logo

సరదా శ్రుతిమించితే... మృత్యు ఒడికి..!

పాఠశాలలు, కళాశాలకు వేసవి సెలవులు ఇచ్చారంటే పిల్లలు, యువత ఇంటి వద్ద ఉండకుండా ఆడుకునేందుకు బయటకు వెళ్లిపోతుంటారు.

Updated : 22 May 2024 07:32 IST

గోదావరిలో అగాథాలతో పెను ప్రమాదాలు
పిల్లల కదలికలపై తల్లిదండ్రులు ఓ కన్ను వేయాల్సిందే..
న్యూస్‌టుడే, రావులపాలెం పట్టణం

రావులపాలెంలో యువకుల మృతదేహాల వద్ద విచారంలో స్నేహితులు, గ్రామస్థులు (పాత చిత్రం)

పాఠశాలలు, కళాశాలకు వేసవి సెలవులు ఇచ్చారంటే పిల్లలు, యువత ఇంటి వద్ద ఉండకుండా ఆడుకునేందుకు బయటకు వెళ్లిపోతుంటారు. వేసవి తాపం కారణంగా సేదదీరేందుకు గోదావరి, కాలువలు, చెరువుల్లో స్నానాలు చేసి, ఈత కొట్టేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. స్నేహితులంతా కలిసి సరదాగా గడుపుదామనుకుంటూ ప్రమాదాల బారిన పడుతుంటారు. గోదావరిలో ఊబులు, అగాథాలు ఎక్కడ ఎలా ఉంటాయో తెలియక, నీటి ప్రవాహ వేగం గమనించక, ఇలా పలు కారణాలతో ప్రయాదాలను అంచనా వేయలేక గల్లంతవుతున్నారు. ఏటా వేసవిలో గోదావరిలో స్నానానికి దిగి పదుల సంఖ్యలో యువకులు, పిల్లలు మృత్యువాత పడుతున్నారు. ఇంటి నుంచి పిల్లలు ఎక్కడి వెళుతున్నారో తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం, గోదావరి వద్దకు వెళ్లిన సమయంలో పెద్దల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు.

ప్రమాదాలకు కారణాలు...

ఇంట్లో చెప్పకుండా యువకులు, పిల్లలు గోదావరి సాన్నానికి వస్తున్నారు. కాలువలకు నీటి విడుదల నిలుపుదల చేయడంతో గోదావరికి నీటి ప్రవాహం పెరుగుతుంది. ప్రవాహ వేగం అధికంగా ఉండటంతో పిల్లలకు అవగాహన లేక లోపలికి వెళ్లి, కాళ్లు అందక నీటిలో గల్లంతవుతున్నారు. గోదావరిలో ఎక్కువగా ఊబులు ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయో ఎవరికీ తెలియదు. స్నానానికి దిగే ప్రాంతంలో కింద ఇసుక కనిపిస్తుందని దిగుతారు.. నీటి ప్రవాహానికి ముందుకు వెళ్లి ఊబిలో చిక్కుకుపోతుంటారు. ఈత రాక నీరు తాగి, ఊపిరాడక చిన్నారులు మునిగిపోతున్నారు. ఈత వచ్చిన వారైనా ఊబిలో దిగబడి మృత్యువాత పడుతున్నారు. గోదావరిపై సరైన అవగాహన లేక పెద్దలు సైతం మృతి చెందుతున్నారు.

నెల రోజుల్లో 13 మంది దుర్మరణం

  • మే 2న సామర్లకోటకు చెందిన వర్థనపు రాజ్‌కుమార్, మాసా అభిలాష్‌లు రంపచోడవరం మండలం సీతపల్లి వద్ద వాగులో పడి మృతి చెందారు.
  • 3న కపిలేశ్వరపురం మండలం నారాయణలంక గోదావరిలో సాన్నానికి దిగి వానపల్లికి చెందిన కంఠంశెట్టి ప్రసన్నకుమార్, యనమల సతీష్‌ చనిపోయారు.
  • 4న చిన్న కోరుమిల్లికి చెందిన లోకేష్‌ గోదావరిలో పడి మృతి
  • 11న మెర్లపాలెం వద్ద గోదావరిలో నడిచి వెళ్తూ ఊబిలో పడి మడికి శివారు చిలకలపాడు చెందిన అనంతలక్ష్మి, ఏసమ్మ, సునీత మృతి
  • 15న బొబ్బర్లంక బ్యారేజీ వద్ద తాడేపల్లిగూడెం మోదుగుంటకు  చెందిన ఆరేపల్లి శ్రీరామ్‌ గోదావరిలో పడి మరణం
  • 18న రావులపాలెం గోదావరిలో సాన్నానికి వెళ్లి ఈశ్వరరెడ్డి, జయకుమార్, సంపత్‌రెడ్డి దుర్మరణం
  • 19న పిచ్చుకలంక వద్ద గోదావరి సాన్నానికి వచ్చి రాజమహేంద్రవరానికి చెందిన దడాల దినేష్‌ మృతి

జాగ్రత్తలు పాటించాలి...

బయటకు వెళ్లే పిల్లలకు తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్పాలి. గోదావరి ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించాలి. జరుగుతున్న ప్రమాదాలను వారికి వివరించాలి. స్నేహితులతో బృందంగా వెళ్లిన సమయంలో వారంతా జాగ్రత్తలు పాటించాలి. వెంట ఈత వచ్చిన వారు కచ్చితంగా ఉండాలి. సొంతంగా ఈత నేర్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. వంతెన పైనుంచి దూకడం వంటివి చేయరాదు. నీటిలో మునిగిన వ్యక్తిని ఒడ్డుకు చేర్చి, నోటిని శుభ్రం చేసి ఊపిరితిత్తుల నుంచి శ్వాస రాకుంటే ఛాతీపై చేతులతో గట్టిగా ఒత్తి నీరు బయటకి వచ్చేలా చేయాలి.
గోదావరి సాన్నాలకు వెళ్లినవారు లోతుకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని