logo

కాకినాడలో కుండపోత

జిల్లా కేంద్రం కాకినాడలో శుక్రవారం సాయంత్రం రెండు గంటలపాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. పిడుగులతో ఈ నగరం దద్దరిల్లింది.

Published : 25 May 2024 03:02 IST

భారీ ఎత్తున ముంచెత్తిన ప్రవాహం

ఆర్టీసీ బస్టాండులోకి వచ్చేందుకు విద్యార్థినుల అవస్థలు.. 
సాంబమూర్తినగర్‌(కాకినాడ), న్యూస్‌టుడే: జిల్లా కేంద్రం కాకినాడలో శుక్రవారం సాయంత్రం రెండు గంటలపాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. పిడుగులతో ఈ నగరం దద్దరిల్లింది. ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా అవకాశం లేకపోయింది. సురేష్‌నగర్, గొడారిగుంట ప్రాంతాల్లో పిడుగులు పడి ఏసీలు, ఫ్రిజ్‌లు, టీవీలు తదితర ఎలక్ట్రానిక్‌ పరికరాలు పాడయినట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లన్నీ చెరువులను తలపించడంతో వాహనదారులు వెళ్లలేకపోయారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు మొరాయించాయి. గొడారిగుంట, రామకృష్ణారావునగర్, లక్ష్మీనారాయణనగర్, ఇందిరాకాలనీ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. కాలువల వ్యవస్థ సరిగా లేకపోవడం, పూడికలు తొలగించకపోవడం ప్రభావం చూపింది. ఏ కాలువ ఎవరిని మింగేస్తుందో తెలియక ఆందోళన నెలకొంది. మెయిన్‌రోడ్డు, వైఎస్‌ఆర్‌ కూడలి, కల్పన సెంటర్, శాంతినగర్, వెంకట్‌నగర్, భాస్కర్‌నగర్, పోస్టల్‌కాలనీ, కొత్త కాకినాడ, రామకృష్ణారావుపేట, కొత్తపేట మార్కెట్‌ తదితర ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు. 

కాకినాడ ఆర్టీసీ బస్టాండు ప్రాంగణాన్ని ప్రవాహం ముంచెత్తడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఆవరణలో మోకాలి లోతు వర్షం నీరు నిలిచిపోయింది. డిపో గ్యారేజీ చెరువును తలపించింది. నగరంలో శుక్రవారం సుమారు 103 మి.మీ. వర్షపాతం నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని