logo

పారిశ్రామిక ఉల్లంఘనులు

రాజకీయం వేలు పెడితే తప్పు ఒప్పయిపోతుంది. కరెన్సీ చేతిలో పెడితే అనర్హులు అర్హులైపోతారు.. ఉమ్మడి జిల్లాలోని పరిశ్రమల శాఖలో అచ్చం ఇదే జరుగుతోంది.

Published : 25 May 2024 03:17 IST

ప్రోత్సాహకాల ముసుగులో రూ.కోట్లు పక్కదారి
ఉమ్మడి జిల్లా పరిశ్రమల శాఖలో అక్రమాల పర్వం

రాజకీయం వేలు పెడితే తప్పు ఒప్పయిపోతుంది. కరెన్సీ చేతిలో పెడితే అనర్హులు అర్హులైపోతారు.. ఉమ్మడి జిల్లాలోని పరిశ్రమల శాఖలో అచ్చం ఇదే జరుగుతోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి పారిశ్రామిక పెట్టుబడి రాయితీలు అందించాల్సి ఉండగా.. కాసులకు కక్కుర్తిపడి, రాజకీయానికి తలొగ్గి అనర్హులకు చోటిచ్చారు.

ఈనాడు, కాకినాడ - న్యూస్‌టుడే, సర్పవరం జంక్షన్‌:  రాయితీకి సంబంధించిన దస్త్రం కదలికకు రూ.2 లక్షలు తీసుకుంటూ కాకినాడ జిల్లా పరిశ్రమల శాఖ జీఎం మురళి అనిశాకు చిక్కారు. పూర్వ జిల్లా జీఎం హయాంలోనూ అక్రమాలు సాగాయని..వాటిని అడ్డుపెట్టుకుని ఈయనా లబ్ధి పొందారనే ఆరోపణలు ఉన్నాయి.

కాకినాడలోని జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయం 

రూ.కోట్లకు కాళ్లొచ్చాయ్‌..

ఉమ్మడి జిల్లాలో 70కిపైగా పరిశ్రమల విషయంలో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకుండా అడ్డదారి వ్యవహారం సాగినట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.9 కోట్ల వరకు పక్కదారి పట్టినట్లు సమాచారం. ఇందులో కాకినాడ జిల్లాలోనే 40 వరకు ఉల్లంఘనలు ఉన్నాయి.
కాకినాడ నగరం, గ్రామీణం, పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి, తుని, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, కిర్లంపూడి, తాళ్లరేవు, శంఖవరం, తొండంగి, రంగంపేట మండలాల్లో పలు యూనిట్లకు నిబంధనలకు విరుద్ధంగా ప్రోత్సాహకాలు మంజూరుచేశారు. గతంలో పనిచేసిన జిల్లా పరిశ్రమల శాఖ అధికారి లబ్ధిపొందారన్న ఆరోపణలున్నాయి.

 రాయితీల వర్తింపులోనూ అక్రమాలే

పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని..అర్హులకే లబ్ధి చేకూరుస్తున్నామని సర్కారు చెబుతుంటే.. ఉమ్మడి జిల్లా పరిశ్రమల శాఖలో పరిస్థితి అందుకు భిన్నం. సూక్ష్మ- చిన్న- మధ్య తరహా పరిశ్రమల యూనిట్ల మంజూరు, రాయితీల వర్తింపులోనూ అక్రమాలే. కమర్షియల్‌ వాహనాలకే రాయితీ వర్తించాల్సి ఉండగా తుంగలో తొక్కారు. పరిశ్రమలకు విద్యుత్తు ఇచ్చాకే ఉత్పత్తులకు అనుమతులివ్వాలి.అయితే డేట్‌ ఆఫ్‌ కమర్షియల్‌ ప్రొడక్షన్‌ సర్టిఫికేట్‌ (డీసీపీ) ఇచ్చే పరిస్థితీ ఇక్కడుంది.

చర్యల మాటేమిటి..

పారిశ్రామిక ప్రోత్సాహకాల కుంభకోణం బయటకు పొక్కడంతో లోపాయికారీ దిద్దుబాటు చర్యలకు తెగబడ్డారు. అనర్హులకు మళ్లిన నిధుల రికవరీకి ఆపసోపాలు పడుతున్నారు. పెట్టుబడి రాయితీ మంజూరు ఉత్తర్వులు రద్దు చేయడం, విడుదల చేసిన ప్రోత్సాహకాల రికవరీలో వీరున్నారు. అక్రమాల తంతు భారీగా జరిగినా చర్యలు లేవు. అర్హత ఉన్నా అవకాశాలు అందుకోలేనివారు ఎంతోమంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని