logo

రెండవ ప్లాట్‌ఫామ్‌ మూసివేత

రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్‌లోని రెండవ నంబరు ప్లాట్‌ఫామ్‌ వద్ద రైలు పట్టాల(ట్రాక్‌) ఆధునికీకరణ పనులు మొదలయ్యాయి.

Published : 21 May 2024 06:04 IST

ప్రధాన రైల్వేస్టేషన్‌లో మొదలైన ట్రాక్‌ ఆధునికీకరణ పనులు

పొక్లెయిన్లతో పాతట్రాక్‌ స్లిప్పర్స్‌ తొలగింపు    

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్‌లోని రెండవ నంబరు ప్లాట్‌ఫామ్‌ వద్ద రైలు పట్టాల(ట్రాక్‌) ఆధునికీకరణ పనులు మొదలయ్యాయి. దీనికోసం వచ్చేనెల 10వ తేదీ వరకు రెండవ ప్లాట్‌ఫామ్‌ను పూర్తిగా మూసివేసేందుకు అనుమతి రావడంతో ఎట్టకేలకు పాతట్రాక్‌ తొలగింపు పనులు ప్రారంభించారు. ఈ ప్లాట్‌ఫామ్‌ పైకి వచ్చే రైళ్లను ప్రస్తుతం 1, 3, 4 ప్లాట్‌ఫామ్‌లపైకి మళ్లిస్తున్నారు. పనులు పూర్తయ్యేవరకు రెండవ ప్లాట్‌ఫామ్‌పైకి ప్రయాణికులు ఎవరూ రాకుండా ఇరువైపులా పరదాలు కట్టారు. 
ఏళ్లకిందట ఏర్పాటు చేసిన ఇక్కడ ట్రాక్‌తో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. స్లిప్పర్స్‌(సిమెంట్ దిమ్మలు) దిగబడి పట్టాలు కదిలిపోతుండటంతో తాత్కాలిక మరమ్మతులు చేస్తూ వస్తున్నారు. సమస్య శాశ్వత పరిష్కారానికి ప్లాట్‌ఫామ్‌ పొడవుపా పాతట్రాక్‌ పూర్తిగా తొలగించి కొత్తది ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టినప్పటికీ పలు కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతూ వచ్చింది. ఇటీవల ఇక్కడ గూడ్స్‌రైలు పట్టాలు తప్పడంతో స్పందించిన రైల్వే ఉన్నతాధికారులు తక్షణం ట్రాక్‌ ఆధునికీకరణకు చర్యలు చేపట్టారు. 

మిగతా ప్లాట్‌ఫారాలకు హాల్ట్‌

ఈ రైల్వేస్టేషన్‌ మీదుగా ప్రతిరోజూ 160 రైళ్ల వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో 90 వరకు ఎక్స్‌ప్రెస్‌లు ఉండగా మిగతావి గూడ్స్‌ రైళ్లు. విశాఖవైపు నుంచి వచ్చే ఎక్స్‌ప్రెస్‌లు 45 వరకు ఉండగా వీటిలో ఎక్కువగా ఒకటో నంబరు ప్లాట్‌ఫామ్‌పై హాల్ట్‌ ఇస్తున్నారు. రెండో నంబరు ప్లాట్‌ఫామ్‌పై మాత్రం ట్రాక్‌ సమస్య ఉన్నందున 12, 13 రైళ్లను మాత్రమే ఆపుతున్నారు. ఇక విజయవాడ, కాకినాడ వైపు నుంచి వచ్చే మరో 45 ఎక్స్‌ప్రెస్‌లు మూడు, నాలుగు ప్లాట్‌ఫామ్‌లపై ఆగుతాయి. ట్రాఫిక్‌ను బట్టి అన్ని ప్లాట్‌ఫామ్‌లపై నుంచి గూడ్సు రైళ్లను పంపుతుంటారు. ప్రస్తుతం రెండవ ప్లాట్‌ఫామ్‌ మూసివేయడంతో దానిపై ఆగాల్సిన రైళ్లను మిగతా ప్లాట్‌ఫామ్‌లపైకి మళ్లిస్తున్నట్లు ఇక్కడి రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇక్కడి ట్రాక్‌ ఆధునికీకరణ పనులు పూర్తయ్యేవరకు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని