logo

లాకులు.. లీకులు

పంట చేలకు సాగు నీరు అందించడంలో కాలువలు ఎంత ప్రధానమో.. ఆ కాలువల ద్వారా వచ్చే నీరు.. భూములకు సక్రమంగా చేరడానికి.. సాగునీటి నిర్వహణకు లాకుల వ్యవస్థ అంతే కీలకం.

Updated : 21 May 2024 06:37 IST

పత్తాలేని పంట కాలువల నిర్వహణ


పెచ్చులూడి ప్రమాదకరంగా లొల్ల లాకులు

పంట చేలకు సాగు నీరు అందించడంలో కాలువలు ఎంత ప్రధానమో.. ఆ కాలువల ద్వారా వచ్చే నీరు.. భూములకు సక్రమంగా చేరడానికి.. సాగునీటి నిర్వహణకు లాకుల వ్యవస్థ అంతే కీలకం.  నిర్వహణను అయిదేళ్లుగా గాలికి వదిలేశారు. ఉమ్మడి జిల్లాలో గోదావరి డెల్టా పరిధిలో కాలువల నిర్వహణ అధ్వానంగా ఉంది. రబీ సాగు ముగిసిన తరువాత కాలువలు, లాకులు, షట్టర్లు, ఇతర నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, ముమ్మిడివరం, మామిడికుదురు, ఆత్రేయపురం, పి.గన్నవరం: సాధారణంగా ఏటా క్లోజర్‌ సమయంలో లాకులు, షట్టర్ల తలుపులకు ఆయిల్‌పూసి తుప్పు పట్టకుండా రంగులు వేస్తారు. తలుపులు సులభంగా నిర్వహించేందుకు వీలుగా అక్కడి పరికరాలకు గ్రీజు పూస్తారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత అయిదేళ్లుగా ఈ పనులు చేపట్టిన దాఖలాలు లేవు. గతానికి భిన్నంగా ఎన్నడూ లేనివిధంగా అధికారులు మే 10 వరకు కాలువలకు నీటి విడుదల చేశారు. జూన్‌ 1న ఖరీఫ్‌కు నీటి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. 20 రోజుల్లో కనీస పనులు చేసే అవకాశం లేదు.  

ముమ్మిడివరం: అన్నంపల్లి వద్ద తలుపులు ఛిద్రమై.. 

అమలాపురం - బొబ్బర్లంక ప్రధాన పంట కాలువకు సామర్థ్యానికి మించి వచ్చే నీరు(సర్‌ప్లస్‌ వాటర్‌) గోదావరిలోకి మళ్లేందుకు ముమ్మిడివరం మండలం అయినాపురం వద్ద వియర్‌ నిర్మించారు. నీటి సామర్థ్యం పెరిగినపుడు షట్టర్ల ద్వారా గోదావరిలోకి జలాలు విడుదల చేయాలి. సర్‌ప్లస్‌ వాటర్‌ షట్టర్లు నుంచి నీరు లీకవడం.. మురుగు కాలువలోకి ఓవర్‌ ఫ్లోతో వర్షాకాలంలో సుమారు 800 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. 

రూ.57 కోట్లతో ప్రతిపాదనలున్నా... 

గోదావరి మధ్యడెల్టా పరిధిలో సుమారు 2 లక్షల ఆయకట్టు ఉండగా ఆత్రేయపురం మండలం లొల్ల వద్ద ఉన్న హెడ్‌ లాకుల వ్యవస్థ కీలకమైంది.  ఇక్కడి నిర్మాణాలు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నా కనీస నిర్వహణ చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. మూడు హెడ్‌ లాకుల ఆధునికీకరణకు మూడేళ్ల క్రితం రూ.54 కోట్లతో అంచనాలు సిద్ధం చేయగా.. ఆ మొత్తం నేడు రూ.57.78 కోట్లకు పెరిగింది. ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతున్నా మోక్షం లేదు. 

సోమిదేవరపాలెం వద్ద తలుపులకు తుప్పు

లొల్ల హెడ్‌ లాకుల నుంచి కాట్రేనికోన మండలం పల్లంకుర్రులో ఉన్న మైనర్‌ లాకుల వరకు నిర్వహణ లేక లీకులు ఏర్పడుతున్నాయి. బొబ్బర్లంక పల్లంకుర్రు ప్రధాన పంట కాలువ పరిధిలో అయినవిల్లిలంక, ముక్తేశ్వరం, అన్నంపల్లి, కుండలేశ్వరం, పల్లంకుర్రు ప్రాంతాల్లో లాకులున్నాయి. ముమ్మిడివరం మండలం మాగాం-అయినాపురం పంట కాలువకు సోమిదేవరపాలెం వద్ద ఉన్న లాకుల తలుపులు పూర్తిగా పాడైపోయాయి. అంబాజీపేట మండలం ముక్కామల లాకులు నిర్వహణలేక శిథిల స్థితికి చేరాయి.   

శిథిలావస్థలో బ్యాంక్‌ కెనాల్‌

లొల్ల వద్దనున్న బ్యాంక్‌ కెనాల్‌ లాకుల నుంచి ముక్తేశ్వరం కెనాల్‌ ద్వారా సుమారు 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ లాకులు పూర్తి శిథిలావస్థకు చేరాయి. షట్టర్లు, రాడ్‌లకు ఆయిల్, గ్రీజ్‌  పూయకపోవడం వల్ల తుప్పు పట్టాయి. 
్ర పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గం పరిధిలోని మొండెపు లంక, మండలంలోని పొదలాడ, శివకోడు, సఖినేటిపల్లి లాకులు అధ్వానంగా ఉన్నాయి. నావిగేషన్‌ కెనాళ్ల వద్ద కనీస నిర్వహణ లేక వాటి తలుపులకు భారీ రంధ్రాలు ఏర్పడి ప్రమాదకరంగా ఉన్నాయి. షట్టర్లు, స్క్రూగేజీ తదితర సామగ్రి తుప్పుపట్టాయి.

కూలుతున్నా కళ్లుతెరవరేం?

మామిడికుదురు మండలంలో అయిదున్నర దశాబ్దాలనాటి అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌లు శిథిలమైనా అధికారుల్లో కనీస చలనం లేదు.  గత నవంబరు 10న వాడబోది స్లూయిస్‌పై లోడు ట్రాక్టర్‌ వెళ్తుండగా స్లాబు కొంతమేర కూలింది. వీటి పరిధిలో సుమారు 1300 ఎకరాల ఆయకట్టు ఉండగా, ఏటా ముంపు సమస్య తప్పడం లేదు. వీటి పునర్నిర్మాణానికి రూ.4.28 కోట్లు, బచ్చలబందకు రూ.2.45 కోట్లు, కడలి స్లూయిస్‌కు రూ.4.25 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపినా అవి దస్త్రాలకే పరిమితమయ్యాయి.  

కడియం వద్ద ఇదీ పరిస్థితి..

తూర్పు డెల్టా ప్రధాన కాలువ వేమగిరి, ధవళేశ్వరం, కడియం, రాజవోలు మీదుగా 12.02 కి.మీ ప్రవహిస్తోంది. ఈ పంట కాలువలోకి పంచాయతీ కాలువల ద్వారా వ్యర్థ జలాలు, గృహ, వాణిజ్య సముదాయాల వ్యర్థాలు కలుస్తుండడం సమస్యగా మారింది. కడియం వద్ద ఉన్న లాకులు తలుపులు శిథిలమయ్యాయి. మరమ్మతులకు ప్రతిపాదనలు పంపినా ఫలితం శూన్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని