logo

కౌంటింగ్‌ కేంద్రాల్లో నియమావళి అతిక్రమిస్తే కేసులు

 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించినా, ఉల్లంఘనలకు పాల్పడినా అటువంటి వారిపై బైండోవర్‌ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత స్పష్టం చేశారు.

Published : 25 May 2024 03:22 IST

వివరాలు వెల్లడిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత 

రాజమహేంద్రవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే:  కౌంటింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించినా, ఉల్లంఘనలకు పాల్పడినా అటువంటి వారిపై బైండోవర్‌ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాధవీలత స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రతిఒక్కరికీ తెలియజేసేందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్‌లోని వీసీ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జూన్‌ 4న ఓట్ల లెక్కింపు కోసం ఎంపిక చేసే అధికారులు, సిబ్బందిని మూడు దశల్లో సాంకేతికపరమైన విధానంలో ర్యాండమైజేషన్‌ చేస్తామన్నారు. ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి నన్నయ విశ్వవిద్యాలయం  కౌంటింగ్‌ కేంద్రాల్లో 129 టేబుల్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. కౌంటింగ్‌ టేబుల్స్‌ సంఖ్య మేరకు ఏజెంట్లను అనుమతిస్తామన్నారు. కౌంటింగ్‌ ఏజెంట్ల సమాచారాన్ని ముందుగా అందజేయాల్సి ఉంటుందని, ఆ మేరకు వారికి గుర్తింపు కార్డులు జారీ చేస్తామన్నారు. నేరచరిత్ర కలిగిన, బైండోవర్‌ కేసులు నమోదై ఉన్న వ్యక్తులను ఏజెంట్‌గా నియమించకుండా అభ్యర్థులు, ఆయా రాజకీయ పార్టీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఏజెంట్ల కోసం  బస్సుల ఏర్పాటు

కౌంటింగ్‌ ఏజెంట్ల కోసం దివాన్‌చెరువు తదితర ప్రాంతాల్లో షటిల్‌ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఓట్ల లెక్కింపు జరిగే నన్నయ విశ్వవిద్యాలయం ఆవరణలోకి ఆ రోజు ఎటువంటి వాహనాలను అనుమతించమన్నారు. రౌండ్‌లవారీగా లెక్కింపు పూర్తయిన తర్వాత ఫలితాల వివరాల కాపీలను ఏజెంట్లకు అందజేస్తామన్నారు. వాటిని ఫారం 17సి తో నిర్ధారణ చేసుకోవాలన్నారు. కౌంటింగ్‌ నేపథ్యంలో బాణసంచా వినియోగించడంపై నిషేధం విధించామని, ఫలితాల వెల్లడి తర్వాత గెలుపొందిన అభ్యర్థులు, వారి మద్దతుదారుల ద్వారా బాణసంచా వినియోగించడం, విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడం చేయకూడదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి జూన్‌ 6 వరకు అమలులో ఉంటుందని తెలిపారు.

అరగంట ముందు  పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు

కౌంటింగ్‌ రోజున తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు అరగంట ముందు ప్రారంభిస్తామని, అనంతరం ఈవీఎంల్లో పోలైన ఓట్లు లెక్కింపు జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు కోసం ఒక్కొక్క టేబుల్‌ వద్ద ఒక సూపర్‌వైజర్, ఒక సహాయకుడు, ఒక మైక్రోఅబ్జర్వర్‌ను నియమిస్తామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపునకు ఒక సహాయ రిటర్నింగ్‌ అధికారి ఒక సూపర్‌వైజర్, ఒక సహాయకుడిని నియమిస్తామన్నారు. సర్వీసు ఓటర్లకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సిస్టమ్‌(ఈటీపీబీఎస్‌) ఓట్ల లెక్కింపునకు సహాయ రిటర్నింగ్‌ అధికారి, సూపర్‌వైజర్, సహాయకులను నియమిస్తామన్నారు. కౌంటింగ్‌ పూర్తయిన తర్వాత రౌండ్‌ల వారీగా ఆయా ఈవీఎం యూనిట్లను సురక్షితంగా తిరిగి స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరుస్తామని కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో జేసీ తేజ్‌  భరత్, ఏసీపీ అనిల్‌కుమార్, పార్లమెంట్‌ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్‌ అధికారి ఆర్‌.కృష్ణనాయక్, అభ్యర్థులు, ఏజెంట్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని