి..ప్రజలకు అవగాహన

సంచార వాహనాన్ని పరిశీలిస్తున్న ఏఎఫ్‌సీ శ్రీనివాస్‌ తదితరులు 
మనం తింటున్న ఆహారంలో ఏది మంచిదో.. ఏది కల్తీదో తెలుసుకోగలిగితే.. ఆరోగ్యాన్నికాపాడుకున్నట్లే. ప్రజల్లో చైతన్యం, వ్యాపారులను అప్రమత్తం చేసే చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ క్రమంలోనే ఆహార భద్రత ప్రమాణాల సంస్థ ద్వారా రాష్ట్రంలో తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడలో ఆయా వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సంచార వాహనం ఉమ్మడి జిల్లాలో  నగరాలు, పట్టణాలు, సంతలు తదితర ప్రాంతాల్లో షెడ్యూలు ప్రకారం తిరుగుతుంది.

-ఈనాడు, కాకినాడ 


ఇదీ సమస్య

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు.. హోటళ్లలో మనం తింటున్న ఆహారంలో నాణ్యత ఎంత అన్నది ప్రశ్నార్థకమే. కొందరు వాడిన నూనె మళ్లీమళ్లీ వాడేస్తున్నారు.. రోజుల తరబడి నిల్వ ఉంచిన మాంసాహారానికి మితిమీరిన రంగులు పూసి.. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.  

ఇదిగో పరిష్కారం

ఉమ్మడి జిల్లాలో ఒక్కరే ఫుడ్‌ సేఫ్టీ అధికారి ఉండడంతో సమర్థ పర్యవేక్షణ  సాధ్యపడటం లేదు. క్షేత్రస్థాయిలో ఆహార పదార్థాల నాణ్యత పరీక్షలు, ప్రజల్లో చైతన్యం నింపేందుకు భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ ‘ఈట్‌ రైట్‌ ఇండియా’లో భాగంగా ‘ఫుడ్‌ సేఫ్టీ ఆన్‌ వీల్స్‌’ పేరుతో సంచార వాహనాలు అందుబాటులోకి తెచ్చింది.
వాహనాన్ని నిర్దేశిత ప్రాంతంలో నిలిపి అక్కడ సరకులు, ఆహార పదార్థాలు కొన్న వినియోగదారుల నుంచి నమూనాలు ల్యాబ్‌లో ఉచితంగా పరీక్షించి ఫలితాలు వెల్లడిస్తారు. ఇదే క్రమంలో కల్తీలు, నాసిరకం ఆహార పదార్థాలతో అనర్థాలు వివరిస్తూ.. వినియోగదారులను చైతన్య పరుస్తారు. అవకతవకలు గుర్తించిన అంశాలపై వ్యాపారులను అప్రమత్తం చేస్తారు.

ఏం పరీక్షిస్తారంటే..

  • టీపీసీ మీటర్‌ ద్వారా నాసిరకం నూనెలను గుర్తిస్తారు. నూనె ఎక్కువసార్లు మరిగిస్తే.. అందులో టోటల్‌ పోలార్‌ కాంపౌండ్స్‌(టీపీసీ) తీవ్రత 25 శాతానికి మించితే విషతుల్యం అవుతుంది. సంచార ల్యాబ్‌ ద్వారా నాసిరకం నూనెల వాడకాన్ని నియంత్రించే దిశగా అవగాహన కల్పిస్తారు.  రిఫ్రాక్టో మీటర్‌ ద్వారా సోయా, చిల్లీ, టమాటా సాస్‌ నాణ్యత ప్రమాణాల పరీక్షలకు వీలుంటుంది. 
  • మిల్కో టెస్టర్‌ యంత్రం ద్వారా పాలలో కొవ్వు శాతం, ప్రొటీన్లు, ఇతర నాణ్యత పరీక్షించి అప్రమత్తం చేస్తారు. ్ల్వ) ఆహార పదార్థాల్లో మితిమీరిన రంగుల వాడకాన్నీ గుర్తించి ప్రజలను, వ్యాపారులను అప్రమత్తం చేస్తారు.  

అప్రమత్తం చేసేలా సేవలు

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక ఈ వాహన సేవలు అందుబాటులోకి వస్తాయి. ఎనలిస్ట్, ల్యాబ్‌ అసిస్టెంట్, డ్రైవర్‌ను కేటాయించాల్సి ఉంది. ఆహార పదార్థాల కొనుగోలులో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పిస్తాం.
-బి.శ్రీనివాస్, సహాయ నియంత్రికులు, ఆహార భద్రత ప్రమాణాల శాఖ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు