logo

ఏటిగట్టు హామీలు.. గాలిలోనేనా

ఏటి గట్లు ఉన్నాయి. గౌతమి ఎడమ 68 కి.మీ, కుడి 80, వశిష్ఠ ఎడమ, కుడి కలిపి 180, వైనతేయ కుడి, ఎడమ 56, అఖండ గోదావరి 80, వృద్ధ గౌతమి 40 కిలోమీటర్ల మేర గట్లు విస్తరించి ఉన్నాయి.

Updated : 25 May 2024 05:12 IST

మాటిచ్చి నిధులు మంజూరు చేయని ముఖ్యమంత్రి 
2022 వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో తాత్కాలిక చర్యలకే పరిమితం
ఇసుక మాఫియా వల్ల పలుచోట్ల ధ్వంసమైన ఏటిగట్లు

ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 537 కిలోమీటర్ల మేర ఏటి గట్లు ఉన్నాయి. గౌతమి ఎడమ 68 కి.మీ, కుడి 80, వశిష్ఠ ఎడమ, కుడి కలిపి 180, వైనతేయ కుడి, ఎడమ 56, అఖండ గోదావరి 80, వృద్ధ గౌతమి 40 కిలోమీటర్ల మేర గట్లు విస్తరించి ఉన్నాయి.

900 మీటర్లు  బలహీనమే..

కాట్రేనికోన మండలం బూలవారిమొండి వద్ద 900 మీటర్లు మేర బలహీనంగా ఉంది. కాటన్‌ ఆనకట్ట నుంచి 10 లక్షల క్యూసెక్కులకు పైగా జలాలు వస్తే గట్టు పైనుంచి నీరు ప్రవహిస్తుంది. 2022 జులై వరదలకు గట్టుపై మీటరు పైనుంచే వరద ప్రవహించగా సుమారు 20 లారీల ఇసుక బస్తాల్లో వేసి గట్టు పొడవునా తాత్కాలికంగా వేసి మిన్నకున్నారు.

  •  కె.గంగవరం మండలం సుందరపల్లి, కమ్మరివారిసావరం, వద్ద గట్టు అత్యంత బలహీనంగా ఉంది. వరద వస్తే గట్టు జారిపోతోంది. అక్కడ రివెట్‌మెంట్‌ చేయాల్సి ఉంది.
  •  ముమ్మిడివరం మండలం అన్నంపల్లి అక్విడక్టు వద్ద కెనాల్‌ గట్టు బలహీనంగా ఉండడంతో రూ.30 లక్షలతో పనులు ఇటీవల పూర్తి చేశారు. పల్లంకుర్రు శివారు బూలవారిమొండి వద్ద ఏటిగట్టును పటిష్ఠం చేయకపోవడంతో ప్రమాదకర పరిస్థితి ఉంది.

ఐ పోలవరం మండలం కేశనకుర్రు వద్ద ఏటిగట్టుకు రంధ్రం 

రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయితే గుబులే..

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయితే కోనసీమలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటాయి. ఉమ్మడి జిల్లాలో గోదావరి ఏటిగట్లను 2006-2010లో 1986 వరదల స్థాయికి ఎత్తు చేశారు. అనేకచోట్ల అసంపూర్తి పనులు, నాణ్యతలేమి వల్ల సమస్య జటిలమవుతోంది.

  • ముమ్మిడివరం నియోజకవర్గంలో పళ్లవారిపాలెం వివేకానంద వారధి నుంచి పల్లంకుర్రు వరకు 14 కిలోమీటర్లు మేర జీఆర్‌బీ (గౌతమి రైట్‌ బ్యాంక్‌) ఏటిగట్టు ఉంది.
  • కపిలేశ్వరపురం మండలం అద్దంకివారిలంక, కేదార్లంక పరిధి లంక భూములు సుమారు వంద ఎకరాలు కోతకు గురైనట్లు అంచనా. అద్దంకివారిలంక పుష్కర ఘాట్‌ నుంచి 500 మీటర్ల గట్టును రాతి కట్టుబడితో పటిష్ఠం చేయాలన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. 
  • ఆత్రేయపురం మండలంలో ఆధునికీకరణ పనులు అసంపూర్తిగా వదిలేశారు..50 

కిలోమీటర్ల పరిధి ఆందోళనే..రాజోలు సబ్‌ డివిజన్‌ పరిధిలో వశిష్ఠ ఎడమ, వైనతేయ కుడి, ఎడమ ఏటిగట్లు ఉన్నాయి. లంకల గన్నవరం, నాగుల్లంక, వాడ్రేవుపల్లి, మానేపల్లి, తాటిపాక, సోంపల్లి, రాజోలు, రామరాజులంక, సఖినేటిపల్లి, రామేశ్వరం, గొంది, అంతర్వేది, పెదపట్నం, పాశర్లపూడి, బాడిలంక, ఆదుర్రు, గోకన్నమఠం గ్రామాల పరిధిలో 27.50 కిలోమీటర్ల మేర ఏటిగట్లు విస్తరించి ఉన్నాయి. రాజోలు, శివకోటి, టేకిశెట్టిపాలెం, సఖినేటిపల్లి వద్ద గట్టుపై రెండు అడుగుల మేర నీరు ప్రవహిచడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులే ఇసుక బస్తాలు అడ్డుగా వేసి తాత్కాలిక రక్షణ చర్యలు చేపట్టారు.

ప్రమాదంలో రాజోలు నియోజకవర్గ పరిధిలో 2022 వరదలకు రాజోలు, శివకోటి, టేకిశెట్టిపాలెం, సఖినేటిపల్లి వద్ద గట్టుపై రెండడుగుల ఎత్తు వరద నీరు ప్రవహించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులే ఇసుక బస్తాలు అడ్డుకట్టగా వేసి రక్షణ చర్యలు చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించినప్పుడు మేకలపాలెం వద్ద బాధితులతో మాట్లాడి... ఏటిగట్టు విస్తరణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా నేటికీ గట్టుపై గంపెడు మట్టి వేయలేదు.   

తీరప్రాంత రక్షణ, ఇతర పనులకు రూ.342 కోట్లతో ప్రతిపాదనలు వెళ్లినా మంజూరు కాలేదు. ఏటిగట్టు దెబ్బతిన్న ప్రాంతాన్ని పటిష్ఠం చేసేందుకు రూ.64.66 కోట్లు అవసరం.  సీఎం హామీ ఇచ్చినా నిధులు మంజూరు కాలేదు.
వరదలొస్తే చాలు.. ఉమ్మడి జిల్లా ఏటిగట్టు పొడవునా ఉన్న గ్రామాల ప్రజల వెన్నులో వణుకు మొదలవుతుంది. 2022 వరదకు పలుచోట్ల ప్రమాదకర పరిస్థితులు నెలకొనడంతో అప్పటికప్పుడు చేపట్టిన తాత్కాలిక చర్యలు తప్ప తరువాత పటిష్ఠ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీటి నిర్వహణ, పటిష్ఠతకు నిధులు విదల్చకపోవడం, కొన్ని పనులకు అరకొరగా కేటాయించినా.. సకాలంలో బిల్లులు కావన్న భయంతో గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో సమస్య మరింత జటిలమవుతోంది. సీఎం స్థాయిలో హామీలు ఇచ్చినా పరిస్థితిలో మార్పురాక వర్షాకాలంలో ప్రజలు బిక్కుబిక్కుమని బతికే పరిస్థితి. ఇసుక రీచ్‌ల్లో ఇష్టారీతిన తవ్వకాలూ పల్లెలకు ముప్పుగా మారుతున్నాయి.
ఈనాడు, రాజమహేంద్రవరం

గ్రామాల రక్షణ కవచం ఐ.పోలవరం మండల పరిధిలోని ఐలాండ్‌ రక్షణ గట్టుకు పలుచోట్ల రంధ్రాలు పడి, దిగబడి బలహీనంగా ఉంది. జీఎంసీ బాలయోగి హయాంలో రక్షణ గట్టును ఎత్తుచేసి ఆధునికీకరించిన తరువాత దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు. పోలవరం దీవిలో ఉన్న 12 గ్రామాలకు రక్షణ కవచంలా ఉన్న 41 కిలోమీటర్ల మేర ఏటిగట్టు బలహీనపడి ప్రమాదాలను సూచిస్తోంది. 10 అవుట్‌ స్లూయిజ్‌లు శిథిల స్థితికి చేరాయి. గట్టుతోపాటు స్లూయిజ్‌లను ఆధునికీకరించాల్సి ఉంది.  22 ఏళ్ల క్రితం ఆధునికీకరించిన గట్టు పూర్తి అధ్వానంగా దర్శనమిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని