logo

అన్నవరం రైల్వే స్టేషన్‌ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు

అన్నవరం రైల్వే స్టేషన్‌లో లిఫ్ట్‌లో సోమవారం సాంకేతిక సమస్య తలెత్తి అందులో పలువురు ప్రయాణికులు ఇరుక్కుపోయారు.

Updated : 21 May 2024 07:54 IST

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం రైల్వే స్టేషన్‌లో లిఫ్ట్‌లో సోమవారం సాంకేతిక సమస్య తలెత్తి అందులో పలువురు ప్రయాణికులు ఇరుక్కుపోయారు. విజయవాడకు చెందిన సుమారు ఏడుగురు భక్తులు సత్యదేవుని దర్శనానికి వచ్చారు. వీరంతా మధ్యాహ్నం 12 గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. రైలు ఎక్కేందుకు మూడో నంబరు ప్లాట్‌ఫాం నుంచి లిఫ్ట్‌లో పై వంతెనకు వెళ్తున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయాణికులు కేకలు వేశారు. లిఫ్ట్‌ ఎంతకీ తెరుచుకోక పోవడంతో ఆందోళన చెందారు. దీంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. జీఆర్పీ, రైల్వే విద్యుత్తు విభాగ అధికారులు లిఫ్ట్‌ పై భాగంలో ఉన్న రంధ్రం తెరచి, నిచ్చెన వేసి ప్రయాణికులను బయటకు తీశారు. సుమారు గంటన్నర పాటు ప్రయాణికులు లిఫ్ట్‌లో ఉన్నట్లు సమాచారం. విషయాన్ని రైల్వే స్టేషన్‌ సూపరింటెండెంట్‌ వద్ద ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా.. కొద్దిసేపు మాత్రమే లిఫ్ట్‌ నిలిచిపోయిందని, ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చామన్నారు. నిర్వహణ సరిగాలేక, తరచూ విద్యుత్తు అంతరాయం, ఇతర సాంకేతిక సమస్యలతో లిఫ్ట్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నా పూర్తిస్థాయిలో అధికారులు దృష్టి సారించకపోవడంపై పలువురు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని