logo

అన్నిటికీ వారే.. అందే భృతి అరకొరే..!

ఇంటింటికీ తిప్పారు. సర్వే చేయించారు. ఎన్నికల స్లిప్పులు పంపిణీ చేశాం. చివరికి సార్వత్రిక ఎన్నికల్లో ఉదయం నుంచి రాత్రి వరకు అహర్నిశలు శ్రమించాం.

Updated : 25 May 2024 06:02 IST

చెల్లింపులెన్నడోనని బీఎల్వోల ఎదురుచూపులు

ఇంటింటికీ తిప్పారు. సర్వే చేయించారు. ఎన్నికల స్లిప్పులు పంపిణీ చేశాం. చివరికి సార్వత్రిక ఎన్నికల్లో ఉదయం నుంచి రాత్రి వరకు అహర్నిశలు శ్రమించాం. కానీ మాకు ఇవ్వాల్సిన గౌరవ భృతి మాత్రం పూర్తి స్థాయిలో విడుదల చేయడం లేదు.
అమలాపురం నియోజకవర్గంలోని ఓ బూత్‌ స్థాయి అధికారి(బీఎల్వో) ఆవేదన ఇది.

న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం: జిల్లాలో ఎన్నికల విధుల నిర్వహణలో నిరంతరం సేవలందించిన బీఎల్వోలకు గౌరవ భృతికోసం ఎదురుచూపులు తప్పడం లేదు. వీఆర్వోలతోపాటు సచివాలయ సిబ్బంది బీఎల్వోలుగా గతం నుంచి విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ గౌరవ భృతి అరకొరగా అందడంపై ఆవేదన చెందుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిస్తున్న తరుణంలోనైనా తమపై కరుణ చూపాలని వారు వేడుకొంటున్నారు.
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఇలా.. జిల్లాలో అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట, రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాలున్నాయి. వీటి పరిధిలో 1,499 మంది బీఎల్వోలుగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో అంగన్‌వాడీ, ఆశా, పురపాలిక ఉద్యోగులకు బీఎల్వో విధులు అప్పగించారు. వీఆర్వోలతోపాటు సచివాలయ వ్యవస్థ రావడంతో ఎంపిక చేసిన సచివాలయ సిబ్బందికి ఈ సారి ఆ బాధ్యతలు అప్పగించారు. 

విధులెన్నో.. 

బీఎల్వోలతో ఇంటింటా ఓటరు సర్వే చేయించారు. ఆ తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితా, సవరణ, ప్రత్యేక శిబిరాలు, అవగాహన సదస్సుల నిర్వహణ, పోలింగ్‌ కేంద్రాల్లో వసతుల కల్పన, గుర్తింపు పత్రాల పంపిణీ కార్యక్రమాలు చేయించారు. గ్రామాంతరం వెళ్లిన ఓటర్ల గుర్తింపు, మృతులు, కొత్త ఓటర్ల చిరునామాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించారు. ఇదంతా ఒక ఎత్తైతే.. పోలింగ్‌ ప్రక్రియలో వీరే కీలకపాత్ర పోషించారు. ఇన్ని విధులు చేపట్టినా గౌరవ భృతి అందకపోవడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. 

తమకొచ్చేది అరకొరైనా.. సొంతంగా ఖర్చు..! 

తమకు ఒక్కొక్కరికీ గౌరవ భృతిగా నెలకు రూ.500 చొప్పున ఏడాదికి రూ.6000 చెల్లించాలనే నిబంధన ఉన్నట్లు బీఎల్వోలు చెబుతున్నారు. అధికారుల నుంచి మాత్రం ఈ విషయంలో స్పష్టత కనిపించడం లేదు. ఏడాదిన్నరగా భృతి అందడం లేదనే  వాదన వినిపిస్తుంటే.. ఇటీవల మూడు నెలలకు సంబంధించి రూ.1500 విడుదలైనట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే ఎన్నికల విధులు నిర్వహించే బీఎల్వోలకు ఖర్చు అధికంగానే అవుతుందని చెబుతున్నారు. ప్రధానంగా ఓటర్ల జాబితాల విషయంలో అనేక ఇబ్బందులు పడ్డామని ఆవేదనతో చెబుతున్నారు. అంతేకాదు పోలింగ్‌ రోజున చేతినుంచి కొంతమొత్తం ఖర్చుచేయాల్సివచ్చిందని పలువురు వాపోతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని