logo

మేల్కోకుంటే.. ముప్పే!

జిల్లాలో రక్తం, ప్లేట్‌లెట్‌ నిల్వలు తరిగిపోతున్నాయి. రాజమహేంద్రవరం జీజీహెచ్‌ మినహా మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు రక్తనిధి కేంద్రాల్లో కొరత తీవ్రంగా ఉంది.

Published : 21 May 2024 06:12 IST

జిల్లాలో అరకొరగా రక్త, ప్లేట్‌లెట్ల నిల్వలు

జీజీహెచ్‌లో రక్తం నిల్వచేసే యంత్రాలు 

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం: జిల్లాలో రక్తం, ప్లేట్‌లెట్‌ నిల్వలు తరిగిపోతున్నాయి. రాజమహేంద్రవరం జీజీహెచ్‌ మినహా మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు రక్తనిధి కేంద్రాల్లో కొరత తీవ్రంగా ఉంది. రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులు, శస్త్రచికిత్సలు, ప్రసవాలు సమయంలో రోగులకు కచ్చితంగా రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో క్యాన్సర్‌ రోగులు పెరిగిన నేపథ్యంలో రేడియేషన్‌ సమయంలో వారికి ప్లేట్‌లెట్లు, రక్తం ఎక్కించాల్సి పరిస్థితులు ఎక్కువగా ఉంటున్నాయి. దానికితోడు వర్షాల నేపథ్యంలో విషజ్వరాల వ్యాప్తి పెరిగితే ప్రస్తుత నిల్వలు ఏమాత్రం సరిపోవు. గతంలో డెంగీ, మలేరియా వ్యాపించి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం ఇప్పటివరకు ఈ ఏడాది నిల్వలు సరిగాలేవు. దాతలు సైతం ముందుకు రాకపోవడం, శిబిరాల నిర్వహణ అంతగా లేకపోవడంతో కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. గతేడాది పరిస్థితులు పునరావృతం కాకుండా స్వచ్ఛంద సంú్థ£లు, అధికారులు దాతలను ప్రోత్సహించి రక్తనిల్వలు పెంచేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోకుంటే ముప్పు తప్పదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ ప్రస్తుత పరిస్థితి..

రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో రక్తనిల్వ కేంద్రం ఉంది. ఇందులో 1,200 యూనిట్ల రక్తాన్ని నిల్వచేసే సామô్థ¢్యం ఉంటుంది. సర్వజన ఆసుపత్రిగా మారిన తరువాత నెలకు 500 నుంచి 600 యూనిట్ల వరకు రక్తం రోగులకు ఎక్కిస్తున్నారు. విషజ్వరాల వ్యాప్తి పెరిగితే రెట్టింపు వినియోగం ఉండే అవకాశం ఉంది. కొవ్వూరు, నిడదవోలు, గోకవరం, అనపర్తి, కడియం ఆసుపత్రుల్లో నిల్వ కేంద్రాలున్నాయి. వీటిలో రక్త సేకరణ చేసి రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు పంపుతారు. అనంతరం దానికి పరీక్షల తరువాత ఆయా కేంద్రాల అవసరాలకు అనుగుణంగా అందజేస్తున్నారు. ప్రస్తుతానికి 96 యూనిట్ల రక్తం, 19 యూనిట్ల ప్లేట్‌లెట్లు అందుబాటులో ఉన్నాయి. రోగాల వ్యాప్తి మొదలైతే ఇది ఎంతమాత్రం సరిపోయే పరిస్థితి ఉండదు.

ప్రైవేటులోనూ కొరతే.. 

రాజమహేంద్రవరం నగరంలో సుమారు ఎనిమిది ప్రైవేటు రక్తనిల్వ కేంద్రాలున్నాయి. ప్రస్తుతం ప్లేట్‌లెట్ల వినియోగం లేకపోయినా రక్తం కొరత తీవ్రంగా ఉంది. వేసవి నేపథ్యంలో రక్తం ఇవ్వడానికి ముందుకు రాకపోవడం, కళాశాలలకు సెలవులు, ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా శిబిరాల నిర్వహణ లేదు. దీంతో కొరత వేధిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగులకు ఆయా నిల్వ కేంద్రాల్లోని రక్తం ఏదోలా సర్దుబాటు చేస్తున్నా ప్రైవేటులో మాత్రం ఆందోళన తప్పడం లేదు.

పెంచుకోకపోతే ఇబ్బందే..

గతేడాది డెంగీ విజృంభించి ప్లేట్‌లెట్ల కోసం రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతానికి ప్లేట్‌లెట్లు కొరత పూర్తిస్థాయిలో లేకున్నా రక్తం కొరత ఉంది. గతేడాది అవసరాన్ని బట్టి ఒక్కో ప్యాకెట్‌ ప్లేట్‌లెట్లు రూ.10 వేలు కూడా వెచ్చించి కొనుగోలు చేసుకున్న పరిస్థితులున్నాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో పెరిగిన ఉష్ణోగ్రతలతో పాటు ఎన్నికల కారణంగా  దాతలు ముందుకు రాలేదు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రక్తనిల్వ కేంద్రాల్లో నిల్వలు బాగా తక్కువగా ఉన్నాయి. జీజీహెచ్‌లో ఫర్వాలేదనిపించినా.. ఈ నెల చివరి నాటికి తగ్గిపోయే అవకాశముంది. మిగతాచోట్ల పూర్తిగా అయిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని